Nellore: ఆమె ఓ మహిళా ఉద్యోగి. పేరు శిరీష. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని ఎంపీడీవో ఆఫీస్ లో అటెండర్ (ఆఫీస్ సబార్డినేట్) గా ఉద్యోగం చేస్తోంది. భర్త లేడు, ఇద్దరు పిల్లలతో ఆమె కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. సాధారణ బదిలీలలో భాగంగా గత నెల ఆమెను పక్కనే ఉన్న వింజమూరు మండలానికి బదిలీ చేశారు. వింజమూరు మండలంలోని ఎంపీడీవో ఆఫీస్ లో ఆమె విధుల్లో చేరాల్సి ఉంది. బదిలీ ఉత్తర్వులు తీసుకెళ్లి ఎంపీడీవోకి అప్పగించారు. అయితే అప్పటికే ఆమెపై కొంతమంది స్థానిక నేతలు ఎంపీడీవోకి లేనిపోని చాడీలు చెప్పారట. దీంతో ఆమెను విధుల్లో చేర్చుకోకుండా ఎంపీడీవో ఆర్డర్ తీసుకోలేదు. ఎమ్మెల్యేని కానీ, లేదా జడ్జీ సీఈవోని కానీ కలిసి రమ్మని చెప్పింది. దీంతో చేసేదేం లేక ఆఫీస్ ముందు నిరసనకు దిగింది మహిళా ఉద్యోగి శిరీష. 


నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఎంపీడీవో ఆఫీస్ ముందు మహిళా ఉద్యోగి శిరీష ఆందోళన చేపట్టారు. వరికుంటపాటు ఎంపీడీవో కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్న ఆమెను సాధారణ బదిలీలలో భాగంగా వింజమూరు బదిలీ చేశారు. అయితే వింజమూరులో ఆమెను జాయిన్ చేసుకోలేదు ఎంపీడీవో స్వరూప రాణి. తనను వరికుంటపాడు నుంచి వింజమూరుకు తనను ట్రాన్స్ ఫర్ చేశారని, కానీ వింజమూరులో తనను జాయిన్ చేసుకోకుండా ఎంపీడీవో స్వరూపరాణి వేధిస్తున్నారని ఆరోపించారు శిరీష. తనపై కొంతమంది రాజకీయ నాయకులు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, వారందరి పేర్లు బయటపెట్టి తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ఆఫీస్ లో జాయిన్ చేసుకోవాల్సిన ఎంపీడీవో.. ఎమ్మెల్యేను కలవాలని, లేదా జడ్పీ సీఈవోను కలవాలని చెబుతున్నారని, ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు శిరీష.


ఎందుకీ ఒత్తిడి..?
సాధారణంగా ఉద్యోగిని బదిలీ చేసిన తర్వాత ఆమెకు ఆ స్థానం ఇష్టం లేకపోయినా, లేదా రాజకీయ ఒత్తిడి ఉన్నా కూడా సదరు ఉద్యోగికి ఆ విషయం చెప్పి సర్ది చెప్పుకుని వేరే చోటకు బదిలీ చేస్తుంటారు. కానీ ఇక్కడ శిరీషకు ముందస్తుగా అలాంటి సమాచారమేదీ లేదు. వరికుంటపాడునుంచి వింజమూరికి ట్రాన్స్ ఫర్ చేశారు. కానీ వింజమూరులో ఆమెను జాయిన్ చేసుకోలేదు. దీంతో ఎటూ పోలేక ఇబ్బంది పడుతోంది శిరీష. 


ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటారా?
ఎంపీడీవో మాత్రం ఆమెను జడ్పీ సీఈవోని కలసి రావాలని చెబుతున్నారు. అక్కడకు వెళ్లి ట్రాన్స్ ఫర్ విషయం తేల్చుకోవాలని సూచిస్తున్నారు. కానీ రాజకీయ ఒత్తిడుల వల్లే శిరీషను వింజమూరులు ఎంపీడీవో ఆఫీస్ లో విధుల్లోకి తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు తనపై కక్షకట్టారని ఆరోపిస్తున్నారు శిరీష. వారందరి పేర్లు తాను బయటపెడతానని, వారి పేర్లు బయటపెట్టి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తున్నారు. తనకు  భర్త లేడని, ఇద్దరు పిల్లలతో తాను అవస్థలు పడుతున్నానని, ఇప్పుడిలా బదిలీల పేరుతో తనను ఇబ్బంది పెట్టడం సరికాదంటోంది శిరీష.