నెల్లూరు జిల్లా కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై జరిగిన దాడి రాజకీయ దుమారం రేపింది. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (YSRCP) గూండాలే డ్రైవర్‌, కండెక్టర్‌పై విచక్షణా రహితంగా దాడి  చేశారంటూ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆరోపించింది. టీడీపీ నేత నారా లోకేష్‌ కూడా వైఎస్‌ఆర్‌సీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే... ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసింది  ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారే అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అంటున్నారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా మీడియా ముందు  పెట్టారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి.


టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన వారే ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేశారని స్పష్టంగా చెప్పారు. నిందితుల్లో కొందరు ఐ సపోర్ట్‌ బాబు బ్యానర్లు పట్టుకోగా... మరొకరు జనసేన జెండాతో  కనిపించారని చెప్పారు. నిందితుల్లో బీజేపీ నేత అనుచరుడు కూడా ఉన్నట్టు చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి. వీరికి సంబంధించిన ఫొటోలను కూడా  బయటపెట్టారు. డ్రైవర్‌పై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గూండాలు దాడి చేశారన్న నారా లోకేష్‌కు ఆయన సవాల్‌ విసిరారు. కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనలో వైఎస్‌ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీకి సంబంధం ఉందని నిరూపిస్తే... తాను రాజీనామా చేస్తానన్న ఆయన.. అందుకు లోకేష్‌ సిద్ధమా అని ఛాలెంజ్‌ చేశారు. 


టీడీపీ, జనసేన తీరు.. దొంగే.. దొంగ దొంగ అన్నట్టుగా ఉందన్నారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి. నిజానిజాలు తెలుసుకోకుండా నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌  నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఫైరయ్యారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ విషయం జరిగినా.. దాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌  పార్టీకి ముడిపెట్టడం టీడీపీ, జనసేనకు అలవాటై పోయిందని విమర్శించారు. లోకేష్‌ తన ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే రామిరెడ్డి  ప్రతాప్‌కుమార్‌రెడ్డి.


కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు సుధీర్‌ అని.... అతనిపై ఇప్పటికే ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పారు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి. ఆ  కేసుల వివరాలన్నీ బయటపెడతామన్నారు. అంతేకాదు.. నిందితుడు సుధీర్‌... గతంలో తన కారుపై కూడా దాడి చేసినట్టు చెప్పారు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి.  తెలుగుదేశం పార్టీలో టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్న పసుపులేటి సుధాకర్‌ అనుచరులు కూడా డ్రైవర్‌పై దాడి చేసిన గ్యాంగ్‌లో ఉన్నారని చెప్పారు. అతని పేరు గుర్రంకొండ  అరుణ్‌ కుమార్‌ అంటూ ఫొటో చూపించారు ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో జనసేన తరపున తనపై పోటీ చేసిన సుధాకర్‌ దగ్గర ఇలాంటి రౌడీ గ్యాంగులు ఉన్నాయని చెప్పారు. ఆ  గ్యాంగును ఉపయోగించి ఏమేమి పనులు చేస్తున్నారో పూర్తి సమచారాం తన దగ్గర ఉందన్నారు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి. మరో నిందితుడు శివారెడ్డి అని...  అతను జనసేన కార్యకర్త అని చెప్పారు. 


టీడీపీ, జనసనే, బీజేపీ నేతల అనుచరులు... డ్రైవర్‌పై దాడిచేస్తే దాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఆపాదించి లేనిపోని ఆరోపణలు చేస్తూ ఊరుకోమని అన్నారు ఎమ్మెల్యే  రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి. పవన్‌కళ్యాణ్‌ తీరును కూడా ప్రశ్నించారాయన. ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలన్నారు. శివారెడ్డి జనసేన కార్యకర్త అన్న విషయం  పవన్‌కళ్యాణ్‌ తెలుసుకోవాలన్నారు. డ్రైవర్‌పై దాడి చేసిన వారిని వదిలిపెట్టేంది లేదని.. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే.