నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మధ్య మాటల తూటాలు పేలడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఒకరి బలహీనతలు ఇంకొకరు బయటపెట్టుకునేవరకు వెళ్లింది వ్యవహారం. నీ సంగతి తేలుస్తానంటే, నీ చర్మం ఒలిచేస్తానంటూ సవాళ్లు విసురుకున్నారు. ఆధిపత్య పోరుని రోడ్డున పడేసుకున్నారు.
టార్గెట్ అనిల్..
నెల్లూరు జిల్లాలో అనిల్ కి తొలిదఫా మంత్రి పదవి రావడం స్థానిక నాయకుల్లో కొంతమందికి ఇష్టం లేదనేది బహిరంగ రహస్యమే. కానీ బీసీ కోటాలో అనిల్ కి తొలిదఫా మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు సీఎం జగన్. రెండో దఫా ఆయనకు మంత్రి పదవి పోయింది. ఆ స్థానం కాకాణి గోవర్దన రెడ్డికి దక్కింది. దీంతో నెల్లూరులో రాజకీయం మారింది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గోవర్దన్ రెడ్డి అప్పటికే ఎమ్మెల్యేలందరితో సఖ్యతతో ఉండేవారు. ఆ తర్వాత ఆయన స్థానంలో జిల్లా అధ్యక్ష పదవిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అప్పగించారు, కాకాణి కేవలం మంత్రిగానే కొనసాగుతున్నారు. కాకాణి మంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నెల్లూరులో జరిగిన ఫ్లెక్సీ వార్ అనిల్ కి ఆయనకు మధ్య ఉన్న విభేదాలు బయటపెట్టాయి. ఓ సారి సీఎం జగన్ వద్ద కూడా అనిల్, కాకాణి మధ్య పంచాయితీ జరిగింది. ఆ తర్వాత కూడా వారిద్దరూ కలసి లేరు.
మాజీ మంత్రి అనిల్ కి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మధ్య విభేదాలున్నాయి, పక్క నియోజకవర్గం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో కూడా వైరం ఇటీవలే పెరిగింది. ఆమధ్య ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి రాజమోహన్ రెడ్డితో కూడా మాటల యుద్ధం జరిగింది. పోనీ ఈ ముగ్గురు పార్టీనుంచి బయటకెళ్లిపోయారనుకుంటే.. మిగతా వారితో కూడా పెద్దగా మాటలు కలిసే సందర్భాలు లేవు. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితో అనిల్ కు విభేదాలున్నాయని ఇటీవల పుకార్లు గుప్పుమన్నాయి. ఆ తర్వాత వారిద్దరూ కలసి కనిపించినా పరిస్థితిలో మార్పు లేదంటున్నారు.
ఇక నెల్లూరు సిటీ విషయానికొస్తే, సగం మంది కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తో కలసిపోయారు. వారంతా అనిల్ కి వ్యతిరేక వర్గంగా మారారు. నెల్లూరు అర్డన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ తో కూడా అనిల్ కి సఖ్యత లేదు. ఆమధ్య ముక్కాల ఫ్లెక్సీలు చించివేసిన ఆరోపణలు కూడా అనిల్ వర్గంపై ఉన్నాయి. దాదాపుగా అనిల్ నెల్లూరు జిల్లాలో ఒంటరిగా మారిపోయారు. ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో పడదు, సొంత నియోజకవర్గంలో కూడా ఇద్దరు కీలక నేతలు ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారు. కానీ అనిల్ మాత్రం తనకు జగన్, జనం.. ఈ రెండే కీలకం అని చెబుతుంటారు.
అనిల్ గెలుపోటముల సంగతి పక్కనపెడితే... ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు కనీసం టికెట్ వస్తుందా లేదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే అనిల్ స్వయంగా టికెట్ విషయంలో నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసారు. తనకు టికెట్ ఇవ్వనని సీఎం జగన్ చెప్పినా.. తాను గెటౌట్ అన్నా కూడా పార్టీనుంచి వెళ్లిపోను అన్నారు.
నెల్లూరు సిటీలో ప్రస్తుతానికి వైసీపీకి అనిల్ కి మించిన ప్రత్యామ్నాయం లేదు. కానీ పరిస్థితి రోజు రోజుకీ ఇలా తయారవుతుంటే మాత్రం కచ్చితంగా ఆ విషయంలో అధిష్టానం ఆలోచనలు మారే అవకాశముంది. దానికోసమే అనిల్ వైరి వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. ఆయన్ను ఒంటరి చేయడానికి సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. ఈ యుద్ధంలో అనిల్ ఇంట గెలిచి ఆ తర్వాత రచ్చ గెలవాలి. అది సాధ్యమవుతుండా...? లేదా..? తేలాల్సి ఉంది.