Atmakur Bypoll: ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రారంభం, బరిలో మొత్తం 14 మంది అభ్యర్థులు

Mekapati Vikram Reddy: ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

Continues below advertisement

Atmakur Bypoll Starts: నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ప్రారంభం అయింది. పరిశ్రమ మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఆయన హఠాత్తుగా చనిపోవడంతో ఈ ఉప ఎన్నికలు వచ్చాయి. గురువారం తెల్లవారుజామునే (జూన్ 23) పోలింగ్‌ సిబ్బంది, పరిశీలకులు, వెబ్‌ కాస్టింగ్‌ సిబ్బంది సహా అందరూ ఈవీఎంలతో వారికి కేటాయించిన పోలింగ్‌ బూత్ లకు చేరుకున్నారు.

Continues below advertisement

నేడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వైసీపీ అభ్యర్థిగా దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డినే ఎంపిక చేసింది. చనిపోయిన వ్యక్తి కుటుంబం నుంచే అభ్యర్థిని ఎంపిక చేయడం వల్ల టీడీపీ పోటీ నుంచి తప్పుకుంటుందని ఆ పార్టీ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 26న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదే రోజు ఫలితం వెల్లడి కానుంది.

కాంగ్రెస్ కూడా ఎవర్నీ బరిలో నిలపలేదు. బీజేపీ అభ్యర్థిగా భరత్‌ కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా న్యాయవాది ఓబులేశు సహా మరో 11 మంది ఉప ఎన్నికల పోటీలో ఉన్నారు.

279 పోలింగ్ స్టేషన్లు
మొత్తం 2,13,400 మంది ఓటర్లు నియోజకవర్గంలో ఉండగా, వారి కోసం 198 ప్రాంతాల్లో 279 పోలింగ్‌ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఓటింగ్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డింగ్‌తో పాటు.. వెబ్‌క్యాస్టింగ్‌ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి చక్రధర్‌ బాబు చెప్పారు. ఉప ఎన్నిక కోసం మొత్తం 1,409 మంది అధికారులు విధుల్లో ఉన్నారని చెప్పారు. ఇతర సిబ్బందిని నియమించినట్లు రిటర్నింగ్‌ అధికారి హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. వీటిలో 363 ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లు, 391 వీవీ ప్యాట్స్‌ను సిద్ధం చేశారు. సుమారు 2 వేల మంది పోలీసులు, భద్రతా సిబ్బందిని మోహరించారు.

ఆత్మకూరు ప్రశాంతంగానే కనిపిస్తున్నా పోలింగ్ కేంద్రాల్లో 44 శాతం సమస్యాత్మకమైనవేనని అధికారులు నిర్థారించారు. మొత్తం 6 మండలాల్లో 279 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 123 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించిన అధికారులు  అక్కడ అదనపు బలగాలను మోహరించారు. టీడీపీ పోటీలో లేకపోవడంతో గొడవలు జరిగే అవకాశం లేదని అనుకున్నా.. స్థానికంగా ఉన్న గ్రూపు రాజకీయాలతో ఎలాంటి పరిణామాలు ఉంటాయోనని పోలీసులు ముందు జాగ్రత్త తీసుకున్నారు. 123 కేంద్రాల వద్ద వెబ్ క్యాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. 

Continues below advertisement