నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు మండలం విరువూరు గ్రామ శివారులో ఓ పుకారు అందర్నీ భయపెడుతోంది. విరువూరు గ్రామ శివారులో అటవీ ప్రాంతం ఉంది. అడవి లోపలికి వెళ్లినప్పుడు ఓ చెట్టుకి మహిళ మృతదేహం కట్టేసి ఉందనేది ఆ వార్త. పశువుల కాపరులు అడవిలోకి వెళ్లినప్పుడు చెట్టుకు మృతదేహాన్ని కట్టేసి ఉండటాన్ని చూశారట. ఆ మృతదేహం ఒంటినిండా పసుపు, కుంకుమ పూసి ఉంచారట. దగ్గరకు వెళ్లి చూస్తే ఆమె గర్భిణిగా గుర్తించారట. దీంతో వారు పరుగు పరుగున ఊరిలోకి వచ్చి ఈ విషయం చేరవేశారు. దీంతో ఊరిలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 


చెట్టుకు కట్టేస్తారా..?
గర్భిణిగా ఉన్న వారు చనిపోతే వారి దహన సంస్కారాలు ప్రత్యేకంగా చేస్తారు. గర్భిణి కడుపులో పిండం ఉంటుంది కాబట్టి ఇద్దర్నీ కలిపి పూడ్చడం కానీ, కాల్చడం కానీ చేయరు. వేర్వేరుగా రెండు మృతదేహాలకు దహన సంస్కారాలు చేయాల్సి ఉంటుంది. ఆస్పత్రిలో కాన్పు అయ్యే క్రమంలో గర్భిణి చనిపోయినా ఆమె నుంచి బిడ్డను వేరు చేసి దహన సంస్కారాలు చేస్తారు. తల్లి కడుపులో బిడ్డ చనిపోతే ఇద్దరినీ కలిపి పూడ్చరు. ఈ సంప్రదాయాన్ని నెల్లూరు జిల్లాలో కూడా పాటిస్తున్నారు. అయితే కొన్నిచోట్ల ఇలా గర్భిణి కడుపు నుంచి పిండాన్ని వేరు చేయడం కుదరని సందర్భంలో అడవిలో మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి వస్తారట. అలా ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరో గర్భిణి మృతదేహాన్ని తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి ఉంటారని చెబుతున్నారు. పశువుల కాపర్లు చెప్పిన ఈ సమాచారం చివరకు పోలీసుల వరకు వెళ్లింది. దీంతో వారు గాలింపు చేపట్టారు. 




స్థానిక మహిళా పోలీసుల సాయంతో పోలీసులు అడవిలోకి వెళ్లారు. కొంతసేపు గాలించారు. పశువుల కాపరులను కూడా పిలిపించి మాట్లాడారు. అయితే పశువుల కాపరులు భయపడినట్టు తెలుస్తోంది. వారు తాము ఆ మృతదేహాన్ని చూడలేదని తప్పించుకున్నారట. దీంతో చేసేదేం లేక, ఆ మృతదేహం ఉన్న స్థలం పోలీసులకు తెలియక కొంతదూరం అడవిలో వారు గాలించారు. మృతదేహం దొరక్కపోయే సరికి తిరిగి వచ్చేశారు. 


రెండోరోజు కూడా గాలింపు చర్యలు చేపడతామంటున్నారు పోలీసులు. ఈ వ్యవహారం గ్రామంతోపాటు జిల్లాలో కూడా కలకలం రేపింది. దీంతో అసలు మృతదేహాన్ని వెదికి తీసుకు రావాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మండల పరిధిలో గర్భిణులు ఎవరైనా మృతి చెందారా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ అది సహజ మరణమేనా లేక ఏదైనా అనుమానాస్పద మరణమా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ మొదలు పెట్టారు. 


ప్రస్తుతం పశువుల కాపరులు ఆ అటవీ ప్రాంతానికి వెళ్లడానికే భయపడుతున్నారు. ప్రతి రోజూ వారు అదే ప్రాంతానికి పశువులను మేపుకోడానికి తీసుకెళ్తారు. శవం కనపడిందనే సమాచారంతో వారు అడవిలోకి వెళ్లడానికి వెనకాడుతున్నారు. మరోవైపు స్థానికంగా ఈ వ్యవహారం కలకలం రేపింది. గర్భిణి మృతి చెందితే ఏం చేస్తారు..? దహన సంస్కారాలు ఎలా చేస్తారనే విషయంపై చర్చ నడుస్తోంది. అసలింతకీ ఆ మృతదేహం ఎవరిది..? ఎవరైనా దూర ప్రాంతాన్నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్లారా అనేది తేలడంలేదు.