AP EM Minister Anil Kumar : నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.. అదే స్థానం నుంచి తాను తిరిగి పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ (YSRCP) ఇన్ చార్జ్ ల మార్పు వార్తలు జరుగుతుండగా అనిల్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. అయితే పార్టీ అధికారికంగా ఇలాంటి ప్రకటన ఏదీ చేయలేదు. ఈలోగా అనిల్ తనకు తానే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నారు. 


టీడీపీ సవాల్ కి అనిల్ రియాక్షన్..
నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిని ఆ పార్టీ అధిష్టానం మార్చబోతోందంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అనిల్ కి స్థాన చలనం తప్పదని, ఆయన్ను ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి పంపిస్తున్నారని కూడా అంటున్నారు. ఈ గందరగోళంలో టీడీపీ నేతలు కొంతమంది అనిల్ ని రెచ్చగొట్టారు. అసలు నెల్లూరు వైసీపీ అభ్యర్థి ఎవరో అనిల్ కి తెలుసా అన్నారు. అనిల్ కి ఈసారి పార్టీ టికెట్ ఇవ్వదని, పోనీ తానే అభ్యర్థిని అని ఆయన చెప్పుకోగలరా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు అనిల్ బదులిచ్చారు. తానే నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిని అని అన్నారు. అయితే అదే సమయంలో ఆయన టీడీపీ నేతలకు కూడా ఓ సవాల్ విసిరారు. నెల్లూరు సిటీలో ప్రచారం చేస్తున్నా నారాయణ టీడీపీ అభ్యర్థిగా పోటీలో దిగుతున్నారో లేదో తేల్చి చెప్పాలన్నారు అనిల్. నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి అని చెప్పుకునే దమ్ము నారాయణకు ఉందా అని ప్రశ్నించారు. జనసేన అభ్యర్థులు తనకు పోటీ రాకుండా ఉండేందుకు ఇద్దరికి 50కోట్ల రూపాయలు ఇచ్చారని.. మొత్తంగా ఆయన 150కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు. నెల్లూరులో తనపై పోటీ చేసేది జనసేన అభ్యర్థా.. లేక టీడీపీ నుంచి నారాయణా..? వారే తేల్చుకోవాలని సవాల్ విసిరారు. 


నెల్లూరు నగరంలో పోటీ చేసేందుకు టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ ఇప్పటికే రూ. 150 కోట్లను ఖర్చు చేశారని ఆరోపించారు అనిల్. తనకు పోటీ రాకుండా ఉండేందుకు జనసేనలో పైన ఉన్న నేతకు రూ.30 కోట్లు నెల్లూరులో పనిచేస్తున్న మరో నేతకు రూ.20 కోట్లు ఇచ్చారని అన్నారు. నెల్లూరు నుంచి జనసేన నేత మనుక్రాంత్ రెడ్డి కాకుండా తానే పోటీ చేస్తున్నానని బహిరంగంగా నారాయణ చెప్పగలరా అని అనిల్ సవాల్ విసిరారు. 


నెల్లూరు సిటీ పరిస్థితి ఏంటి..?
2019 ఎన్నికల్లో మంత్రి హోదాలో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు నారాయణ. అదే స్థానం నుంచి అనిల్ కుమార్ యాదవ్ వరుసగా రెండుసార్లు గెలుపొందారు. జగన్ తొలి టీమ్ లో అనిల్ కి మంత్రి పదవి వచ్చింది, రెండో దఫా ఆయన స్థానంలో జిల్లాకు చెందిన కాకాణి గోవర్దన్ రెడ్డికి ఆ ఛాన్స్ దక్కింది. అప్పటినుంచి నెల్లూరు రాజకీయాల్లో అనిల్ హవా తగ్గిందనే చెప్పాలి. సిటీ నియోజకవర్గానికి సంబంధించి స్వపక్షంలోనే ఆయనకు విపక్షం బయలుదేరింది. రూప్ కుమార్ యాదవ్, ముక్కాల ద్వారకానాథ్.. ఇద్దరూ అనిల్ కి దూరమయ్యారు. వైసీపీలోనే మరో వర్గం వారిని చేరదీసింది. ప్రస్తుతం మంత్రి కాకాణి గ్రూప్ కి అనిల్ కి సత్సంబంధాలు లేవు. జిల్లాలో మిగతా నాయకులంతా ఓ గ్రూప్, అనిల్ ఒక్కరే ఒక గ్రూప్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఒకరి కార్యక్రమాల్లో ఇంకొకరు పాల్గొన్న ఉదాహరణలు కూడా లేవు. ఈ దశలో నెల్లూరు సిటీ టికెట్ కూడా అనిల్ కి దక్కే అవకాశాలు లేవనే ప్రచారం జరుగుతోంది. ఆయనకు స్థానచలనం తప్పదని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. టీడీపీ కూడా అనిల్ ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తోంది. దీంతో అనిల్ తనకు తానే నెల్లూరు సిటీ అభ్యర్థిని అని ప్రకటించుకున్నారు.