ఏపీలో గడచిన 24 గంటల్లో నమోదైన అత్యధిక వర్షపాతం 15.5 సెంటీమీటర్లు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో అసని ప్రభావంతో అత్యథిక వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత తిరుపతి జిల్లా ఓజిలిలో 13.6 సెంటీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. అది కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లానే కావడం విశేషం. ఒకరకంగా తుపాను కేంద్రానికి సుదూరంగా ఉన్నా కూడా.. నెల్లూరులో వర్షం దంచి కొట్టింది. నెల్లూరు నగరంతోపాటు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి అంధకారం అలముకొంది. కరెంటు కష్టాలు కొనసాగుతున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు, పిడుగులతో వాతావరణం గంభీరంగా ఉంది. 


నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని 38 మండలాల్లో బుధవారం ఉదయం నుంచి వర్షం కురిసింది. మత్స్యకార గ్రామాల్లో ప్రజలు వేటకు వెళ్లలేక, ఇళ్లలో ఉండలేక అవస్థలు పడ్డారు. వారందర్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అసలు తుపాను ముప్పు నెల్లూరు తీరానికి లేదని అధికారులు చెబుతున్నా కూడా భారీ వర్షం ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. 




జిల్లాలోని సముద్ర తీరప్రాంతాలతో పాటు.. కావలి, కందుకూరు, ఉలవపాడు, అల్లూరు ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీచాయి. ఈదురు గాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు తీగలపై చెట్ల కొమ్మలు పడ్డాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయంది. గంగపట్నం, రాముడిపాళెం గ్రామాల్లోని రొయ్యల చెరువులపై ఉన్న స్తంభాలు  పడిపోయాయి. దీంతో ఆక్వా రైతులు అవస్థలు పడుతున్నారు. వెంటనే విద్యుత్ పునరుద్ధరించాలని కోరుతున్నారు. 


కావలిలో అత్యధికంగా 7.94 సెంటీమీటర్ల వర్షపాతం, కందుకూరులో 7, బోగోలులో 6.58 సెంటీమీటర్లు వర్షంకురిసింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే పొలాల్లోకి నీరు చేరింది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటే.. మామిడి కాయలకు పురుగుపట్టే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళ్లాల్లో తడచిన ధాన్యం మొలకెత్తే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. 




అప్రమత్తమైన యంత్రాంగం.. 
జిల్లా మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాని కోరారు. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.


 


జిల్లా ఎస్పీ విజయరావు, విద్యుత్ శాఖ అధికారులతో కలసి కావలి, కందుకూరు ప్రాంతాల్లో పర్యటించారు. ఎస్పీ విజయరావు స్వయంగా గస్తీ కార్యక్రమాలను పర్యవేక్షించారు. మత్స్యకార గ్రామాలకు వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. ఏ సమయంలోనైనా పోలీస్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.