Nara Lokesh Counter to Jagan:
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ పై సీఎం జగన్ నేడు (సెప్టెంబర్ 16న) వెటకారంగా స్పందించిన విషయం తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలులో ములాఖత్ పేరుతో మిలాఖత్ జరిగిందంటూ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు కాపు నేస్తం సభలో సెటైర్లు పేల్చారు జగన్. సీఎం జగన్ వ్యాఖ్యలకు ఢిల్లీనుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. చంచల్ గూడ జైలులో జరిగిన మిలాఖత్ ల సంగతేంటని జగన్ ను ప్రశ్నించారు.
ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అనే ఉర్దూ సామెత మాదిరిగా సీఎం జగన్ తీరు ఉందని అన్నారు నారా లోకేష్. మహా ముదురైన దొంగ, మంచోడైన పోలీసుని తరిమినట్టు ఆయన ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. 42 వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దోచేసి 38 కేసుల్లో ఏ1 గా ఉన్న జగన్, చంద్రబాబు గురించి మాట్లాడటమేంటని ప్రశ్నించారు లోకేష్.
చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి కక్షతో అక్రమ అరెస్టుచేయించిన సీఎం జగన్ ములాఖత్-మిలాఖత్ అంటూ పంచ్ డైలాగులు కొడుతున్నారని కౌంటర్ ఇచ్చారు లోకేష్. చంచల్ గూడలో నీ ములాఖత్ లు మరిచిపోయావా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించడానికి తెరవెనుక ఆయన ఎంతమందితో మిలాఖత్ అయ్యారని అడిగారు. ఆ విషయం ఆయనకు గుర్తుండకపోవచ్చన్నారు. అవినీతిపరులైనవారికి, నీతిమంతుల్ని చూస్తే చులకన భావం అని, నీతిమంతులకు కూడా అవినీతిని అంటకట్టడం వారి మానసిక రుగ్మత అని చెప్పారు. దాన్ని మెగలోమేనియా డిజార్డర్ అంటారని చెప్పారు. లండన్ లో పదిరోజులు ఉన్న జగన్, ఆ మానసిక వ్యాధికి చికిత్స చేయించుకోవాల్సింది అని చురకలంటించారు.
మాది స్కిల్ డెవలప్మెంట్.. మీది కిల్ డెవలప్మెంట్..
సొంత బాబాయ్ పై గొడ్డలి వేటు వేసిన జగన్, వెన్నుపోటు అనే పదం ఉచ్ఛరించడానికి అనర్హుడని అన్నారు నారా లోకేష్. చట్టం అందరికీ సమానమే అయితే.. తాను చేసిన దొంగతనాలు, దోపిడీలపై కోర్టుల విచారణకి జగన్ పదేళ్లుగా ఎందుకు హాజరు కావడంలేదో ప్రజలకి చెప్పాలన్నారు. 45 ఏళ్ల నిబద్ధత కలిగిన చంద్రబాబుని జైలులో అక్రమంగా బంధించాననుకుంటున్నారని.. విమర్శించారు. "నీ బాబే, మా బాబుని ఏం చేయలేకపోయాడు. 38 కేసుల్లో నిందితుడివి నువ్వెంత? ఐటీని అభివృద్ధి చేసి, పరిశ్రమలు రప్పించి లక్షలాది మంది యువతకి ఉపాధి కల్పించిన చంద్రబాబుది స్కిల్ డెవలప్మెంట్ అయితే, అధికారానికి అడ్డం వచ్చి, అవినీతిని ప్రశ్నించిన సొంత బాబాయ్ నుంచి దళితులైన డాక్టర్ సుధాకర్, ఓం ప్రతాప్, డాక్టర్ అచ్చెన్నలాంటి వందలమందిని అంతమొందించిన నీది కిల్ డెవలప్మెంట్" అని ఎద్దేవా చేశారు లోకేష్.
అవినీతిపై ఆధారాలుంటే కోర్టులో కౌంటర్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని తాము అన్ని ఆధారాలు ఇచ్చామని, రూపాయి అవినీతి జరిగిందని చూపించే ఒక్క ఆధారమైనా మీ దగ్గర ఉందా? అని ప్రశ్నించారు లోకేష్. "సొంత బాబాయ్‌ని చంపేశావు, తల్లిని తరిమేశావు, చెల్లిని బెదిరించావు, ప్రజల సొమ్ము అడ్డంగా దోచేశావు. సొంత ఇంట్లో వాళ్లకి కాలేని బిడ్డ, ఊరందరికీ బిడ్డ ఎలా అవుతాడో?" అన్నారు లోకేష్.