మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మరోసారి ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇటీవల వ్యవసాయ శాఖపై సోమిరెడ్డి చేసిన విమర్శలకు ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సోమిరెడ్డి పేరెత్తకుండానే వాడు, వీడు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాకాణి గోవర్దన్ రెడ్డి. గాడిదలు కాసేవాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. రైతులను రెచ్చగొట్టి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకులను విమర్శించారు. నోటి దూలతో మాట్లాడే వారికి సరైన సమాధానం చెబుతానన్నారు.


ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణిపై విమర్శలు ఎక్కుపెట్టారు. రైతులను వైసీపీ ప్రభుత్వం ఆదుకోవట్లేదని, ముఖ్యంగా వ్యవసాయ మంత్రిగా ఉన్న కాకాణి అస్సలు పట్టించుకోవట్లేదన్నారు. గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం, ఇప్పుడు వర్షాలకు మునిగిపోయిన రైతులను కూడా గాలికి వదిలేసిందన్నారు సోమిరెడ్డి. ఆయన మాటలను మీడియా కాకాణి ముందు ప్రస్తావించగా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఉడతలు పట్టేవాళ్లు, గాడిదలు కాసేవాళ్లు ఏదో అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


మనుబోలు మండలంలో మంత్రి కాకాణి పర్యటించారు. భారీ వర్షాలకు నష్టపోయిన పొలాలను పరిశీలించారు. రైతులన ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. భారీ వర్షాలకు తక్షణ సాయం కూడా ప్రభుత్వం ప్రకటించిందని, నష్టపగోయిన రైతులకు ప్రత్యేకంగా సాయం చేసేందుకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అంచనాలు తయారు చేయిస్తున్నామన్నారు మంత్రి కాకాణి. ఇక సోమిరెడ్డి వ్యాఖ్యలపై ఆయన పేరెత్తకుండా పరోక్షంగా  ఆయనను ఉద్దేశించి టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు పేల్చారు.


ఉడతలు పట్టేవాడి విమర్శలను తాను పట్టించుకోబోనని అన్నారు కాకాణి. వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకునేలా సలహాలు సూచనలు ఇవ్వాల్సింది పోయి రైతులను రెచ్చగొట్టి ప్రయోజనం పొందే విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందన్నారు. భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోందని వివరించారు.


నష్టపరిహారాన్ని అంచనా వేయడానికి ముందే టీడీపీ నేతలు జనాల్లోకి వచ్చి రచ్చ చేస్తున్నారని, రకరకాల విమర్శలు చేస్తూ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారని చెప్పారు కాకాణి. రైతులను ఈ ప్రభుత్వానికి దూరం చేయాలని టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు చేసిన వారిని ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు. నష్టపరిహారం గుర్తించి రైతుల ఖాతాలో ప్రభుత్వంఆ సొమ్ము చెల్లించే వరకు మాత్రమే టీడీపీ నేతలు మాట్లాడగలుగుతారని, వారికి సరైన సమాధానం చెబుతామని అన్నారు. ఏ రైతుకు నష్టం కలగకుండా ప్రతి రైతును ఆదుకునేలా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని రైతులందరికీ అండగా ఉంటామని మంత్రి కాకాణి తెలిపారు. నోటి దూలతో మాట్లాడేవారు మాటలు కట్టిపెట్టాలని హితవు పలికారు.


ఆయన పేరు ఎత్తకుండానే అనాల్సిన మాటలు అనేసి..


సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాణి, సోమిరెడ్డి మధ్య ఆధిపత్య పోరు ఎప్పటినుంచో ఉంది. అయితే సోమిరెడ్డి వరుస ఓటముల తర్వాత ఆయనకు సర్వేపల్లిలో పట్టు తగ్గింది. కానీ గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ హోదాలో ఆయన మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం కాకాణి అదే వ్యవసాయ శాఖకు మంత్రిగా ఉన్నారు. అయితే మంత్రి పదవి చేపట్టిన తర్వాత కాకాణి ఎప్పుడూ సోమిరెడ్డి పేరెత్తలేదు. మరీ ఎక్కువగా ఆగ్రహం వస్తే పేరెత్తకుండానే పరోక్షంగా టీడీపీ నేతపై చురకలంటిస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి సోమిరెడ్డిపై ఇలా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.