నెల్లూరు జిల్లా రాజకీయం ఇప్పుడు రాష్ట్రం మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపించడం, ఆ తర్వాత అధిష్టానం సీరియస్ కావడం, అనుచరులతో కలసి కోటంరెడ్డి మంతనాలు సాగించడం, మరుసటి రోజు ఇన్ ఛార్జ్ బాలినేని శ్రీనివాసులరెడ్డి నెల్లూరుకి వచ్చి.. వైసీపీ స్టాండ్ చెప్పడం అన్నీ చకచకా జరిగిపోయాయి. రెండురోజుల్లోనే నెల్లూరు రూరల్ రాజకీయం మొత్తం మారిపోయింది. అయితే ఇప్పుడు అంతకు మించి అన్నట్టుగా కోటంరెడ్డి ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ట్యాపింగ్ ఆధారాలు బయటపెడతానన్నారు. 


ఆధారాలు చూపిస్తే ఏపీ షేక్ అవుతుంది ! 
కోటంరెడ్డి ఫోన్ కాల్ ఆడియో లీక్ కావడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. 2024లో నెల్లూరు రూరల్ కి టీడీపీ తరపున తాను పోటీ చేస్తానన్నట్టుగా ఆ ఆడియోలో ఉంది. అంతే కాదు.. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని, దానికి తగిన ఆధారాలున్నాయని కూడా ఆయన చెబుతున్నట్టుగా ఉంది. ఆ ఆధారాలు చూపెడితే ఇద్దరు ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలు పోతాయని, ఏపీ షేక్ అవుతుందని, కేంద్రం ఎంక్వయిరీ మొదలు పెడుతుందని కూడా ఆయన అన్నారు. అయితే ఈ ఆడియో కాల్ లో కేవలం టీడీపీలో చేరతానన్నదాన్నే వైసీపీ స్వీకరించింది. ఫోన్ ట్యాపింగ్, ఆధారాలు అనే దాన్ని మాత్రం పట్టించుకోలేదు. టీడీపీలో చేరతానని బహిరంగంగానే చెప్పిన కోటంరెడ్డి, కావాలనే ఫోన్ ట్యాపింగ్ నాటకాలాడుతున్నారంటూ ఇన్ ఛార్జ్ బాలినేని చెప్పడం ఇక్కడ కొసమెరుపు. అవి ఆరోపణలు కావని, నిజమేనంటున్నారు కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు బయటపెడతానన్నారు. 


నెల్లూరులో ఉత్కంఠ..
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు బయటపెడతాననే సరికి నెల్లూరు రాజకీయాల్లో మళ్లీ ఉత్కంఠ రేగింది. అసలు ఆయన దగ్గర ఉన్న ఆధారాలేంటి.. ఆ ఆధారాలు చూపితే, మిగతా ఎమ్మెల్యేలలో కూడా కదలిక వస్తుందా. వైసీపీని అది అంతగా డ్యామేజీ చేస్తుందా అని సీనియర్లు తలలు పట్టుకున్నారు. అసలు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రెస్ మీట్ లో ఏం చెబుతారా అనే ఉత్కంఠ మొదలైంది. 


ఆధారాలుంటే ఏం చేస్తారు..?
పోనీ కోటంరెడ్డి నిజంగానే ఆధారాలు చూపిస్తారు. అవి ఫేక్ అని చెప్పడం, ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పడం ప్రభుత్వానికి నిమిషం పని అనే వాదన మొదలైంది. ఫేక్ అనే ముద్రవేసి కోటంరెడ్డిని లైట్ తీసుకునే అవకాశముంది. అయితే వీటిని కోటంరెడ్డి మరింత సెన్సేషన్ చేస్తే మాత్రం వైసీపీ ఇరుకున పడ్డట్టే. ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధం. అందులోనూ అధికార పార్టీ, పోలీసులతో, ఇంటెలిజెన్స్ వ్యవస్థతో కలసి ట్యాపింగ్ కి పాల్పడిందంటే అంతకంటే తప్పు ఇంకొకటి ఉండదు. ఇటీవల కేంద్రంలో పెగాసస్ వ్యవహారంలో ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇలా అందరి ఫోన్లు ట్యాప్ చేస్తుందని ఆధారాలతో సహా కోటంరెడ్డి నిరూపిస్తే అసలేం జరుగుతుందో వేచి చూడాలి. ఇంతకీ కోటంరెడ్డి దగ్గర ఉన్న ఆధారాలేంటి. రేపు ప్రెస్ మీట్ లో ఆయన ఏం నిరూపిస్తారనేది సస్పెన్స్ గా మారింది. కోటంరెడ్డి ప్రెస్ మీట్ తో ఆయన దగ్గర ఉన్న ఆధారాలేంటో తేలిపోతుంది.