నెల్లూరు జిల్లా ఉదయగిరి కోటకు 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఉదయగిరి దుర్గంలో నిధి నిక్షేపాలు ఉన్నాయనే ప్రచారం కూడా చాన్నాళ్లుగా ఉంది. అయితే ఎవరూ ఆ నిధి సొంతం చేసుకున్న దాఖలాలు లేవు. కోటను పురావస్తు శాఖ తమ అధీనంలోకి తీసుకున్నా.. సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో ఇప్పటికీ అక్రమ తవ్వకాలకు అక్కడక్కడా ధ్వంసమవుతూనే ఉంది. గతంలో గుప్తనిధుల తవ్వకాల ముఠాలు చాలాసార్లు ఇక్కడకు వచ్చాయి. తవ్వకాలు చేపట్టాయి. కొంతమంది ఉదయగిరి కొండల్లో గుప్తనిధులకోసం బయలుదేరి తప్పిపోయి ప్రాణాలు వదిలిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తొలిసారిగా కొండల్లో పేలుళ్లు జరిగినట్టు తెలుస్తోంది. పేలుళ్ల ఆనవాళ్లు స్థానికులను కలవర పెట్టాయి. కొండల్లో గుప్తనిధుల తవ్వకం కోసం తవ్వకాలు కాస్తా పేలుళ్ల స్థాయికి వెళ్లే సరికి స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
గతంలో గుప్తనిధులకోసం పలుగు, పారలతో తవ్వకాలు చేపట్టేవారు. దానికోసం స్థానికులనే ఉపయోగించుకునేవారు. గుప్త నిధుల ముఠాలు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ స్థానికులతో లావాదేవీలు కుదుర్చుకునేవారు. ఎవరు ఎక్కడినుంచి వచ్చినా, ఒక్కరికి కూడా గుప్తనిధులు దొరకలేదనేది వాస్తవం. కానీ ప్రయత్నాలు మాత్రం ఎవరూ ఆపలేదు. అయితే ఈ నెలలో ఓ ముఠా ఏకంగా కొండను తవ్వేందుకు పేలుడు పదార్థాలు వాడింది. ఆ పేలుడులో ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువకుడు మరణించడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ఆ మరణంపై విచారణ చేపట్టిన పోలీసులు సదరు యువకుడు ఉదయగిరి కొండల ప్రాంతం వద్దకు పనికోసం వచ్చాడని, గుప్తనిధుల ముఠాతో కలసి అక్కడ పేలుళ్లు జరిపాడని, పొరపాటున ఆ పేలుడికి అతడు కూడా బలయ్యాడని గుర్తించారు పోలీసులు. ఉదయగిరిని జల్లెడపట్టారు. అప్పటికే గుప్తనిధులకోసం వేట సాగిస్తున్న ముఠా పరారైంది.
ఉదయగిరి ప్రాంతం శ్రీకృష్ణ దేవరాయలు ఏలుబడిలో ఉండేది, ఆ తర్వాత నవాబులు కూడా కొంతకాలం ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ ప్రాంతంలో రత్నాలు రాశులు పోసి అమ్మేవారు అనే పేరుంది. ప్రాచీన కట్టడాల కింద గుప్త నిధులు ఉంటాయని ఇప్పటికీ ఇక్కడి ప్రజలు నమ్ముతుంటారు. ఉదయగిరి కొండలపై కూడా అనేక చోట్ల ఆలయాలు ఉన్నాయి. దీంతో అనేక ముఠాలు గుట్టు చప్పుడు కాకుండా ఈ ప్రాంతాల్లో తవ్వకాలు సాగిస్తుంటాయి.
ఉదయగిరి దుర్గంపై జనసంచారం ఉండదు. కేవలం పశువుల కాపరులే అప్పుడప్పుడూ కోటపైకి వెళ్తుంటారు. పర్యావరణం, ట్రెక్కింగ్ పై ఆసక్తి ఉన్నవాళ్లు కూడా అప్పుడప్పుడూ కొండ ఎక్కడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే గుప్త నిధుల ముఠాలు మాత్రం నిత్యం ఇక్కడ ఎవరికీ తెలియకుండా తమ పనులు తాము చేస్తుంటాయి. దుర్గంపై జన సంచారం లేకపోవడంతో ఈ ముఠాలు అక్కడేం చేస్తున్నాయనేది ఎవరికీ తెలియదు. దీంతో రోజుల తరబడి ఈ తవ్వకాల ముఠాలు కొండపై మకాం వేసి ప్రాచీన కట్టడాలను ధ్వంసం చేస్తున్నాయి. 2012లో ఉదయగిరిలోని కృష్ణ మందిరంలో కూడా ఓ ముఠా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపింది. దీంతో అక్కడి ప్రాచీన కట్టడాలు దెబ్బతిన్నాయి. అప్పడు కొంతమంది అనుమానితులపై కేసులు నమోదు చేశారు. తిరిగి ఇటీవల కాలంలో తవ్వకాలు జోరందుకున్నాయి. పోలీసులు వస్తున్నారన్న సమాచారం ఉంటే వెంటనే ఆ ముఠాలు పారిపోతుంటాయి. వారి ఆనవాళ్లు కూడా ఉండవు. దీంతో పోలీసులకు కూడా ఈ ఆపరేషన్ కష్టసాధ్యంగానే ఉంది. స్థానికుల సహకారం కూడా కొన్నిసార్లు ఈ తవ్వకాల ముఠాకు ఉంటాయి. అందుకే ఇంత జరుగుతున్నా పోలీసులకు వారిని పట్టుకోవడం సాధ్యం కావడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టి, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు స్థానికులు.