భయం మా బయోడేటాలో లేదంటున్నారు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఫ్యాక్షనిస్టు ముఖ్యమంత్రి ఐతే పాలన ఎలా ఉంటుందో గత ఎన్నికలకు మునుపే చంద్రబాబు హెచ్చరించారని గుర్తు చేశారు. జగన్ పుణ్యమా అని ఇప్పుడు జననాలు కళ్లారా చూస్తున్నారని అన్నారు. చిత్తూరులో పర్యటించిన నారాలోకేష్‌... అరెస్టైన టీడీపీ లీడర్లను జైల్లో మీట్ అయ్యారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం లేదని.. రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని కామెంట్ చేశారు. జగన్ రెడ్డి ఒక పిరికి ఫ్యాక్షనిస్ట్ అని.. ఒక ట్వీట్ పెడితే భయపడి వందల మంది పోలీసులను పంపిస్తున్నారంటూ ఎద్దేవా చేశాకు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన స్దానిక ఎమ్మెల్యే పర్యటనకు వస్తే ఆయనపై కూడా దాడి చేశారని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. చింతమనేని, జేసీ ప్రభాకర్ ఇలా వందల మందిపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి నారాయణను కూడా వేధించారని.. చివరకు తనపై కూడా 15 కేసులు పెట్టారని అన్నారు. 


భయం మా బయోడేటాలో లేదు.. 


భయపడటానికి ఇక్కడ రాజారెడ్డి కాదని.. చంద్రబాబు అంటూ నారా లోకేష్ పంచ్‌లతో విరుచుకుపడ్డారు. పోలీసులు ఐపీసీ కాకుండా జగన్ పీనల్ కోడ్ అమలు పరుస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. రేపు అధికారంలోకి వచ్చేది తామేనని... అధికార దుర్వినియోగం చేసిన అధికారి ఐపీఎస్ అయినా వదిలి పెట్టేది లేదని తెలిపారు. సొంత తల్లికి, చెల్లికి ముద్ద పెట్టని వ్యక్తి పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్‌కు ఎలా ఒప్పుకుంటాడాటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో కూడా అన్న క్యాంటీన్‌ను 60 మంది వైసీపీ నేతలు అడ్డుకున్నారని గుర్తు చేశారు.  కుప్పంలో అర్థరాత్రి అన్న క్యాంటీన్ పై దాడి జరిగిందని వివరించారు. ఈ వైసీపీ శ్రేణులు మనుషులా? పశువులా ? అంటూ తీవ్రంగా కామెంట్లు చేశారు.


జెడ్ ప్లస్ కేటగిరి ఉన్న చంద్రబాబు పర్యటనకు వస్తే ఆయనకు భద్రత కల్పించాల్సిన ఎస్పీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు లోకేష్. ఎస్పీ వెళ్ళి స్దానిక ఎమ్మెల్సీ ఇంట్లో కూర్చొని టీ తాగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఎస్పీ సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలకు దాడి చేయాలని గైడ్ లైన్స్ వెళ్లాయని వ్యాఖ్యానించారు. వైకాపా ఇంచార్జ్ భరత్ రండి రండి అడ్డుకోండంటూ మెసేజ్ పెట్టారని.. ఎస్పీ అతనిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని నిలదీశారు. 


మీ కార్యకర్తల్లా పేటీఎమ్ బ్యాచ్ కాదు..


ఆనాడు చంద్రబాబు అనుకుని ఉంటే మీరు రోడ్లుపై తిరిగేవారా అని నారా లోకేష్ అన్నారు. 10 శాతం పెండింగ్ ఉన్న హంద్రీ నీవా ప్రాజెక్టును.. వైసీపీ ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదన్నారు. భరత్, పెద్దిరెడ్డి గజ దొంగల్లా మైనింగ్‌లో దోచుకొని తింటున్నారన్నారు. చంద్రబాబు పర్యటన జరిగే సమయంలో వైసీపీ నేతలకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ప్రశాంతమైన కుప్పంలో 4 సంవత్సరాల తొమ్మిది నెలలు ప్రశాంతంగా ఉంటారని... మూడు నెలలు మాత్రమే ఎన్నికల పనులు చేస్తారన్నారు. తమ కార్యకర్తలు వైసీపీలా పేటియం బ్యాచ్ కాదంటూ తీవ్ర విమర్శలు చేశారు నారా లోకేష్. తమ కుప్పం నాయకులు బాబాయ్‌ని చంపి, అమ్మ, చెల్లెల్లను తరిమి జైలుకు వెళ్లలేదని అన్నారు. పేదలకు అన్నం పెట్టె అన్న క్యాంటీన్ కోసం పోరాడి జైలుకు వెళ్ళారన్నారు. యుద్దానికి తాము సిద్దం అంటూ నారా లోకేష్ తెలిపారు.