నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మళ్లీ ప్రెస్ మీట్ పెట్టారు. ఈసారి ఆయన కాకాణికి కౌంటర్ ఇచ్చారు. తాను కూడా సెటైరికల్ గా మాట్లాడగలనని, కానీ రాజకీయ నాయకులకు అంతకు మించి ప్రజాశ్రేయస్సు ముఖ్యం అని, తాను అందుకోసమే కృషి చేస్తామన్నారు. తన బావ కాకాణిపై సీబీఐ కేసు ఉందని, ముందు దాని సంగతి చూసుకోవాలని హితవు పలికారు. కోర్టులో అన్ని పత్రాలుంటే కాకాణి కేసు పత్రాలే ఎందుకు మాయమయ్యాయని ప్రశ్నించారు.


జగన్ కంటే, సజ్జల ఎక్కువయ్యారు..


జగన్ విషయంలో మా బావ కాకాణి తనపై ఘాటు విమర్శలు చేయలేదని, కానీ సజ్జలను అన్నందుకే ఆయన ఎక్కువగా ఫీలయ్యారని చెప్పారు. రామకృష్ణారెడ్డి పేరెత్తితేనే కాకాణి ఉలిక్కిపడ్డారని చెప్పారు. సజ్జలే కాకాణికి మంత్రి పదవి ఇప్పించారని, వారిద్దరి మధ్య లావాదేవీలున్నాయని మండిపడ్డారు. సజ్జలని అంటే కాకాణికి కోపం వస్తుందని చెప్పారు.


వార్నింగ్ కాల్స్ వస్తున్నాయి..


తనకు గతంలో నెల్లూరు రూరల్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చేవని, ఈసారి రాష్ట్రవ్యాప్తంగా కాల్స్ వస్తున్నాయని, కొంతమంది బెదిరిస్తూ కాల్స్ చేస్తున్నారని, అందులో బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి కూడా ఉన్నారని, ఆయన రికార్డ్ చేసిన ఆ వాయిస్ బయటకొచ్చిందని చెప్పారు.


సజ్జలా ఇదే నీకు హెచ్చరిక..


నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తనకు వచ్చే బెదిరింపు ఫోన్ కాల్స్ వెనక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని ఆయన చెప్పారు. సజ్జలకు ఇదే తన వార్నింగ్ అన్నారు. తనకు ఇలానే బెదిరింపు కాల్స్ వస్తే.. రూరల్ నియోజకవర్గం నుంచి కూడా సజ్జలకు వీడియోకాల్స్ వస్తాయని చెప్పారు. సజ్జల తట్టుకోలేరని అన్నారు. సజ్జలకు ఇలాంటి అలవాటు ఉందని, ఆయన కోటరీ నుంచే ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు.


అది దొంగకేసు..


తనపై కిడ్నాప్ కేసు పెట్టారని, హత్యాయత్నం కేసు కూడా పెట్టొచ్చని చెప్పారు. దొంగకేసులు పెట్టాలనుకున్నప్పుడు ఒక కేసుతో ఎందుకు వదిలిపెట్టాలన్నారు. తానీ ఏ కార్పొరేటర్ ఇంటికి వెళ్లి బెదిరించలేదని, అలా బెదిరిస్తే ఎవరూ బెదిరిపోరని, అనుబంధంతోనే ఎవరైనా తమతో ఉండాలన్నారు. విజయ భాస్కర్ రెడ్డి అనే కార్పొరేటర్ విషయంలో తాము ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ నియోజకవర్గంలో గెలిపించామని, కానీ చివరకు ఆయన ఇలా మారిపోయారని చెప్పారు.


కార్పొరేటర్లు ఉంటారో లేరో, కార్యకర్తలు ఉంటారు..


తనతోపాటు ఎంతమంది కార్పొరేటర్లు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు ఉంటారో తెలియదు కానీ కార్యకర్తలు మాత్రం తనతోనే ఉంటారని చెప్పుకొచ్చారు. కార్యకర్తలంతా తనతోపాటే ఉన్నారన్నారు. కార్పొరేటర్లు మాత్రం తమకు బిల్లులు రావాలని చెబుతున్నారని, వారిని తాను ఇబ్బంది పెట్టబోనన్నారు కోటంరెడ్డి.


అధికారంకోసం తాను అర్రులు చాసేవాడిని కాదని,  ఐదేళ్లకోసం ప్రతిపక్షంలో ఉండగా టీడీపీలోకి వెళ్లి ఉండేవాడినని అన్నారు. ఈరోజు 17నెలలు అధికారం ఉండగా తాను ఎందుకు వెళ్లిపోతున్నానో ఆలోచించాలన్నారు. ప్రభుత్వంతో విభేదిస్తే ఏమవుతుందో అందరికీ తెలుసన్నారు. రఘురామకృష్ణంరాజుకి ఏం జరిగిందో తెలుసుకదా అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులకంటే, ప్రభుత్వంతో విభేదించిన రఘురామకృష్ణంరాజు ఇబ్బందిపడ్డారని చెప్పారు. తన జోలికి రాకపోతే తాను ఎవరి జోలికి రానని, తనను గెలకుతానంటే మాత్రం వెనక్కు తగ్గబోనన్నారు.