2022 అక్టోబర్‌లో నమోదైన కేసు అది. అప్పట్లో టీడీపీ నేత మాతంగి కృష్ణపై దాడి జరిగిందంటూ ఆయన పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు. ఆ కంప్లయింట్ లో రూరల్ ఎమ్మెల్యే పేరు లేదని అంటున్నారు. అయితే ఆయన అనుచరులపై ఫిర్యాదు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతోపాటు, హత్యాయత్నం కింద కూడా కేసు నమోదు చేశారు. కానీ వారంతా అధికార పార్టీ నేతలు కావడం, సాక్ష్యాధారాలు సమగ్రంగా లేవన్న కారణంతో ఏ ఒక్కరూ అరెస్ట్ కాలేదు.
కట్ చేస్తే ఇప్పుడు ఎమ్మెల్యే కోటంరెడ్డి పార్టీకి దూరం జరిగారు. ఆ కేసులో ఉన్న ఎమ్మెల్యే అనుచరులు ఒక్కొక్కరే అరెస్ట్ అవుతున్నారు. కోటంరెడ్డి పేరు కూడా నిందితుల జాబితాలో ఉందని పోలీసులు ప్రకటించారు. అంటే రేపు మాపో కోటంరెడ్డి కూడా అరెస్ట్ అవుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ దశలో కోటంరెడ్డి ట్విస్ట్ ఇచ్చారు. హైకోర్టుని ఆశ్రయించారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, ఫిర్యాదు చేసిన సమయంలో అసలు తన పేరు కూడా అందులో లేదని, ఇప్పుడు కొత్తగా చేర్చారని, ఆ కేసులు కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి తరపు వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. కేసుని రెండు వారాలు వాయిదా వేసింది.
నెల్లూరులో వైసీపీ రాజకీయం రంజుగా సాగుతోంది. వైసీపీలో ఉన్నప్పుడు నమోదైన కేసులకు, కోటంరెడ్డి వర్గం వైసీపీ నుంచి బయటకొచ్చాక అరెస్ట్ లు మొదలయ్యాయి. పోలీసులపై కోటంరెడ్డి వర్గం తీవ్ర విమర్శలు చేస్తున్నా.. వారు మాత్రం సాక్ష్యాధారాలు దొరికాయి కాబట్టి ఇప్పుడు అరెస్ట్ లు మొదలయ్యాయి అంటున్నారు. అయితే ఎమ్మెల్యే కోటంరెడ్డి పేరు కూడా ఆ కేసులో ఉండటంతో హడావిడి మొదలైంది. ఆయన్ను అరెస్ట్ చేయడానికే పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ఆయన ముందుగానే హైకోర్టులో పిటిషన్ వేశారు.
తీవ్ర ఒత్తిడి..
కోటంరెడ్డి వర్గంపై అధిష్టానం నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తోంది. నయానో భయానో కోటంరెడ్డి వర్గాన్ని తమవైప తిప్పుకోవాలని చూస్తోంది. ఇప్పటికే మెజార్టీ కార్పొరేటర్లు ఆయన చేజారారు. ఒక్కొక్కరే రూరల్ వైసీపీ ఇన్ చార్జ్, ప్రస్తుత నెల్లూరు ఎంపీ ఆదాల వైపు వచ్చేస్తున్నారు. మరోవైపు కోటంరెడ్డి అనుచరుల అరెస్ట్ కూడా మొదలైంది. దీంతో ఆయన వర్గంపై సహజంగానే ఒత్తిడి పెరిగింది.
పొలిటికల్ గేమ్ లో పైచేయి ఎవరిది..?
నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ చార్జ్ గా ఆదాల పేరు ప్రకటించిన తర్వాత ఓ రేంజ్ లో హడావిడి జరిగింది. అయితే ఆ తర్వాత ఆ హడావిడి తగ్గింది. ప్రస్తుతం ఆదాల ప్రభాకర్ రెడ్డి గడప గడప కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అటు ఎమ్మెల్యే కోటంరెడ్డి కూడా ప్రజా ఆశీర్వాద యాత్ర మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. దీంతో రూరల్ లో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. మరోవైపు టీడీపీ నేతలు కొంతమంది ఎమ్మెల్యే కోటంరెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఆయన తమ పార్టీలోకి వద్దు అంటున్నారు. అంటే పరోక్షంగా ఆయనపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దశలో కేసులతో కూడా ఆయనకు చికాకులు ఎదురయ్యే అవకాశముంది. దీంతో ఆయన హైకోర్టులో ముందస్తుగా పిటిషన్ దాఖలు చేశారు. మొత్తమ్మీద నెల్లూరు రాజకీయాలు మాత్రం మరింత ఆసక్తిగా మారాయి.