ఒక్కొకరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది, కానీ కొంతమంది చాలా విషయాల్లో ఆరితేరతారు. అలాంటి కొవకి చెందిన అమ్మాయే ఈ సువర్ణిక. వయసు కేవలం ఆరేళ్లు. తిన్నగా మాట్లాడటం కూడా రాదు కానీ, గణితంతో ఆటలు ఆడుకుంటుంది సువర్ణిక. అక్షరాలతో అద్భుతాలు చేస్తూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
ఒకటా రెండా సువర్ణిక టాలెంట్స్ గురించి ఎన్నని చెప్పగలం..
అద్దంలో కనపడేలా రివర్స్ లో అక్షరాలను రాగయగలదు సువర్ణిక..
ఇంగ్లిష్ అక్షరమాలలో ఏ అక్షరం చెప్పినా, దానికి సంబంధించిన నెంబర్ చెప్పేస్తుంది.
కేవలం ఇంగ్లిష్ మాత్రమే కాదు, తెలుగు, హిందీ అక్షరమాలను కూడా అంకెలతో జత చేస్తుంది.
రివర్స్ లో టేబుల్స్ రాయగలదు...
ఇంగ్లిష్ లెటర్స్ తో టేబుల్స్ రాయడంలో దిట్ట..
ట్వంటీ టేబుల్స్ ని ఎటునుంచి ఎటైనా రాసేస్తుంది.
అవార్డులు - రివార్డ్ లు
ఆరేళ్ల వయసుకే ఈ అమ్మాయి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. అంతే కాదు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు కూడా సువర్ణిక ప్రతిభను మెచ్చి జ్ఞాపికను బహూకరించారు. ఇంకా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆమె సొంతం. గిన్నిస్ బుస్ లో కూడా ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు తల్లిదండ్రులు..
ఈ విద్య ఎలా వచ్చింది..?
ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులు చదువుకోమ్మా అని పోరు పెడితేనే ఎవరైనా పుస్తకం పట్టుకుంటారు. కానీ సువర్ణిక తల్లిదండ్రులు శ్రీనివాసరావు, కల్యాణి తమ కూతురు ప్రతిభ చూసి ఆశ్చర్యపోతున్నారు. నెల్లూరు జిల్లా కావలి మున్సిపాల్టీలోని వాయునందన ప్రెస్ వీధిలో వీరు నివాసం ఉంటున్నారు. తండ్రికి బట్టల కొట్టు ఉంది. సువర్ణిక కరోనా లాక్ డౌన్ టైమ్ లో అక్షరాలతో ఆటను ప్రాక్టీస్ చేసిందని, తమ ప్రోత్సాహం లేకుండానే తనకు తానుగా వాటిపై ఆసక్తిని పెంచుకుందని చెబుతున్నారు తల్లిదండ్రులు.
సువర్ణిక బాలమేధావిగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకటో తరగతికే ఇన్ని విద్యలు నేర్చిన సువర్ణిక పెద్దయితే మరెన్ని అద్భుతాలు చేస్తుందోనని ఆశ్చర్యపోతున్నారు తల్లిదండ్రులు. తనకున్న పరిజ్ఞానం గురించి ఏమాత్రం తెలియని పసితనం సువర్ణికది. ముద్దు ముద్దు మాటలతో సువర్ణిక అందర్నీ ఆకట్టుకుంటుంది.
ఎక్కడో బాల మేధావి, ఏవేవో అద్భుతాలు చేశారని వినడమే కానీ, ఇలాంటి ఓ అమ్మాయి తమ చుట్టూ ఉందని కావలి వాసులకి కూడా పెద్దగా తెలియదు. సువర్ణిక ఇప్పుడిప్పుడే కావలిలో బాగా ఫేమస్ అవుతోంది. ఆమె ప్రతిభ అందరికీ తెలుస్తోంది.
సువర్ణిక టాలెంట్ తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుండటం తమకు సంతోషాన్నిస్తోందని అంటున్నారు తల్లిదండ్రులు. భవిష్యత్తులో ఆమెకు మరింత ట్రైనింగ్ ఇప్పించి మ్యాథ్స్ లో మేథావిగా తీర్చి దిద్దుతామని చెబుతున్నారు. ఒకటో తరగతికే తమ కుమార్తె ఇలాంటి ప్రతిభ చూపుతుందని తాము అస్సలు ఊహించలేదని అంటున్నారు తల్లిదండ్రులు.