పిల్లవాడికి అనారోగ్యంగా ఉందని చెన్నైలో చికిత్స చేయించేందుకు ఆ కుటుంబం బయలుదేరింది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం దామిగుంటనుంచి కారులో బయలుదేరింది. మొత్తం ఎనిమిదిమంది కారులో ఉదయాన్నే చెన్నైకి వెళ్తున్నారు. హైవేపై ఘోర ప్రమాదానికి గురికావడంతో ఆ ఎనిమిదిమందిలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. 


నెల్లూరు జిల్లాలో ఉదయాన్నే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మనుబోలు మండలం బద్దెవోలు వద్ద ఓ కంటైనర్ లారీని వెనకనుండి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షత్రగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కంటైనర్ ని ఢీకొన్న కారు నుజ్జునుజ్జయిపోయింది. కారులో మూడొంతులు లారీకిందకు దూసుకుపోయింది. లారీ కిందనుంచి కారుని తీసేందుకే దాదాపు 2గంటలు సమయం పట్టింది. ఈ ప్రమాదంతో విజయవాడ-చెన్నై హైవేపై కాసేటు ట్రాఫిక్ నిలిచిపోయింది. 


ఆ కుటుంబంలో పిల్లవాడికి ఆరోగ్యం బాగోలేదు. ఆస్పత్రిలో చికిత్సకోసం కుటుంబమంతా బయలుదేరింది. అయితే అనారోగ్యంతో ఉన్న పిల్లవాడు కూడా ఈ ప్రమాదంలో చనిపోవడం బాధాకరం. ఆ అబ్బాయితోపాటు మరో ఇద్దరు యాక్సిడెంట్ జరిగిన స్పాట్ లోనే చనిపోయారు. ఆగిఉన్న కంటైనర్ ను కారు వెనకనుంచి డీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. 


ఓవర్ స్పీడ్..
నెల్లూరునుంచి చెన్నై వెళ్లే హైవేపై పార్కింగ్ ప్లేస్ లు చాలా తక్కువగా ఉన్నాయి. చాలా చోట్ల బే ఏరియా లేకపోయినా రోడ్డుకి పక్కగా వాహనాలు పార్కింగ్ చేస్తుంటారు. ఈరోజు జరిగిన ప్రమాదానికి కూడా లారీ పార్కింగ్ ప్రధాన కారణంగా తెలుస్తోంది. పార్కింగ్ చేసి ఉంచిన లారీని గమనించకుండా వెనకనుంచి వచ్చిన కారు ఢీకొంది. కారు ఓవర్ స్పీడ్ లో ఉండటంతో దాదాపు సగానికిపైగా లారీ కిందకు దూసుకుపోయింది. 


ఎయిర్ బెలూన్లు ఓపెన్ అయ్యాయి కానీ..
ప్రమాదంలో కారులోని ఎయిర్ బెలూన్లు ఓపెన్ అయ్యాయి కానీ, అవి కూడా వారిని కాపాడలేక పోయాయి. ప్రమాద తీవ్రతకు కారులోని ఎయిర్ బెలూన్లు కూడా పగిలిపోయాయి. దాదాపుగా కారు లారీ కిందకు దూసుకుని పోవడంతో డ్రైవర్ సహా ముందు సీట్లలో కూర్చున్నవారు స్పాట్ లోనే చనిపోయారు. వెనక సీట్లో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నలుగురిని ఆస్పత్రికి తరలించారు. మరో వ్యక్తి కారులోనే ఇరుక్కుపోవడంతో గంటన్నరసేపు ప్రయత్నించి అతడిని బయటకు తీసుకురాగలిగారు. ఆ తర్వాత అతడిని కూడా ఆస్పత్రికి తరలించారు. 


కారు నుజ్జు నుజ్జు..
ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జుగా మారింది. కారులో ఏ భాగం ఏంటో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. కారుని ఆ పరిస్థితుల్లో చూస్తే ఏ ఒక్కరూ బతికే అవకాశం లేదని కచ్చితంగా చెప్పొచ్చు. ప్రస్తుతం గాయాలతో ఆస్పత్రిలో ఉన్నవారు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. 


గతంలో కూడా పలు ప్రమాదాలు..
నెల్లూరు-చెన్నై హైవేపై గతంలో కూడా పలు ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా శీతాకాలంలో పొగమంచు కారణంగా తరచూ ప్రమాదాలు జరిగేవి. ఇటీవల వాటి సంఖ్య తగ్గింది. కానీ ఇప్పుడు కూడా ఉదయాన్నే ప్రమాదం జరగడం గమనార్హం. హైవే పక్కన ఆగిఉన్న లారీని గమనించకుండా కారు డ్రైవర్ ఓవర్ స్పీడ్ తో వెళ్లడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్థారించారు పోలీసులు. కేలు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.