Anam ramanarayana reddy: రా కదలిరా పేరుతో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్త పర్యటనలతో ఏపీ రాజకీయం వేడెక్కింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి వెంకటగిరిలో ఆయన ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, వెంకటగిరి టీడీపీ ఇన్ చార్జ్ కురుగొండ్ల రామకృష్ణ సహా పలువురు స్థానిక నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆనం రామనారాయణ రెడ్డి సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. 



 


నన్ను టార్గెట్ చేశారు..
ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నుంచి వెంకటగిరి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆయన సీనియార్టీకి తగ్గట్టుగా మంత్రి పదవి ఆశించారు. కానీ రెండు విడతల్లోనూ ఆ పదవి దక్కలేదు. ఆ బాధతోపాటు.. ఆయన మాట కూడా జిల్లాలో చెల్లకుండా పోయింది. స్థానికంగా పనులు జరగడంలేదని పలుమార్లు జిల్లా సమావేశాల్లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో మాఫియా గ్యాంగ్ లు ఉన్నాయని కూడా ఆయన ఆరోపించారు. స్వపక్షంలో ఉండి విపక్షంలా మాట్లాడుతున్నందున ఆయన్ను అందరూ దూరం పెట్టారు. ఓ దశలో సీఎం జగన్ కూడా ఆయన్ను దూరం పెట్టారు. ఆ తర్వాత వెంకటగిరి వైసీపీ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఈసారి ఆనంకు వైసీపీలో టికెట్ ఇవ్వరనే విషయం తేలిపోయింది. కేవలం ప్రజల పక్షాన మాట్లాడినందుకు, ప్రజల పనులకోసం ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేశారని అంటున్నారు ఆనం రామనారాయణ రెడ్డి. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారనే ఆరోపణతో పార్టీనుంచి ఆనంను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆనం టీడీపీవైపు వచ్చారు. లోకేష్ యువగళం యాత్రలో పాల్గొన్నారు. నేరుగా వైసీపీ కండువా కప్పుకోకపోయినా చంద్రబాబు కార్యక్రమాల్లో ఆయన పాాల్గొంటున్నారు. తాజాగా వెంకటగిరిలో జరిగిన రా-కదలిరా కార్యక్రమంలో ఆనం పాల్గొన్నారు. 


జగన్ పై విమర్శలు..
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికింది ఉమ్మడి నెల్లూరు జిల్లాయేనని అన్నారు ఆనం రామనారాయణరెడ్డి. ఈ జిల్లా నుంచే ముగ్గురు ఎమ్మెల్యేలు అధికార వైసీపీని చంద్రబాబుతో నడిచేందుకు వచ్చామన్నారు. వైసీపీ ప్రభుత్వం వెంకటగిరికి ఏది కావాలని అడిగినా.. తన అభ్యర్థనలను చెత్తబుట్టలో పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆనం. పదవులు కావాలని తాను అడగలేదని.. పట్టణానికి వంద పడకల ఆస్పత్రి కావాలని అడిగానని, అందుకే తనని టార్గెట్ చేశారన్నారు. సోమశిల-స్వర్ణముఖి లింక్‌ కాలువకు నిధులు కోరితే పట్టించుకోలేదన్నారు. గ్రామ పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల నిధులు మళ్లించారని.. ఆ డబ్బు ఇవ్వాలని కోరితే తన నియోజకవర్గ ప్రజలను సీఎం జగన్‌ ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. వచ్చే ఎన్నిక్లలో టీడీపీ-జనసేన కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు ఆనం. 


ఆనం క్లారిటీ..
ఇటీవల ఆనం టీడీపీకి దూరమవుతున్నారనే ప్రచారం జరిగింది. ఆయనకు నియోజకవర్గం కుదరడంలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో వెంకటగిరిలో జరిగిన చంద్రబాబు సభకు ఆనం రావడం, వేదికపై సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేయడం విశేషం. దీంతో ఆనం తాను టీడీపీతోనే ఉన్నట్టు క్లారిటీ ఇచ్చినట్టయింది.