టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రతో నెల్లూరు జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, రాజీనామా సవాళ్లతో నాయకులు ఊగిపోతున్నారు. అయితే పార్టీ మీటింగ్ లో మాజీ మంత్రి సోమిరెడ్డి ఓ బాంబు పేల్చారు. నెల్లూరు ఎంపీ, ప్రస్తుతం నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ చార్జ్ గా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా త్వరలోనే గోడదూకేస్తారని అన్నారు. దీంతో మరోసారి కలకలం రేగింది. దాంతో షాకైన ఆదాల.. నేను పార్టీ మారట్లేదు బాబోయ్ అంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ఎందుకీ పుకార్లు..
ఆదాల ప్రభాకర్ రెడ్డికి సరిగ్గా ఎన్నికల ముందు పార్టీలు మారడం రివాజు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ బీఫామ్ తీసుకుని ప్రచారంలో ఉన్న ఆదాల, ప్రభుత్వం నుంచి రావాల్సిన కాంట్రాక్ట్ బిల్లుల బకాయిలు మొత్తం వచ్చేయడంతో సడన్ గా ప్లేటు ఫిరాయించారు. టీడీపీ ప్రచారం నుంచి నేరుగా జగన్ దగ్గరకు వెళ్లి నెల్లూరు ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. అప్పటికప్పుడు టీడీపీ అభ్యర్థి కోసం హడావిడి పడి బీదా మస్తాన్ రావుని ఆదాలకి వ్యతిరేకంగా నిలబెట్టింది. ఆ ఎన్నికల్లో ఆదాల గెలవడం, ఆ తర్వాత బీదా మస్తాన్ రావు కూడా వైసీపీలోకి వెళ్లడం తెలిసిందే. సరిగ్గా 2024 ఎన్నికల ముందు కూడా అలాంటి సీన్ రిపీట్ అవుతుందన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆదాల కూడా టీడీపీలోకి వస్తారని, అయితే ఆయనకో అలవాటు ఉందని, సరిగ్గా ఎన్నికలకు ముందు ఆ పని చేస్తారని చెప్పారు. దీంతో నెల్లూరులో మరోసారి కలకలం రేగింది. ఆదాల వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ నుంచి బయటకు రానని మీడియా ప్రకటన విడుదల చేశారు ఎంపీ ఆదాల. ఎన్నికలు సమీపించే తరుణంలో తాను పార్టీ మారుతానని సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఆదాల ఖండించారు. అభూత కల్పనలు, అవాస్తవ విషయాలను ప్రచారం చేయడం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికే చెల్లిందన్నారు. లేనిపోనివి కల్పించి సమావేశంలో మాట్లాడటం దురుద్దేశ పూరితమైనదని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత జగన్ తనను నమ్మి ఎంపీ అభ్యర్థిగా గతంలో బరిలోకి దింపారని, ఆ నమ్మకాన్ని తాను నిలబెట్టుకుని నెల్లూరు ఎంపీగా గెలిచానన్నారు ఆదల. ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా అందరికంటే ముందుగా తనను ప్రకటించి తనపై నమ్మకాన్ని వెల్లడించారని తెలిపారు. దానిని కాపాడుకుంటానని, ఎట్టి పరిస్థితుల్లోనైనా వైసీపీ అభ్యర్థిగానే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బరిలో ఉంటానని స్పష్టం చేశారు. తాను రూరల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని తెలిసిన వెంటనే ఒక పథకం ప్రకారం టీడీపీ మోసపూరితమైన ఒక ప్రచారాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. గత నాలుగు నెలలుగా గోబెల్స్ ప్రచారం మొదలైందని విమర్శించారు.
ప్రజలను అయోమయానికి గురిచేసి తనకు, పార్టీకి నష్టం కలిగించాలనే ఉద్దేశంతోనే టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ ఆదాల. టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని, దీనిని ఎవరు నమ్మబోరని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పట్ల ప్రజలు నమ్మకంతో ఉన్నారని, ఎక్కడలేని ప్రజాదరణ జగన్ కు మాత్రమే ఉందన్నారు. గత నాలుగేళ్లలో జరిగిన స్థానిక, ఉప ఎన్నికల్లో లభించిన ఆదరణే దీనికి ఉదాహరణ అని తెలిపారు. కేవలం సంక్షేమానికే పరిమితం కాకుండా, అభివృద్ధికి కూడా సముచిత స్థానాన్ని కల్పించి ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
ప్రజల చేత ఎన్నోసార్లు తిరస్కరణకు గురైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఇంకా జ్ఞానోదయం కలగలేదని, అందుకే తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు ఆదాల. జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు కూడా వారి మాటలను నమ్మబోరని చెప్పారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial