ఎన్నికలకు టైమ్ దగ్గరపడేకొద్దీ వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడప కార్యక్రమాన్ని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు సీఎం జగన్. మూడోసారి ఈ కార్యక్రమంపై రివ్యూ చేపట్టడానికి ఆయన రెడీ అయ్యారు. తొలి రెండు దశల్లో కొంతమంది గడప గడప సరిగా చేయలేదని ఆయన వేలెత్తి చూపించిన సంగతి తెలిసిందే. అయితే గడప గడపతోపాటు స్థానికంగా పార్టీకి బలం చేకూర్చడానికి కూడా నాయకులు ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం చేరికలపై దృష్టి పెట్టారు అనిల్ కుమార్ యాదవ్.


మంత్రి పదవిలో ఉండగా అనిల్ సిటీ నియోజకవర్గంపై పెద్దగా ఫోకస్ పెట్టలేకపోయారు, మాజీ అయిన తర్వాత ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటీవల ఆయనకు ప్రాంతీయ ఇన్ చార్జ్ పదవిని కూడా సీఎం జగన్ తొలగించారు. దీంతో ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గంపై మరింత ఫోకస్ పెట్టారు. సిటీలో పార్టీని బలోపేతం చేయడానికి చేరికలకు శ్రీకారం చుట్టారు.


2024లో ఏం జరుగుతుంది..


2019లో అనిల్ కుమార్ యాదవ్ అతి స్వల్ప మెజార్టీతో అప్పటి మంత్రి నారాయణపై విజయం సాధించారు. హోరాహోరీ పోరులో చివరి వరకు ఉత్కంఠగా సాగిన లెక్కింపులో అదృష్టం అనిల్ వైపు నిలిచింది. దీంతో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడం, పార్టీ కూడా గెలవడం, బీసీ యువ నాయకుల్లో అనిల్ ప్రముఖంగా కనిపించడంతో మంత్రి పదవి ఇచ్చారు సీఎం జగన్. ఆ తర్వాత సామాజిక సమీకరణాల కారణంగా మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో అనిల్ కి పదవి పోయింది. అయినా కూడా వచ్చే ఎన్నికల్లో గెలిచి, తిరిగి మంత్రి పదవి సాధిస్తానని అంటున్నారు అనిల్. ఇప్పటినుంచే నెల్లూరు సిటీలో పార్టీని బలోపేతం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈసారి కూడా మాజీ మంత్రి నారాయణ, అనిల్ కి ప్రత్యర్థి అవుతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో మరింత పగడ్బందీగా ఆయన పథకాలు రచిస్తున్నారు.


నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నా.. 2024లో కొన్నిచోట్ల గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అలాంటి నియోజకవర్గాల్లో నెల్లూరు సిటీ ఒకటి అంటున్నారు. అయితే నారాయణ గతంలో ఓడిపోయిన తర్వాత ఇంతవరకు మళ్లీ సిటీవైపు కన్నెత్తి చూడలేదు. పండగలు ఇతర కార్యక్రమాల సమయంలో ఆయన నెల్లూరు సిటీకి వస్తారు కానీ రాజకీయంగా యాక్టివ్ గా లేరు. కానీ ఎన్నికల సమయానికి నారాయణ టీడీపీ టికెట్ తో వస్తారని, అనిల్ కి గట్టిపోటీ ఇస్తారని అంటున్నారు.


నారాయణ బలమైన అభ్యర్థి అయినా, నగరంలో పార్టీని పటిష్టం చేసుకుంటే గెలుపు నల్లేరుపై నడకే అని అంటున్నారు అనిల్. గతంలో ఉన్నంత టఫ్ ఫైట్ ఈసారి ఉండకపోవచ్చని, సీఎం జగన్ సంక్షేమ పథకాలు, స్థానికంగా తాను ప్రారంభించిన అభివృద్ధి పథకాలు తన గెలుపుకి బాటలు వేస్తాయంటు న్నారు.


తాజాగా ఆయన టీఎన్ఎస్ఎఫ్ నాయకులను పార్టీలో చేర్చుకున్నారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కనుపూరు సుకేష్ వర్ధన్ రెడ్డి, ఆయన మిత్రులు దాదాపు 100 మంది  నెల్లూరు నగరంలో అనిల్ ఇంటి వద్ద వైసీప కండువాలు కప్పుకున్నారు. వారందరినీ సాదరంగా ఆహ్వానించి, పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు అనిల్. ప్రతిఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పని చేయాలని సూచించారు. టీడీపీని బలహీనపరిచేందుకు అనిల ఇప్పటినుంచే పథక రచన చేస్తున్నారు. నెల్లూరు సిటీలో చెప్పుకోదగ్గ నాయకులు లేకపోవడం, నారాయణ కూడా తిరిగి నెల్లూరు రాజకీయాల్లో వేలు పెట్టకపోవడంతో ఇక్కడ టీడీపీ పరిస్థితి కాస్త గందరగోళంగానే ఉంది.