Nellore Youth India Tour: దేశాన్ని చుట్టేస్తున్న నెల్లూరు కుర్రాడు - జర్నీతో జీవితం విలువ ఇలా చెప్తున్నాడు !

Nellore Youth India Tour: నెల్లూరుకి చెందిన కార్తీక్ బైక్ పై దేశవ్యాప్త పర్యటన మొదలుపెట్టాడు. తమిళనాడు, కేరళ, కర్ణాటక చుట్టేసి.. ఇప్పుడు మహారాష్ట్రలో జీవితం విలువ గురించి తెలియజేస్తున్నాడు.

Continues below advertisement

నెల్లూరుకి చెందిన కార్తీక్ బైక్ పై దేశవ్యాప్త పర్యటన మొదలు పెట్టాడు. తమిళనాడు, కేరళ, కర్నాటక చుట్టేసి.. ఇప్పుడు మహారాష్ట్రలో అడుగు పెట్టాడు. బీటెక్ చదివిన కార్తీక్ ఆహా ఓటీటీ కోసం గీత సుబ్రహ్మణ్యం అనే వెబ్ సిరీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. కొత్తగా ఏదో చేయాలనుకున్నాడు. దేవుడిచ్చిన జీవితం ఎంతో అందమైనదని, దాన్ని ఆస్వాదించాలి కానీ, అర్థాంతరంగా ముగించకూడదనే సందేశాన్నిస్తూ దేశం మొత్తం చుట్టేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా బైక్ తీసుకుని బయలుదేరాడు. బట్టలు, అవసరమైతే బస చేయడానికి ఏర్పాట్లు అన్నీ సమకూర్చుకుని రయ్ రయ్ మంటూ దూసుకెళ్లాడు. 

Continues below advertisement

వేల కిలోమీటర్ల ప్రయాణం.. జీవితంపై సందేశాలు.. 
నాలుగు రాష్ట్రాలు చుట్టేశాడు. 40వేల కిలోమీటర్లు ప్రయాణించాడు, ఇంతా తన ప్రయాణాన్ని కొనసాగిస్తానంటున్నాడు. ప్రతి చోటా ఏదో ఒక కాలేజీలోనే, లేదా స్కూల్ లోనో ఆగి.. ఆత్మహత్యలు వద్దంటూ యువతకు సందేశమిస్తున్నాడు. కార్తీక్ గురించి సోషల్ మీడియాలో తెలుసుకున్న చాలామంది ఆయన్ని కలిసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయన జర్నీలో తాము కూడా భాగమవుతామంటున్నారు. ఆయనకు బస ఏర్పాట్లు చేసి ప్రోత్సహిస్తున్నారు. 

మానసిక ఒత్తిడిని జయిస్తే జీవితంలో విజయం దానంతట అదే వెతుక్కుంటూ వస్తుందని చెబుతున్నాడు కార్తీక్. ఒత్తిడి ఎదురైనప్పుడు కాసేపు ప్రకృతిలో సేదతీరాలంటున్నాడు. నెగెటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు  వెళ్లాలని సూచిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో డబ్బు వెనక, ఉద్యోగం, ఉపాధి వెనక పరిగెడుతూ.. మిగతా విషయాలన్నిటినీ మనిషి మరచిపోతున్నాడని, దాన్ని గుర్తు చేసేందుకే తన యాత్ర అని చెబుతున్నాడు కార్తీక్. 


ఊళ్లు, పొలాలు, ప్రాజెక్ట్ లు, అడవులు.. ఇలా అన్నీ దాటుకుంటూ సాహస యాత్ర చేస్తున్నాడు కార్తీక్. కర్నాటకలోని హెర్బిటౌన్, మహారాష్ట్రలోని అహ్మద్ పూర్ లో కార్తీక్‌కి స్థానికులు సన్మానం చేశారు. ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రజలు ప్రేమాభిమానాలతో తనను ఆదరిస్తున్నారని తన యాత్ర విశేషాలు చెబుతున్నాడు కార్తీక్. 

పట్టపగలే కొన్నిసార్లు మద్యం సేవించి డ్రైవింగ్ చేసేవారిని చూశానని చెబుతున్నాడు కార్తీక్. హైవేపై వెళ్లేటపుడు ఎన్నో యాక్సిడెంట్లను చూశాడు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు ఉండవని చెబుతున్నాడు. చిరునవ్వు, ఓపిక ఉంటే ప్రపంచంలో దేన్నయినా జయించవచ్చని తనకు తోచిన సలహాలు ఇస్తున్నాడు. 

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం.. 
లాంగెస్ట్ జర్నీ ఇన్ సింగిల్ కంట్రీ అనే వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టబోతున్నాడు కార్తీక్. 400 రోజులు, రోజూ 400 కిలోమీటర్ల ప్రయాణం. మొత్తంగా 1,50,000 కిలోమీటర్ల ప్రయాణం ఇదీ కార్తీక్ రికార్డ్. ప్రతిరోజూ తన ప్రయాణానికి సంబంధించిన వివరాలను గిన్నిస్ రికార్డ్స్ అఫిషియల్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయడం, ఆరోజు తన జర్నీ విశేషాలను సోషల్ మీడియాలో పంచుకోవడం.. ఇలా జరుగుతోంది కార్తీక్ ప్రయాణం. 

కార్తీక్ జర్నీని మీరు ఫాలోఅవ్వాలనుకుంటే   Instagram ప్రొఫైల్ : thetravellerkarthik OR karthiktupili
Youtube: thetravellerkarthik

Continues below advertisement