Nellore Politics : రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా వైసీపీ ప్లీనరీలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు, జిల్లా మంత్రులు, జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా ఈ ప్లీనరీ జరిగింది. అయితే ఇక్కడ ఓ ఆసక్తికర చర్చ మొదలైంది. నెల్లూరులో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ సీటు ఎవరికిస్తారు? అనే చర్చ మొదలైంది. సిట్టింగ్ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరు మాత్రం వినపడలేదు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. 


తెరపైకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి


నెల్లూరు ఎంపీగా వైసీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి కొనసాగుతున్నారు. 2024లో ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తారా లేదా..? అనే అనుమానం ఎవరికీ లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో చర్చ ఎవరూ మొదలు పెట్టలేదు. కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఈ చర్చ మొదలైంది. నెల్లూరు జిల్లా నుంచి ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వచ్చే దఫా నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలనే ఆశాభావం వ్యక్తం చేశారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆయన కాకపోతే ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి అయినా నెల్లూరు ఎంపీగా పోటీ చేయాలని, ఈ మేరకు నెల్లూరు రూరల్ ప్రజల తరపున తాను సీఎం జగన్‌కి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. మరి ఇప్పుడున్న ఎంపీ ఏం చేయాలి. ఆదాల రాజకీయ సన్యాసం తీసుకుంటారా? లేకపోతే ఆయనకు టికెట్ ఇవ్వరని ముందే తెలిసిందా? మొత్తానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తించాయి. 2024 నెల్లూరు ఎంపీ సీటుని వైసీపీ ఎవరికి ఖరారు చేస్తుందనే చర్చ ఇప్పుడే మొదలైంది. 


టీడీపీ నుంచి వైసీపీకి


2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. ఆయన ఎంపీ అభ్యర్థిగా ప్రచారం కూడా మొదలుపెట్టారు. సరిగ్గా టికెట్లు ఖరారు చేస్తున్నవేళ.. ఆదాల సడన్‌గా పార్టీ మారారు. వైసీపీలో చేరారు. అంతే కాదు, ఎంపీ టికెట్ కూడా సాధించారు. అప్పటికప్పుడు టీడీపీ అభ్యర్థిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. టీడీపీ నుంచి బీదా మస్తాన్ రావు ఆదాలకు పోటీగా బరిలో నిలిచి ఓడిపోయారు. ఆదాల వైసీపీ తరపున ఎంపీగా గెలిచారు. విచిత్రం ఏంటంటే బీదా మస్తాన్ రావు కూడా ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఆయన ఇప్పుడు రాజ్యసభ సభ్యులు కూడా. అలా అప్పటి ప్రత్యర్థులు.. ఇప్పుడు ఇద్దరూ ఎంపీలుగా ఉండటం విశేషం. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ.. 2024 నెల్లూరు టికెట్ వ్యవహారం ముందస్తుగా ఇప్పుడు చర్చకు రావడమే ఆసక్తిగా మారింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలబడనని చెప్పారా.. లేక ఆయనకు టికెట్ రాదనే విషయం కన్ఫామ్ అయిందా.. పోనీ ఆయన వారసులెవరూ బరిలో నిలిచే అవకాశం లేదా అనే చర్చ నడుస్తోంది. సడన్‌గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లేదా ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి పోటీ చేస్తారని చర్చ రావడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. మరి దీనిపై ఆదాల ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.