నెల్లూరు జిల్లాలో కుటుంబ రాజకీయాలపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. అందరూ వాళ్లేనా అని అన్నారు. ఆయా కుటుంబాలవారే తరతరాలుగా రాజకీయాల్లో ఉన్నారని, తనకు రాజకీయ వారసత్వం లేకున్నా పోరాటాలతో ఎదిగానని స్పష్టం చేశారు. పుట్టబోయే బిడ్డకు కూడా ముందుగానే ఎమ్మెల్యే సీటు రిజర్వ్ చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ రూరల్ ఎమ్మెల్యే టార్గెట్ ఎవరనేది అంతు చిక్కడం లేదు. ఎవరి పేరు ఆయన ప్రస్తావించలేదు, ఎవరి కుటుంబాన్ని ఆయన వేలెత్తి చూపించలేదు. రూరల్ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో కార్యకర్తలు, నేతలతో ఆయన మాట్లాడారు. గతంలో తనకు రాజకీయంగా అవకాశాలు వచ్చినా పెద్ద కుటుంబాలు అనేకసార్లు తన గొంతును కోశాయని ఆవేదన వ్యక్తం చేశారు. పదవులన్నీ వారే అనుభవిస్తున్నారని.. ఇకనుంచి ఈ ధోరణి కొనసాగనివ్వబోమన్నారు శ్రీధర్ రెడ్డి. 



నెల్లూరులో అసలేం జరుగుతోంది..?
నెల్లూరులో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని పార్టీ దూరం పెట్టింది. అక్కడ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ప్రోత్సహిస్తున్నారు జగన్. అయితే ఆ విషయం అక్కడితో ఆగిపోలేదు. వచ్చే ఎన్నికలనాటికి ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరిని వదిలేసి కొత్త నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంది. సహజంగా ఆనం కుటుంబానికి నెల్లూరు సిటీ, రూరల్ లో పట్టు ఉంది. గతంలో ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా గెలిచారు. ఈసారి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే.. ఆయన్ని బలంగా ఢీకొట్టేందుకు వైసీపీ ఎత్తుగడలు వేస్తోంది. ఈ సమయంలో నెల్లూరు రూరల్ లో ఆనం విజయ్ కుమార్ రెడ్డి నేనున్నానంటూ తెరపైకి వచ్చారు. అన్నతో తనకేం సంబంధం లేదని, తాను వైసీపీతోనే ఉంటానని ఇటీవలే జగన్ ని వెళ్లి కలిసొచ్చారాయన. ఆయనకు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సపోర్ట్ కూడా ఉందని అంటారు, ఆ తర్వాత మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి కూడా విజయ్ కుమార్ రెడ్డితో సఖ్యతగానే ఉంటారు. రాగాపోగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, ఆనం విజయ్ కుమార్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. గతంలో ఇద్దరూ ప్రాణ స్నేహితుల్లా, అన్నదమ్ముల్లా ఉన్నా కూడా.. ఆ తర్వాత పొరపొచ్చాలు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఆనం కుటుంబం రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సీటుకి ఎసరు పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 


నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ తరపున ఆనం రామనారాయణ రెడ్డి, వైసీపీ తరపున ఆనం విజయ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తే.. టఫ్ ఫైట్ ఉంటుందనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి కుటుంబాల పేరెత్తి విమర్శలతో విరుచుకుపడ్డారని అంటున్నారు. 


శ్రీధర్ రెడ్డి టార్గెట్ ఎవరు..?
రాజకీయాల్లో తాను ఖరాఖండిగా ఉంటానని తాజాగా జరిగిన కార్యకర్తల సమావేశంలో తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తాను సామాన్యుడిగా జెండా మోసి ఈ స్థాయికి వచ్చానని.. తాను రాజకీయ కుటుంబం నుంచి రాలేదన్నారు. తనవాళ్ల కోసం ఎవరితోనైనా ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు శ్రీధర్ రెడ్డి. ప్రజా సమస్యల కోసం తాను జైలుకు కూడా వెళ్లిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. తనను నమ్ముకున్న వాళ్లకు అన్యాయం చేసే ప్రసక్తే లేదన్నారు. ఇన్ని చెప్పిన ఆయన.. కుటుంబాలు, వారసత్వాలు, మంత్రి పదవులు అనే సరికి అధికార పార్టీకే ఆ వ్యాఖ్యలు ముల్లులా గుచ్చుకున్నాయని అంటున్నారు. మరి శ్రీధర్ రెడ్డి ఎందుకంత అసంతృప్తితో ఉన్నారనేది తేలాల్సి ఉంది. 


ఆమధ్య సామాజిక పింఛన్ల తొలగింపు తర్వాత ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేసిన ఘాటు వ్యాఖ్యలు కలకలం రేపాయి. దాంతో సీఎం జగన్ నేరుగా ఆయన్ను పిలిపించుకుని మాట్లాడారు. మరోసారి ఇప్పుడు శ్రీధర్ రెడ్డి కుటుంబాలు, వారసత్వాలంటూ చేసిన కామెంట్లు నెల్లూరు రాజకీయాల్లో అలజడి రేపుతున్నాయి.