MLA Kotamreddy Sridhar Reddy Protest: వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం గతంలో ఓసారి మురికి కాల్వలో దిగి నిరసన తెలిపారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఉమ్మారెడ్డి గుంట ప్రాంతంలో వర్షాలు పడినప్పుడు మురికి కాల్వలు పొంగి పొర్లి ఆ నీరంతా ఇళ్లలోకి వస్తాయి. అక్కడ పక్కాగా డ్రైనేజీలు నిర్మించాలనే డిమాండ్ ఉండేది. అప్పట్లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ రెడ్డి.. డ్రైనేజీల నిర్మాణం కోసం మురికి కాల్వలో దిగి నిరసన తెలిపారు. తాజాగా మరోసారి డ్రైనేజీలోకి దిగి ఎమ్మెల్యే నిరసన తెలపగా.. వద్దు సార్ బయటకు వచ్చేయండంటూ స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఆయన వేడుకుంటున్నారు. ఆయన మాత్రం తగ్గేదేలే అంటూ మురికి కాల్వలోనే కూర్చుని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తానని చెప్పారు.


ఇప్పుడు అధికారంలో వైసీపీ.. కానీ ప్చ్
ఏపీలో ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉంది. అంటే తమ సొంత పార్టీ హయాంలోనూ ఏ మార్పు జరగలేదని కోటంరెడ్డి నిరసనకు దిగారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఇక్కడ డ్రైనేజీలు నిర్మించలేదు. దీంతో సహజంగానే ఇప్పటి ప్రతిపక్ష టీడీపీ, ఇతర నేతలు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చినా కూడా సమస్య పరిష్కారం అవకపోవడంతో.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మరోసారి రంగంలోకి దిగారు. రైల్వే అధికారుల నిరంకుశ వైఖరిని, కార్పొరేషన్ అధికారుల నత్తనడకని విమర్శిస్తూ తాను మురికి గుంటలో దిగుతున్నానని చెప్పారు. సమస్య పరిష్కారం కోసం లిఖిత పూర్వక హామీ ఇచ్చే వరకు అక్కడినుంచి కదిలేది లేదన్నారు.


వైఎస్ఆర్‌సీపీలో సొంత పార్టీ నేతలే తమపై కుట్రలు చేస్తున్నారనేవారి సంఖ్య పెరుగుతోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ తరహా ఆరోపణలు చేసి గంటలు గడవక ముందే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అవే  ఆరోపణలు చేశారు.  తాను కూడా బాలినేని లాగే సొంత పార్టీ నేతల బాధితుడినేనని అన్నారు. పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని మండిపడ్డారు. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలీని కొంతమంది ముఖ్యనేతలు నా నియోజకవర్గంలోకి వస్తున్నారని అన్నారు. నెల్లూరు రూరల్ లో తనను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అయినా కూడా ప్రజల అండ, ముఖ్యమంత్రి జగన్ ఆశీస్సులు ఉన్నంత వరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. 


పార్టీ మారే ప్రసక్తే లేదన్న కోటంరెడ్డి ! 
మాజీ మంత్రి అనిల్ తో తనకు సత్సంబంధాలున్నాయని ఇటీవల చెప్పారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. అనిల్ తోనే కాదు, నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోనూ తనకు మంచి సంబంధాలే ఉన్నాయని, అయితే కొంతమంది మాత్రం తన నియోజకవర్గం జోలికి వస్తున్నారని మండిపడ్డారు.  తాను పార్టీ మారతానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపారేశారు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. అలాంటి ప్రశ్న తనకు సంబంధించింది కాదని, తానెప్పటికీ వైసీపీలోనే ఉంటానన్నారు. సీజనల్ పొలిటీషియన్లలాగా తాను పార్టీలు మారనని చెప్పారు.  
Also Read: Nellore News : రాజకీయ నాయకులు వ్యాపారాలు చేస్తే తప్పా? టీడీపీపై ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫైర్