Kakani Govardhan Reddy: కేంద్ర డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ నిబంధనల ప్రకారమే కరవు మండలాల ప్రకటన ఉంటుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. కరవు మండలాలపై టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్న 14 ఏళ్లు కరవు విలయతాండవం ఆడిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతాంగానికి సాయం చేస్తున్నా ఏదో విధంగా బురద చల్లాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. రైతులను ప్రభుత్వంపై రెచ్చగొట్టాలని దుర్మార్గమైన ఆలోచనకు టీడీపీ పూనుకుందని మండిపడ్డారు. 


టీడీపీ నేతలకు ఎల్లో మీడియా వంత పాడటం దురదృష్టకరమని మంత్రి కాకాణి అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ శాఖ మంత్రులుగా పత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు ఏం ఒరగబెట్టారో చెప్పి పర్యటిస్తే బావుంటుదన్నారు. ఖరీఫ్‌లో, రబీలో ఏ పంటలు వేస్తారో? ఏ కాలువ కింద ఆయకట్టు సాగు అవుతుందో తెలియని వ్యక్తి లోకేశ్‌ కూడా వ్యవసాయంపై లేఖలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు. అసలు వ్యవసాయం, రైతుల సమస్యలపై లోకేశ్‌కు అవగాహన ఉందా? చర్చించగలవా? అంటై ప్రశ్నించారు. 


వ్యవసాయం దండగ అన్నది చంద్రబాబు కాదా?
వ్యవసాయం శుద్ధ దండగ అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అంటూ కాకాణి విమర్శించారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని అన్నారు. కనీస అవగాహన లేకుండా ఎల్లో మీడియా వార్త రాయడం దారుణమన్నారు. చంద్రబాబు హయాంలో ఏనాడైనా కరవు మండలాల ప్రకటించి రైతులకు సాయం చేశారా? నష్టపోయిన రైతులకు బీమా ఇచ్చారా? రుణమాఫీ చేశారా? అంటూ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో నోటిఫైడ్ పంటలు నష్టపోయిన రైతులకు ఉచిత పంటల బీమా అందజేస్తున్నామని, సబ్సిడీపై విత్తనాలు ఇస్తున్నామని చెప్పారు. రుణాలు రీషెడ్యూల్ చేస్తున్నామని వివరించారు.  


ఖరీఫ్‌లో సాధారణ వర్షపాతం 574.7 మి.మీ ఉంటే.. ఈసారి 487.2 మి.మీ దాదాపుగా 15% తక్కువగా నమోదైనట్లు చెప్పారు. సాగు విస్తీర్ణం కొంతమేర తగ్గిందని వెల్లడించారు. ప్రత్యామ్నాయ పంటలుగా ఉలవలు, అలసంద, మినుము, పెసర, కంది, రాగి, కొర్ర, జొన్న, మొన్నజొన్న, పొద్దుతిరుగుడు, తక్కువ పంట కాలం ఉండే వరి రకాలు ప్రోత్సహించాలని 1.13 లక్షల రైతులకు 80% సబ్సిడీతో రూ.26 కోట్ల విలువైన 29 వేల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేసినట్లు చెప్పారు. అలాగే వర్షాభావ పరిస్థితుల్లో.. రైతులు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. 


నష్టపోయిన రైతులకు బీమా వర్తింపజేస్తాం
ముందస్తు రబీకి రైతులు వెళ్తారని శనగ పంటలకు సబ్సిడీని 25% నుంచి 40% పెంచి ఇచ్చినట్లు చెప్పారు. 89 వేల మంది రైతులకు రూ.40.45 కోట్ల విలువ చేసే శనగ విత్తనాలు అందజేశామన్నారు. నీరందక నష్టపోయిన రైతులందరికీ ఉచిత పంటల బీమా పథకం వర్తింపజేస్తామన్నారు. నోటిఫైడ్ పంటలకు రైతులు కట్టాల్సిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించి వైఎస్ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం క్రింద సాయం అందజేస్తామని చెప్పారు.  ఈ-క్రాప్ అయిన నోటిఫైడ్ పంటకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. మేనేజ్‌మెంట్ నిబంధనల మేరకు 103 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించినట్లు చెప్పారు. 


పుట్టపర్తిలో రెండో విడత రైతు భరోసా విడుదల
ఖరీఫ్‌కు సంబంధించి జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు లెక్కించిన తరువాత సెప్టెంబర్‌లో కరవు మండలాలు ప్రకటిస్తామన్నారు. సెప్టెంబర్ నెలాఖరు వరకు కరవుకు సంబంధించిన వివరాలన్నీ అక్టోబర్‌ 31 నాటికి కరవు మండలాలుగా ప్రకటిస్తామని చెప్పారు. రబీకి సంబంధించి అక్టోబర్‌ నుంచి మార్చి వరకు సీజన్ ఉంటుందని, మార్చి నెలాఖరు వరకు వచ్చిన వివరాలతో మార్చి నెలాఖరుతో కరవు మండలాలుగా ప్రకటించాలని ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు అన్ని విధాలుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అండగా నిలుస్తున్నారని మంత్రి కాకాణి చెప్పారు. ఇప్పటికే మొదటి విడత రైతు భరోసా వేశామని. రెండో విడత రైతు భరోసా 7వ తేదీ పుట్టపర్తి జిల్లాలో సీఎం జగన్ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారని చెప్పారు.