అబ్బాయి ప్రేమించి వదిలేయడం, ఆ తర్వాత అమ్మాయి తీరిగ్గా అబ్బాయి ఇంటి ముందుకొచ్చి ధర్నా చేయడం... వంటి సన్నివేశాలు చాలా చోట్ల చూసే ఉంటాం. కానీ ఇక్కడ అమ్మాయికి మహిళా సంఘాల సపోర్ట్ దొరికింది. అమ్మాయి ఇంటికి రావడం చూసిన అబ్బాయి తెలివిగా గోడదూకి పారిపోయాడు. కానీ అమ్మాయి అక్కడే బైఠాయించి న్యాయం జరగాల్సిందేని కూర్చుంది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ఆల్తుర్తి గ్రామానికి చెందిన గుత్తి కొండ హరి నారాయణ, చేజర్ల మండలం ఏటూరు గ్రామానికి చెందిన పోలి పోగు మాధవి ప్రేమించుకున్నారు. ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నామని ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడంటూ మాధవి ఆరోపిస్తోంది. చివరకు చేసేదేం లేక ఆల్తుర్తికి వచ్చిన మాధవి ప్రియుడి ఇంటి ముందు నిరసన చేపట్టింది. 


ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకుంది 
అక్కడ కూడా నాటకీయ పరిణామాలు జరిగాయి. ముందు ఆమెను ఇంటిలోకి రాకుండా హరినారాయణ కుటుంబ సభ్యులు గేటు వద్దే అడ్డుకున్నారు. హరినారాయణ ఇంట్లో ఉన్నా లేడని చెప్పారు. మాధవితో మాట్లాడతానని చెప్పిన హరినారాయణ తల్లి ఆమెను ఇంటినుంచి దూరంగా తీసుకెళ్లింది. ఈలోగా హరినారాయణ వెనకవైపు ఉన్న గోడ దూకి పారిపోయాడు. దీంతో మాధవి వారి ఇంటిముందే బైఠాయించి న్యాయం చేయాలని కోరింది. ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకుంది. హరినారాయణతో తాళి కట్టించుకుంది . దీంతో ఈ లవ్ స్టోరీకి శుభం కార్డ్ పడింది.


అబ్బాయి ఇంటిముందు నిరసన చేసిన అమ్మాయి .. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే అబ్బాయి, అమ్మాయి ఇలా గుడిలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకున్నాడు కానీ అమ్మాయితో సఖ్యతగా ఉంటాడా లేదా అనే అనుమానం కూడా అందరిలో ఉంది. స్వీట్ పెట్టమంటే మొహమాటం కోసం పెడుతున్నారు, అమ్మాయి పక్కన సంతోషంగా నిలబడటానికి కూడా ఇష్టపడటం లేదు ఆ కుర్రాడు. 




కానీ మహిళా సంఘాల నేతలు మాత్రం అబ్బాయి తగ్గాల్సిందేనంటున్నారు. అమ్మాయిని బాగా చూసుకోవాలని చెప్పారు. ఏమాత్రం తేడా వచ్చినా తాము ఎంట్రీ ఇవ్వడానికి సంకోచించబోమని హెచ్చరించారు. మొత్తానికి మహిళా సంఘాల నేతల చొరవతో వారిద్దరూ ఒక్కటయ్యారు. కేవలం ఒక్కరోజులోనే ఈ లవ్ స్టోరీకి శుభం కార్డు వేసిన మహిళా సంఘాల నేతలను అందరూ అభినందిస్తున్నారు. 


గతం మరచిపోతారా..?
గతంలో తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని చెబుతోంది మాధవి. ఏడేళ్లు ప్రేమించుకున్న తర్వాత తనను వదిలించుకోవాలని చూశారని, కులం పేరుతో తనని దూరం పెట్టారని అంటోంది. తన వద్ద నగదు కూడా తీసుకున్నారని, ఫైనాన్స్ కంపెనీలో తన పేరుమీద లోన్ తీసుకుని ఇంటికి ఫర్నిచర్ కూడా తీసుకున్నారని ఆరోపిస్తోంది. అయితే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. చివరకు దిశ పోలీస్ స్టేషన్లో మరోసారి కంప్లయింట్ చేయడంతో ఆమెకు కొంతమంది మహిళా నేతలు అండగా నిలిచారు. ఆమెను నేరుగా ప్రియుడి ఇంటికి తీసుకెళ్లి హంగామా చేశారు. ఆ తర్వాత ప్రియుడు గోడదూకి పారిపోయినా చివరకు వారు అతడిని పట్టుకుని వచ్చారు. ఆ తర్వాత ఒప్పించి గుడిలో పెళ్లి చేశారు. ఇద్దరూ కలసి కాపురం చేసుకోవాలని, ఒడిదొడుకులు వస్తే తమకు ఫిర్యాదు చేయాలని మహిళా సంఘాల నేతలు సూచించారు.