నువ్వెంత అంటే నువ్వెంత అనేది సహజంగా రాజకీయ ప్రత్యర్థుల మధ్య జరిగే పోరే. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం సందర్భం ఏదయినా ఇద్దరు నాయకుల మధ్య రాజకీయ మాటల తూటాలు ప్రతిరోజూ పేలుతూనే ఉంటాయి. వారిలో ఒకరు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాగా, ఇంకొకరు జగన్ కొత్త టీమ్‌లో బెర్త్ ఖాయం అని ప్రచారంలో ఉన్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి. ఇద్దరికీ సర్వేపల్లిలో మంచి పలుకుబడి ఉంది. అయితే ఇటీవల కాకాణి చేతిలో వరుస ఓటములతో సోమిరెడ్డి కాస్త డీలా పడ్డారు. ఇక తాజాగా వీరిద్దరి మధ్య కొత్త జిల్లాల విషయంలో ఫైటింగ్ మొదలైంది.


సర్వేపల్లి నియోజకవర్గం లెక్కప్రకారం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది. దాన్ని బాలాజీ జిల్లాలో కలపాలి. అయితే నెల్లూరుకి సమీపంలో ఉండటం, కృష్ణపట్నం పోర్ట్ సహా ఇతర కర్మాగారాలన్నీ సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోకే రావడంతో.. దాన్ని నెల్లూరులోనే ఉంచారు. దీంతో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి వారోత్సవాలు మొదలు పెట్టారు.


అయితే సర్వేపల్లిని నెల్లూరు నుంచి విడదీసే దమ్ము ఎవరికీ లేదని అంటున్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి. కాకాణి మొదలు పెట్టిన వారోత్సవాలపై విమర్శలు గుప్పించారు. తాము ఆస్తులు అమ్ముకోని రాజకీయాలు చేశామని, తమపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని మండిపడ్డారు. నల్లపరెడ్డి వీరరాఘవరెడ్డి మనవడ్ని అయిన తనను వేలెత్తి చూపించే దమ్ము ధైర్యం ఎవరికి ఉందంటూ సవాల్ విసిరారు.. 


సోమిరెడ్డిపై అదే స్థాయిలో ధ్వజమెత్తారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి. నల్లపరెడ్డి వంశం గురించి సోమిరెడ్డి చెప్పుకోవడం ఏంటని.. ఆయన నల్లపరెడ్డి అనే తులసి వనంలో గంజాయి మొక్క అని విమర్శించారు. 2006లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో సర్వేపల్లిని తిరుపతి పార్లమెంట్‌లో కలిపితే ఉడతలు పడుతున్నావా, గాడిదలు కాస్తున్నావా.. అని ప్రశ్నించారు. సర్వేపల్లిని నెల్లూరులోనే కొనసాగించడం సోమిరెడ్డికి ఇష్టం లేదని, అలా చేయడం వల్ల ఆయన రాజకీయ పోరాటానికి వేసుకున్న ప్రణాళికలు అన్నీ ఆగిపోయాయని, అందుకే ఆయనకు కడుపు మంట అని ఎద్దేవా చేశారు. 


మొత్తమ్మీద వీరిద్దరి సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. నెల్లూరు స్టైల్ లో కాకాణి పిట్టకథలు, సినిమా కథలు చెబుతూ.. సోమిరెడ్డిపై సెటైర్లు పేలుస్తుంటారు. దాదాపుగా ఆయన ప్రతి ప్రెస్ మీట్ లోనూ సోమిరెడ్డిని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తుంటారు. ఇటీవల జిల్లాల విభజన తర్వాత వీరిద్దరి సవాళ్లు మరింత ఎక్కువయ్యాయి. సర్వేపల్లి నెల్లూరులోనే ఉండటానికి కారణం నేనంటే నేనంటూ ఇద్దరూ బలప్రదర్శనకు దిగుతున్నారు.