నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యలు చెప్పుకోడానికి తాను అసెంబ్లీలో ప్రయత్నిస్తే అన్యాయంగా తన గొంతు నొక్కారని, తనను సభనుంచి సస్పెండ్ చేశారంటూ మండిపడ్డారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అదే సమయంలో తనని తిట్టేందుకు చేతులెత్తిన ఐదుగురు మంత్రులకు స్పీకర్ అవకాశమిచ్చారని, వారితో తనపై తీవ్ర ఆరోపణలు చేయించారని చెప్పారు. ఆ ఐదుగురు మంత్రులు గతంలో తనగురించి మంచిగా మాట్లాడేవారని, కానీ సడన్ గా తాను వారికి శత్రువుగా మారానని అన్నారు.




అసభ్యంగా మాట్లాడారు..


మంత్రులంతా మైక్ ముందు సవ్యంగా మాట్లాడినా, ఆఫ్ ది రికార్డ్ తన వద్దకు వచ్చి తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని చెప్పారు కోటంరెడ్డి. తన కుటుంబ సభ్యుల గురించి, తన గురించి అసభ్యంగా మాట్లాడారాని చెప్పారు. అయినా తగ్గేది లేదని, బెదిరేది లేదని, రూరల్ నియోజకవర్గ సమస్యల పరిష్కారం కోసం తాను ఎందాకైనా పోరాడుతూనే ఉంటానన్నారు.


5 నిమిషాల మైక్ కోసం..


నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమస్యలు చెప్పుకుంటాను, తనకు 5 నిమిషాలసేపు మైక్ ఇవ్వండ్ అని స్పీకర్ ని కోరినట్టు తెలిపారు ఎమ్మెల్యే కోటంరెడ్డి . 4 గంటల 10నిమిషాల సేపు అసెంబ్లీలో నిలబడే ఉన్నానని, కానీ తనకు ఐదు నిమిషాలు మాట్లాడే అకాశం ఇవ్వలేదని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.


రూరల్ ఆఫీస్ లో మాక్ అసెంబ్లీ..


అసెంబ్లీ బడ్జెట్ సెషన్ నుంచి పూర్తిగా సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు చేరుకున్నారు. నెల్లూరులోని తన ఆఫీస్ ప్రాంగణంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఇందులో కోటంరెడ్డి అనుచరులు పాల్గొన్నారు. ఒక నాయకుడు స్పీకర్ గా వ్యవహరించారు. కోటంరెడ్డి తన సమస్యలు చెప్పుకుంటున్నారని, ఆయన సమస్యలు విందామని చెప్పారు స్పీకర్. ఆ తర్వాత స్పీకర్ కి ధన్యవాదాలు చెబుతూ కోటంరెడ్డి మాట్లాడారు. చివరకు కోటంరెడ్డి సమస్యలు చెప్పుకోడానికి అవకాశం కూడా ప్రభుత్వం ఇవ్వడంలేదని, ప్రభుత్వాన్ని జీవితకాలం పాటు సస్పెండ్ చేస్తున్నట్టుగా సదరు స్పీకర్ స్థానంలో కూర్చున్న నాయకుడు చెప్పారు. మాక్ అసెంబ్లీతో వైసీపీ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.


గాంధీగిరిలో నిరసన చేస్తే... సస్పెండ్ చేసి మార్షల్ చేత బయటకి పంపించారని, ఏం చేశానని అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు తనకు సస్పెండ్ చేశారో చెప్పాలన్నారు. ఈ నెల 30వ తేదీ లోపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పొట్టేపాళెం ములుముడి కలుజు మీద వంతెనలకు ప్రభుత్వం పరిష్కారం చూపకపోతే ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక్కడినే 9 గంటలపాటు జలదీక్ష చేపడతానన్నారు. ఇప్పటి వరకూ శాంతి యుతంగానే తాను పోరాటం చేశానని, ఇకపైనా తాను అదే పంథా కొనసాగిస్తానని, తనపై ద్వేషంతో రూరల్ ప్రజలకు అన్యాయం చేయొద్దని ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే.


ఈ మాక్ అసెంబ్లీ అనంతరం.. ఎమ్మెల్యే కోటంరెడ్డి అనుచరుడు, ఇటీవల దాడి కేసులో అరెస్ట్ అయిన తాటి వెంకటేశ్వర్లు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వైసీపీ నెల్లూరు సిటీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇన్నాళ్లూ తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు.