మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తనని పార్టీ నుంచి గెటౌట్ అన్నా కూడా తాను వెళ్లలేనని చెప్పారు. ఆయనంటే తనకు వ్యసనం అన్నారు. ఆయనతోనే ఉంటా, ఆయన పార్టీలోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆయన చెప్పినా కూడా తాను కొంతమందితో కలవలేనని పరోక్షంగా రూప్ కుమార్ యాదవ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో తనకు నెల్లూరు సిటీ సీటు ఇవ్వకపోయినా ఫర్వాలేదని, వైసీపీని మాత్రం వదిలిపెట్టలేనని అన్నారు అనిల్. 


ఇటీవల సీఎం జగన్ కావలి పర్యటనలో.. అనిల్, రూప్ కుమార్ మధ్య సయోధ్యకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. జగన్ ముందు ఇద్దర చేతులు కలిపారు కానీ.. ఇద్దరి మధ్య ఇంకా మాటలు మొదలు కాలేదు. రూప్ కుమార్ వ్యవహారం ఎలా ఉందో తెలియదు కానీ, అనిల్ మాత్రం తాను ఆయనతో కలిసేది లేదంటున్నారు. తాజాగా అనిల్ మరోసారి రూప్ కుమార్ వ్యవహారంపై ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చారు. తాను ఆ మనిషితో కలిసేది లేదని చెప్పారు. 


ఎవరైనా పెళ్లికి వెళ్తే అక్షింతలు వేసి బాగుండాలని దీవిస్తారని, కానీ శత్రువుల పెళ్లికి వెళ్తే, ఆ తాళి ఎప్పుడు తెగిపోతుందా అని ఆశిస్తామని, తాను అలాంటి వ్యక్తిని కాదని, అసలా పెళ్లికి వెళ్లాల్సిన అవసరం లేదు అనుకుంటానని చెప్పారు. ముందు నవ్వుతూ మాట్లాడి, వెనక గోతులు తవ్వే మనస్తత్వం తనది కాదన్నారు అనిల్. 


తనపై మీడియాలో తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ మండిపడ్డారు అనిల్. తనకు మోకాలి నొప్పి ఉందని, దాని ట్రీట్ మెంట్ కోసం 15రోజులు నెల్లూరులో ఉండటం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారిపోతున్నానంటూ వార్తలు రాయొద్దని కోరారు. సీఎం  జగన్ అంటే తనకు ఓ వ్యసనం అని, ఆయన తనను పార్టీనుంచి గెటౌట్ అన్నా కూడా ఎక్కడికీ పోనన్నారు. ఆ విషయంలో తనకు సిగ్గు, లజ్జ, మానం, అభిమానం లేవన్నారు. ముందు చేతులు కలిపి, వెనక గోతులు తీయడం తనకు అలవాటు లేదని, అలాంటి పనులు తాను చేయలేనని చెప్పారు. 


గతేడాది కూడా తాను మోకాలి నొప్పితో ఇబ్బంది పడిన విషయం నెల్లూరు ప్రజలకు తెలుసన్నారు. ఈసారి ఆ నొప్పి తిరగబెట్టిందని మళ్లీ ట్రీట్ మెంట్ కి వెళ్తున్నానని చెప్పారు. ఈలోగా కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేయడానికి రెడీగా ఉన్నారని అన్నారు అనిల్. తాను గడప గడపకు దూరమయ్యానని, టీడీపీలో చేరుతున్నానంటూ ప్రచారం చేస్తున్నారని, కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు ఫుడ్ కోసం అలాంటి వార్తలు రాస్తున్నాయని మండిపడ్డారు. 


మొత్తమ్మీద అనిల్ ఈసారి ప్రెస్ మీట్ లో తన సీటు సంగతి చెప్పడం విశేషం. గతంలో తాను తిరిగి నెల్లూరు నుంచే పోటీ చేస్తా, మళ్లీ మంత్రిని అవుతా అని చెప్పిన అనిల్.. ఈసారి మాత్రం జగన్ అవకాశమిస్తేనే నెల్లూరు సిటీనుంచి పోటీచేస్తానంటున్నారు. జగన్ వద్దని చెబితే, తాను పోటీనుంచి తప్పుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏం చెప్పినా పార్టీని మాత్రం వీడిపోనన్నారు. గెటౌట్ అన్నా కూడా పార్టీలోనే ఉంటానని చెప్పారు. ఆ విషయంలో తనకు సిగ్గు, లజ్జ ఏవీ లేవని.. జగన్ తోనే ఉంటానని అన్నారు.