మాండూస్ తుపాను ప్రభావానికి నెల్లూరు జిల్లా చిగురుటాకులా వణికిపోతోంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని ముత్తుకూరు మండలం బ్రహ్మదేవిలో 12.5 సెంటీమీటర్ల అత్యథిక వర్షపాతం నమోదైంది. శనివారం కూడా పూర్తిగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా తుపాను ప్రభావం కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత మహాబలిపురం వద్ద మాండూస్ తీరాన్ని దాటింది. ఆ తర్వాత అది క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో రెండురోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను తీరం దాటిన తర్వాత దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాల ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడుకంటే ఎక్కువగా నెల్లూరు జిల్లాలోనే వర్షాలు పడుతున్నాయి.
అలుగు దాటి పారుతున్న చెరువులు
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చెరువులు అలుగులు దాటి పారుతున్నాయి. జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారు. జిల్లా అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అవసరం ఉన్నవారిని అక్కడికి తరలిస్తున్నారు.
సోమశిల గేట్లు ఎత్తివేత..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెన్నాకు నీరు ఎక్కువగా వస్తోంది. దీంతో సోమశిల నిండుకుండలా మారింది. పూర్తి నీటిమట్టం 72టీఎంసీలు కాగా ప్రస్తుతం సోమశిలలో 69టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో ఆరు గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు వదులుతున్నారు. పెన్నాకు వరదనీరు భారీగా విడుదల చేస్తుండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.
పంటనష్టం..
నెల్లూరు జిల్లాతోపాటు, దక్షిణ కోస్తాలో కూడా పంటనష్టం అధికంగా కనపడుతోంది. ప్రస్తుతం ఇక్కడ వరినాట్ల దశలో ఉంది. అటు బాపట్ల, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రం వరికోతల దశలో ఉంది. కొంతమంది వడ్లను కళ్లాల్లోనే ఉంచారు. రోడ్లపై ఆరబోశారు. వారంతా ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇంకెన్నిరోజులు..
దక్షిణ కోస్తాపై తుపాను ప్రభావం ఊహించినదానికంటే ఎక్కువగానే కనపడుతోంది. తుపాను తీరం దాటే సమయంలో పెద్దగా వర్షాలు లేవు కానీ, తీరం దాటిన తర్వాత మాత్రం వానలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా చలిగాలులు పెరిగాయి. బయటకు రావాలంటేనే ప్రజలు వణికిపోతు న్నారు. అటు రాయలసీమలో కూడా వర్షాలు పడుతున్నాయి. శనివారం పూర్తిగా వర్షాలు పడతాయని అంచనా. అటు ఆదివారం కూడా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు.
ఆగిపోయిన కార్యక్రమాలు..
వైసీపీ నేతల గడప గడప కార్యక్రమాలకు తుపాను అడ్డుపడింది. నాయకులంతా తుపాను కారణంగా గడప గడప వాయిదా వేసుకున్నారు. టీడీపీ నేతల ఇదేం ఖర్మ కూడా వాయిదా పడింది. ప్రస్తుతం నాయకులంతా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో కలసి వారు సమీక్షలు నిర్వహిస్తున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.