ఏపీ, తెలంగాణలో ఎవరి ప్రాధాన్యాలు వారికి ఉంటాయని, రెండురాష్ట్రాలను పోల్చి చెబుతూ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని మీడియాపై మండిపడ్డారు మంత్రి కాకాణి. వ్యవసాయ యాంత్రీకరణపై తప్పుడు రాతలు రాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ వార్తలు అర్థరహితం అన్నారు కాకాణి. ఏపీలో వ్యవసాయాన్ని పట్టించుకోవట్లేదని, విత్తనాల సరఫరాపై ప్రభుత్వం దృష్టిపెట్టట్లేదని వచ్చిన కథనాలను మంత్రి కాకాణి ఖండించారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రైతులు సంతోషంగా ఉంటున్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వం రైతులకు చేసిన మేలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయట్లేదని చెప్పారు. 


చంద్రబాబుకి ఐటీ నోటీసులివ్వడంపై వారి అనుకూల మీడియాలో ఎందుకు వార్తలు రావడం లేదని ప్రశ్నించారు కాకాణి. రాజధాని పేరుతో తాత్కాలిక భవనాల పేరుతో సబ్ కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి ముడుపులు తీసుకున్నారని, అది తప్పే కదా అన్నారు. కేంద్ర ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులతోనే అవినీతి జరిగిందనే విషయం నిర్థారణ అయిందని చెప్పారు. చంద్రబాబు కమీషన్లు తీసుకున్నారని ప్రజలకు అర్థమైందని చెప్పారు. ఇప్పుడు సమాధానం చెప్పలేక చంద్రబాబు కప్పిపుచ్చుకుంటున్నారని, దమ్ముంటే టీడీపీ అనుకూల మీడియా దీనిపై వార్తలు రాయాలన్నారు. 


మార్గదర్శి చిట్ ఫండ్ లో అక్రమాలు, వెస్ట్ బెంగాల్ లోని శారదా చిట్ ఫండ్స్ కుంభకోణంతో సమానం అన్నారు మంత్రి కాకాణి. దానిపై కూడా ఎవరూ స్పందించడంలేదని చెప్పారు. 


మోసం, దగా..
చంద్రబాబు అధికంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు తీరు, మన రాష్ట్రంలో జగన్ ఇచ్చిన హామీలు అమలును విశ్లేషించాలన్నారు కాకాణి. చంద్రబాబు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. దాని గురించి ఎవరూ ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరువు మండలాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారని, నాలుగేళ్లు బాగా వర్షాలు పడ్డాయి కదా, ఇక కరువు మండలాలు ఎక్కడుంటాయని అడిగారు కాకాణి. ఇటీవల చంద్రబాబు రాష్ట్రంలో తిరగడం వల్లే వర్షాలు రావడం లేదని  ప్రజలు అంటున్నారని సెటైర్లు వేశారు. ఇప్పుడు మళ్లీ వర్షాలు మొదలయ్యాయని, ఆరు జిల్లాలలో  బాగా కురుస్తున్నాయని చెప్పుకొచ్చారు. 


టీడీపీ హయాంలో కంపెనీలతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుని అక్రమాలకు పాల్పడ్డారని, రైతులకు ఇచ్చే ట్రాక్టర్లలో సబ్సిడీ ని మింగేశారని విమర్శించారు కాకాణి. తమ ప్రభుత్వ హయాంలో ఏది కొనాలనే విషయంలో రైతులకే  అవకాశం కల్పించామన్నారు. కండలేరు హై లెవెల్ కెనాల్ కు సంబంధించి గ్రావిటీ తోనే నీళ్లు ఇస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో నీళ్లు అడుగంటి లిఫ్ట్ ద్వారా ఇచ్చారని గుర్తు చేశారు. సోమశిల జలాశయం పరిధిలోని రైతులను తీసుకు వచ్చి టీడీపీ నేతలు ధర్నా చేయించారని, లిఫ్ట్ పథకానికి రూ.3.56 కోట్లు  కరెంటు బిల్లులు చెల్లించనిది గత టీడీపీ ప్రభుత్వమేనన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో  కోటి రూపాయలు బిల్లు అయిందని, టీడీపీ హయాంలో బిల్లు కట్టక పోవడంతో సర్ ఛార్జ్   కలవడంతో బిల్లు అధికమైందని వివరించారు. ఈ విషయం చెప్పకుండా చంద్రబాబు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కాకాణి.