ఎమ్మెల్యేలంతా ప్రజల్లోకి వెళ్లండి, వారి కష్టాలు చూడండి, ఇంటిలో కూర్చుని ప్రజల్ని మీ వద్దకు పిలిపించుకోవద్దు, మీరే ప్రజల్లోకి వెళ్లండి అంటూ ఇటీవల వైఎస్సార్ సీపీ లేజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో ఉపదేశమిచ్చారు సీఎం జగన్. అలా ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్తే ఏమవుతుందో చెప్పే ఉదాహరణ ఇది. ఇల్లు దాటి బయటకు వెళ్లలేని ఓ అంధురాలు తన ఇంటికే ఎమ్మెల్యే వచ్చారని తెలుసుకుని తన బాధ చెప్పుకుంది. తన జీవితంలో వెలుగు రేఖలు ఆవిష్కరించాలని వేడుకుంది.
కళ్లులేని ఆడపిల్ల. పేరు పాదర్తి కామాక్షి. 15 ఏళ్లుగా ప్రపంచాన్ని చూడలేదు. చిన్నప్పుడు ఐదేళ్ల వయసులో ఆమె అనారోగ్యంతో చూపు కోల్పోయింది. తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్తే ఆపరేషన్ చేస్తే చూపు వస్తుందని చెప్పారు. కానీ పేదరికం ఆ తల్లిదండ్రుల చేతులు కట్టేసింది. ఆమె జీవితాన్ని 15 ఏళ్లుగా అంధకారం చేసింది. అప్పటి నుంచి అంధురాలిగానే జీవితం కొనసాగిస్తోంది. ప్రస్తుతం జగనన్న మాట గడప గడపకు కోటంరెడ్డి బాట అనే కార్యక్రమం చేస్తున్న ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ నియోజకవర్గంలోని పాత వెల్లంటి గ్రామంలో పర్యటిస్తున్నారు.
ఈ క్రమంలో అంధురాలయిన ఆ యువతి ఎమ్మెల్యేతో తన గోడు చెప్పుకుంది. తనకు చూపు తెప్పించాలని ఆశతో ఆయనకు మొర పెట్టుకుంది. ఈ సన్నివేశం అక్కడ ఉన్నవారందరినీ కలచి వేసింది. కళ్లు లేకపోవడంతో ఎక్కడికీ ఆమె వెళ్లలేదు. ఎవరికీ తనకు చూపు తెప్పించండి అని చెప్పే అవకాశమే లేదు. గడపగడపకు అనే కార్యక్రమం ద్వారా నేరుగా ఎమ్మెల్యేనే తన ఇంటికి వచ్చాడని తెలిసే సరికి ఆమెలో ఎక్కడో చిన్న ఆశ వెలుగు చూసింది. నేరుగా ఎమ్మెల్యేతోనే తన బాధ చెప్పుకుంది. తనకు చూపు తెప్పించాలని వేడుకుంది. మాటిచ్చి వెళ్లిపోవద్దని, తనకు ప్రమాణం చేయాలని చేతిలో చేయి వేసి చెప్పించుకుంది. ఎమ్మెల్యే కూడా ఆమె బాధ విని చలించిపోయారు. కచ్చితంగా చూపు తెప్పిస్తానని మాటిచ్చారు. రేపే కారు పంపిస్తానని, డాక్టరు వద్దకు తీసుకెళ్లి చెకప్ చేయిస్తానని మాటిచ్చారు. కంటి చూపు వస్తుందని డాక్టర్లు చెబితే, ఎంత ఖర్చయినా తానే భరించి ఆపరేషన్ చేయిస్తానన్నారు.
‘‘నాపేరు కామాక్షి. అనుకోకుండా మా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మా ఇంటికి వచ్చారు. నేను నాకు కళ్లు వచ్చేలా చేయాలని వేడుకున్నాను. నేను ఈ ప్రపంచాన్ని చూసేలా నాకు కళ్లు రావాలని మీరంతా ఆశీర్వదిస్తారని నేను ఆశిస్తున్నాను. నాకు కనుక కళ్లు తెప్పిస్తే ఆయన్ను నేను దేవుడి మాదిరిగా, తండ్రిలా కొలుస్తాను’’ అని బాధితురాలు వేడుకున్నారు.