కావలి సమీపంలో ఆర్టీసీ డ్రైవర్ పై జరిగిన దాడి కేసులో ఆరుగురిని అరెస్టు చేశారు. దాడి జరిగిన 24 గంటల వ్యవధిలోనే నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి విషయం తెలిసిన వెంటనే ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలించిన పోలీసులు.. ఆర్టీసీ డ్రైవర్ పై దాడి ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. మొత్తానికి ఈ దాడి ఘటనలో ఆరుగురు అరెస్ట్ కాగా, మిగిలిన వారి కోసం ముమ్మర గాలింపు చేపడుతున్నారు. ఈ ఆరుగురిని నేడు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అరెస్ట్ అయిన నిందితులను నేడు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
మరోవైపు, డ్రైవర్ పై దాడి ఘటనలో ఆర్టీసీ ఎండీ కూడా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. శుక్రవారం (అక్టోబరు 27) బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న ఏపీ 16Z 0702 నెంబర్ సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్ బి.రాంసింగ్ పై కొందరు దాడి చేశారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎండీ అన్నారు. ఓ కారు డ్రైవర్, అందులోని వ్యక్తులు డ్రైవర్ పై భౌతిక దాడికి పాల్పడ్డారని తిరుమలరావు తెలిపారు. ఆ వ్యక్తులపై చట్ట పరమైన కఠిన చర్యలుంటాయని తేల్చి చెప్పారు. నిందితులపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కావలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారని అన్నారు. ప్రజల మద్య విధులు నిర్వహించే ఆర్టీసి కార్మికుల పట్ల దౌర్జన్యం చేస్తే తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఎండీ వార్నింగ్ ఇచ్చారు.
అసలు ఏం జరిగిందంటే?
విజయవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కావలి నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కావలిలోని ట్రంకు రోడ్డులో ఆర్టీసీ బస్సు ముందు బైక్ వెళ్తోంది. దీంతో బస్సు డ్రైవర్ రామ్‌సింగ్... సైడ్ ఇవ్వాలంటూ హారన్ మోగించాడు. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తికి పట్టారాని కోపం వచ్చింది. బస్సును అడ్డంగా వచ్చాడు. బస్సును రోడ్డుపైనే ఆపేయించి... డ్రైవర్ రామ్‌సింగ్‌తో వాగ్వాదానికి దిగాడు. అయితే... అక్కడ ఉన్న పోలీసులు వారికి సర్దిచెప్పి పంపించారు. అక్కడితో అయిపోయిందని అనుకున్నారు. కానీ... బైక్‌పై ఉన్న వ్యక్తి మాత్రం మరింత రెచ్చిపోయాడు.
జరిగిన విషయం తన స్నేహితులతో చెప్పాడు. 14 మంది కలిసి ఆ ఆర్టీసీ బస్సును వెంబడించాడు. కొంత దూరం వెళ్లాక బస్సును ఆపి... ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై దాడి చేశారు. 14 మంది గ్యాంగ్ ఈ దాడిలో పాల్గొన్నారు. బస్సు డ్రైవర్, కండెక్టర్‌ను రోడ్డుపై పడేసి దారుణంగా కొట్టారు. డ్రైవర్‌ను కాళ్లతో తన్నారు. కండక్టర్ చొక్కా పట్టుకుని కొట్టారు. ఈ గొడవను వీడియో తీస్తున్న వారి ఫోన్లు లాక్కుని.. పగలగొట్టారు. నడిరోడ్డుపై నానా హంగామా సృష్టించారు. కొందరు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యి.. రాజకీయ రంగు పులుముకుంది.
ఆర్టీసీ డ్రైవర్, కండెక్టర్‌పై దాడిచేసింది వైఎస్‌ఆర్‌సీపీ నేతల పనే అంటూ తెలుగు దేశం పార్టీ ఆరోపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైకోలు ఊరి మీద పడి జనాల్ని వేధిస్తున్నారని ట్వీట్లు చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. సైడ్ ఇవ్వమని హారన్ కొట్టినందుకు ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేశారని దుయ్యబడుతున్నారు. అధికారంలో ఉన్నారని ఇష్టమొచ్చినట్టు దాడులు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్నా బస్ డ్రైవర్ హారన్ కొట్టకూడదు.. ఒకవేళ కొడితే వెంబడించి మరీ కొడతాం అనేతా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో శాంతి భద్రతలు దిగజారాయని విమర్శిస్తున్నారు.