భారత స్వాతంత్ర పోరాటంలో దక్షిణ భారత దేశానికి కూడా ప్రముఖ స్థానం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా వాసులకు గాంధీజీతో మంచి అనుబంధం ఉంది. నెల్లూరు జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో పల్లిపాడు అనే గ్రామంలో గాంధీజీ తన స్వహస్తాలతో ఆశ్రమానికి శంకుస్థాపన చేశారు. రెండుసార్లు ఆయన ఆశ్రమాన్ని సందర్శించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆ జ్ఞాపకాలను ఓసారి చూద్దాం.
సబర్మతి ఆశ్రమం తర్వాత ఆ స్థాయిలో దక్షిణాదిన పేరున్న ఆశ్రమం పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం. 1915లో తొలిసారిగా గాంధీజీ నెల్లూరుకి వచ్చారు. ఆ తర్వాత ఆయన దక్షిణ భారత యాత్రలో భాగంగా 1921లో నెల్లూరుకి వచ్చి పినాకిని ఆశ్రమాన్ని స్థాపించారు. ఈ ఆశ్రమ స్థాపనకు స్థానిక స్వాతంత్ర సమరయోధురాలు పొణకా కనకమ్మ కృషి ఉంది. ఆశ్రమానికి స్థల దాత కూడా ఆమే. గాంధీజీ బోధనలతో ప్రభావితమైన ఆమె, మరికొందరితో కలసి ఈ ఆశ్రమాన్ని 1921 ఏప్రిల్ 7న ఏర్పాటు చేశారు.
అప్పట్లో పల్లిపాడు తుపాకి కేంద్రంగా ఉండేదని అంటారు. సాయుధ బలగాలకు అక్కడ శిక్షణ ఇచ్చేవారని కూడా చెబుతుంటారు. గాంధీజి అహింసా సిద్ధాంతాల తర్వాత హింసాత్మక పోరాటాలు మాయమైపోయాయి. అందరూ సత్యాగ్రహ బాటపట్టారు. సబర్మతి ఆశ్రమం తర్వాత నెల్లూరు పినాకిని ఆశ్రమంలో కూడా స్వాతంత్ర పోరాట కార్యక్రమాలు జరిగేవి. దక్షిణాఫ్రికాలో గాంధీజీ అనుచరుడిగా ఉన్న రుస్తుంజీ ఆశ్రమ నిర్మాణానికి విరాళం అందజేశారు. ఆయన గుర్తుగా ఆయన పేరుతో ఇక్కడ రుస్తుంజీ భవనం ఉంటుంది.
గాంధీ ఆశ్రమం స్థాపించడంతోపాటు, ఆయన గుర్తులు అనేకం ఉన్నాయని చెబుతుంటారు. గాంధీజీ ఆశ్రమం వద్దకు వచ్చే సమయంలో ఎద్దులబండిపై ఆయన్ను తీసుకొచ్చారు. అయితే ఎద్దులను చర్నాకోలతో కొట్టడం కూడా ఆయనకు ఇష్టం ఉండేది కాదట, ఎద్దుల ఇబ్బంది చూడలేక గాంధీజీ ఆ బండి దిగి కాలినడక ప్రారంభించారని కూడా గుర్తు చేసుకుంటారు.
పెన్నా తీరంలో 18 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉన్న గాంధీ ఆశ్రమంలో ప్రతి ఆదివారం గాంధీ బోధనలు వినిపిస్తారు. భజనలు జరుగుతాయి. ఇక్కడే డిజిటల్ లైబ్రరీ ఉంది. అప్పుడప్పుడు విద్యార్థులు విజ్ఞాన యాత్రల్లో భాగంగా గాంధీ ఆశ్రమాన్ని సందర్శించడానికి వస్తుంటారు. ప్రస్తుతం వరదల సమయంలో గాంధీ ఆశ్రమం కోతకు గురవుతుంటుంది. ఇటీవల పెన్నా వరదలకు గాంధీ ఆశ్రమంలోనికి కూడా వరదనీరు వచ్చి చేరింది. ఈ ఆశ్రమాన్ని మరింత ఉన్నతిగా తీర్చిదిద్ది, పర్యాటక కేంద్రంగా మార్చితే గాంధీ గుర్తులు నెల్లూరుకు మరింత పేరు తెస్తాయి. 2005 నుంచి ఈ ఆశ్రమాన్ని రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆశ్రమంలో ఆధునిక సౌకర్యాలు కల్పించారు. 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాలు జరుగుతున్న వేళ, నెల్లూరు గాంధీ ఆశ్రమం, నెల్లూరుకి ఓ మరపురాని మధురానుభూతి.