నెల్లూరు గ్రామీణ నియోజకవర్గానికి టీడీపీ ఇన్‌ఛార్జిగా స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పార్టీ అధిష్ఠానం నియమించింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీధర్‌ రెడ్డిని నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమించినట్లుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేడు (జూలై 25) ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇక నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు కార్యకర్తలు, నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సహకరించాలని పిలుపు ఇచ్చారు.


నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ సీపీ నుంచి గత ఎన్నికల్లో ఎన్నికైన సంగతి తెలిసిందే. కొద్ది నెలల క్రితం పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీకి దగ్గరయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గతంలోనే టీడీపీలో చేరారు. అయితే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇద్దరు సోదరులు కలిసి కీలకంగా వ్యవహరించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో యువగళాన్ని విజయవంతం చేశారని మంచి పేరు పొందారు. దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పని తీరుకు సంతృప్తి చెందిన చంద్రబాబు ఆయనను పార్టీ ఇన్‌చార్జిగా నియమించారని అంటున్నారు.