ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు (మార్చి 16) 10 గంటలకు  ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టానున్నారు. రూ.2.70 లక్షల కోట్లతో బడ్జెట్ ఉంటుందని అంచనా. గత ఏడాది కంటే కూడా ఈసారి కేటాయింపులు ఎక్కువగానే ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. సంక్షేమ పథకాలకు అధిక మొత్తంలో కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. నాడు-నేడు కింద ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఈసారి ఆస్పత్రులకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.


నిన్న ఆర్థిక సర్వే
శాసన సభలోని సీఎం చాంబర్‌లో 2022-23 సామాజిక ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి బుధవారం (మార్చి 15) విడుదల చేశారు. అనంతరం ప్రణాళికశాఖ కార్యదర్శి విజయ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రగతిలో ఏపీ నంబర్‌ వన్‌ అని అన్నారు. రూ.13.17 కోట్లు జీఎస్డీపీ నమోదైందని అన్నారు. గతంతో పోల్చితే రూ.1.18 లక్షల కోట్లు జీఎస్డీపీ పెరిగిందని ఆయన తెలిపారు.


మొత్తం భారత దేశం సరాసరి కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని వివరించారు. సేవా రంగంలో  18.91 శాతం, వ్యవసాయంలో 13.18 శాతం, పరిశ్రమలలో 16.36 శాతం చొప్పున వృద్ధి నమోదైందని వివరించారు. 36 శాతం కంట్రిబ్యూషన్‌ వ్యవసాయం నుంచి వస్తోందని తెలిపారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కనిపిస్తోందని, ఆలిండియా యావరేజ్‌ కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువ అని అన్నారు. ఏపీ అభివృద్ధి 16.2 శాతం నమోదైందని అన్నారు. విద్య, ఆరోగ్య రంగాల్లో అనుహ్య అభివృద్ధి సాధించామని, శిశు మరణాలు గణనీయంగా తగ్గాయని విజయ్‌ కుమార్‌ వెల్లడించారు.


8 గంటలకు కేబినెట్ భేటీ


ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతారు. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేం­ద్రనాథ్‌ 2023–24 వార్షిక బడ్జెట్‌ను ఉద­యం 10 గంటలకు అసెంబ్లీకి సమర్పిస్తారు. శాసన మండలిలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా బడ్జెట్‌ ప్రసంగాన్ని చదవనున్నారు. వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టడం పూర్త­యిన వెంటనే ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపిస్తారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చదివి వినిపించనున్నారు. 


ఇప్పటికే బడ్జెట్ గురించి అధికార పార్టీ నేతలు స్పందిస్తూ.. అన్ని రంగాల అభివృద్ధిని సమ్మి­ళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైఎస్సార్‌ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చారు. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ పథకాలకు తగినన్ని కేటాయింపులు చేయనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ­కు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో ప్రత్యే­కం­గా నిధులు కేటాయింపులు చేస్తున్నారు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేయనున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం సబ్సిడీకి నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.