Nellore YSRCP Politics: ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. 2019 ఎన్నికల్లో పదికి పది స్థానాల్లో వైసీపీ గెలిచినా.. ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ (AP CM YS Jagan Mohan Reddy) కి గుడ్ బై చెప్పడం విశేషం. ఆ ముగ్గురూ జగన్ సామాజిక వర్గానికి చెందినవారే కావడం మరో విశేషం. ఇక మిగిలినవారిలో కూడా కొందరికి స్థానచలనం తప్పదనే సంకేతాలు కనపడుతున్నాయి. ఈ దశలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ (Nellore City MLA Anilkumar Yadav) వ్యవహారం కాస్త ఆసక్తిగా మారింది.
అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ నుంచి వరుసగా రెండుసార్లు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ మొదటి మంత్రి వర్గంలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. రెండోసారి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. జిల్లాకు చెందిన కాకాణి గోవర్దన్ రెడ్డికి జగన్ వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చారు. దీంతో జిల్లా రాజకీయం రసవత్తరంగా మారింది. మంత్రి పదవి కోల్పోయిన అనిల్, కొత్తగా పదవి తెచ్చుకున్న కాకాణి మధ్య పరోక్ష యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో అనిల్ ఒంటరిగా మారిపోవాల్సి వచ్చింది. జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలతో అనిల్ ప్రత్యేకంగా కలసిన సందర్భం లేదు. నెల్లూరు నగరంలో జరిగే కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కావడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే మంత్రి కాకాణి హాజరయ్యే ఏ కార్యక్రమంలోనూ అనిల్ కనపడరు. అనిల్ కార్యక్రమానికి మిగతా ఎమ్మెల్యేలు రారు.
అనిల్ నియోజకవర్గంపై పుకార్లు..
నెల్లూరు జిల్లాలో అందరు ఎమ్మెల్యేలను కలుపుకొని వెళ్తున్నారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. అనిల్ ఒక్కరే ఆయన జట్టులో లేరు. అంటే కాకాణి జట్టులో ఉన్న అందరితోనూ అనిల్ కి వైరం ఉంది. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో అనిల్ కి సఖ్యత లేదని తెలుస్తోంది. వేమిరెడ్డి వచ్చే దఫా నెల్లూరు లోక్ సభకు పోటీ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుత ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాల్సి ఉంది. ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్న వేమిరెడ్డి.. సిటీలో అనిల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు వైసీపీ అనుకూల సోషల్ మీడియా వెబ్ సైట్లలో కూడా వార్తలొచ్చాయి. ఆయన్ను కనిగిరి నియోజకవర్గానికి పంపించే అవకాశాలున్నాయని కూడా కథనాలు వినిపించాయి. ఈ దశలో అనిల్ కుమార్ యాదవ్ సడన్ గా ఇద్దరు ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. వారిద్దరూ కాకాణికి మరీ దగ్గరి వ్యక్తులు కాకపోవడం విశేషం.
కావలి, కందుకూరు ఎమ్మెల్యేలు ప్రతాప్ కుమార్ రెడ్డి.. మానుగుంట మహీధర్ రెడ్డితో వేర్వేరుగా సమావేశం అయ్యారు మాజీ మంత్రి అనిల్. జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన అనిల్.. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరులోని పదికి పది స్థానాలనూ గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ని మరోసారి ముఖ్యమంత్రి చేసుకునేందుకు కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. నేతల మధ్య చిన్నచిన్న విభేదాలు ఉన్నా కూడా అందరూ కూర్చుని మాట్లాడుకుని ఒక తాటిపై ఉంటామన్నారు.
ఆసక్తికరంగా ముగ్గురు ఎమ్మెల్యేల భేటీ..
అయితే నెల్లూరులో ఆ ముగ్గురు ఎమ్మెల్యేల భేటీ ఆసక్తికరంగా మారింది. అనిల్ స్థాన చలనం విషయం ఈ భేటీలో చర్చకు వచ్చిందా అనేది ఇంట్రస్టింగ్ పాయింట్. అటు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కూడా అనిల్ లాగే స్థానిక పోరు ఉంది. స్థానిక వైసీపీ నేతలే ప్రతాప్ కి కూడా ఎదురొస్తున్నారు. లోకల్ పాలిటిక్స్ వీరికి చికాకు కలిగిస్తున్నాయి. ఈ దశలో నియోజకవర్గాల మార్పుపై వీరికి ముందే సమాచారం అందిందా అనేది తేలాల్సి ఉంది. కాకాణి బ్యాచ్ కి కాస్త దూరంగా ఉండే ముగ్గురు ఎమ్మెల్యేలు ఒకేచోటకు చేరడం మాత్రం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కలకలం రేపే అంశం.