ఏపీలో భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్న జిల్లాల్లో నెల్లూరు ఒకటి. కొన్ని రోజుల కిందట కురిసిన భారీ వర్షాలతో జిల్లా వాసులు తీవ్రంగా నష్టపోయారు. గత రెండు రోజులుగా మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నెల్లూరు-చెన్నై జాతీయ రహదారిపైకి వరదనీరు చేరుకుంది. గూడూరు సమీపంలోని ఆదిశంకర కాలేజీ వద్ద రహదారికి అటు ఇటు భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం తలెత్తింది. రహదారిపైనుంచి కూడా వరదనీటి ప్రవాహం మెల్లగా పెరుగుతోంది. దీంతో వాహనాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
నెల్లూరు-చెన్నై నేషనల్ హైవే పక్కన పార్కింగ్ చేసిన వాహనాలు దాదాపుగా నీటమునిగిపోయాయి. లారీలు సైతం వరద నీటికి కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. దీంతో రహదారిపై కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ ని తాత్కాలికంగా ప్రారంభించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేయడానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. భారీ వర్షాలకు హైవేపై దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
సోమశిలకు పెరిగిన వరద..
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరింది. తాజాగా కురుస్తున్న వర్షాలతో ప్రవాహం మరింతగా పెరగడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. సోమశిలకు వరదనీరు పోటెత్తడంతో ఒకేసారి 12 గేట్లు ఎత్తి ఒకేరోజు 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరోవైపు వరద నీటితో పెన్నా పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి.
Also Read: మరో అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీని ముంచెత్తుతున్న వర్షాలు.. మరో రెండు రోజులు దంచికొట్టనున్న వానలు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు అనూహ్యంగా ఇన్ ఫ్లో పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒకేరోజు అధిక సంఖ్యలో గేట్లు ఎత్తివేసి భారీ మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోమశిల ప్రాజెక్ట్ కి ఇన్ ఫ్లో క్రమంగా పెరుగుతుండటం స్థానికంగా ఆందోళన పెంచుతోంది. 95వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వరకు వస్తోంది. ఇటీవల జరిగిన పరిణామాలతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్తగా మొత్తం 12 గేట్లు ఎత్తి.. లక్షా 15వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Also Read: కడప, చిత్తూరు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు... చిత్తూరు జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన