చంద్రబాబుకి సిగ్గు, శరం ఏదీ లేదని.. అందుకే ఆయన తనకి ఓట్లు వేసిన ప్రజల గురించి పట్టించుకోకుండా అసెంబ్లీకి మొహం చాటేసి కూర్చున్నారని మండిపడ్డారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. రెండు రోజుల అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ కోసం అధికార పక్షం ప్రయత్నిస్తుంటే టీడీపీ రాద్ధాంతం చేసి బయటకు పారిపోయిందని అన్నారాయన. అసెంబ్లీకి రాకుండా చంద్రబాబు తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. ఆయన డైరెక్షన్లో టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి సస్పెండ్ అవడానికే ప్రయత్నిస్తున్నారని, ప్రజల గురించి మాట్లాడే అవసరం వారికి లేదన్నారు.
సిగ్గుంటే చంద్రబాబు అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు మంత్రి కాకాణి. నారా హమారా, అమరావతి హమారా అంటూ యాత్రలు చేస్తున్నారని, అది రాజధాని యాత్ర కాదని, చంద్రబాబు పాపాల యాత్ర అని మండిపడ్డారు. అమరావతి రాజధాని కాదని, అది చంద్రబాబు గేటెడ్ కమ్యూనిటీ అన్నారు. అక్కడ చంద్రబాబు, ఆయన వర్గానికి చెందిన కొంతమంది మాత్రమే ఉంటారన్నారు. రాజధాని ప్రకటనకు ముందే అక్కడ టీడీపీ నేతలు భూములెలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు కాకాణి. అమరావతిలో టీడీపీ నేతలు ఎక్కడెక్కడ భూములు కొన్నారో సాక్ష్యాధారాలతో తాము రుజువు చేశామని, కానీ వారి బుకాయింపులు మాత్రం ఆగలేదన్నారు. రాజధాని వస్తుందని వారికి ముందే తెలిసి భూములు కొన్నారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి ఇంతకంటే రుజువులు కావాలా అని ప్రశ్నించారు కాకాణి.
శ్రీలంకలా ఏపీ కావాలని చంద్రబాబు కోరుకుంటున్నారని, అందుకే పదే పదే అదే ప్రస్తావన తెస్తున్నారని చెప్పారు. చంద్రబాబు సెక్యూరిటీ లేకుండా ప్రజలకు కనపడితే బాది పడేస్తారని, బాదుడే బాదుడు అంటే అర్థం ప్రజలే చూపిస్తారని అన్నారు కాకాణి. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టే తాము ధైర్యంగా గడప గడపకు తిరుగుతున్నామని చెప్పారు కాకాణి. కానీ టీడీపీ బాదుడే బాదుడు అంటూ ఫొటోలకు ఫోజులిచ్చి సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేసుకుంటోందని మండిపడ్డారాయన. అసలు చంద్రబాబు ఏం చేశారని జనంలోకి వస్తారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఒక్క సీటు కూడా రాదని అన్నారు.
ఉద్యోగాలివ్వలేదంటూ ప్రభుత్వంపై ప్రతిపక్షం విమర్శలు చేస్తోందని, అసలు తమ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత చంద్రబాబుకి లేదన్నారు కాకాణి. ఉద్యోగాలివ్వలేదంటూ రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబు, ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ ప్రజల్ని మోసం చేయలేదా అని ప్రశ్నించారు. తాను ఉద్యోగాలు ఇవ్వలేకపోయానంటూ చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాకాణి. ఉద్యోగాల పేరుతో మోసం చేశారని అన్నారు.
కరోనా కష్టకాలంలో కూడా ఆర్థిక పరిస్థితులు చక్కదిద్దామని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు మంత్రి కాకాణి. గతంలో కూడా ఇవే నిధులు ఉన్నాయాని, అప్పుడు ఈ పథకాలు ఎందుకు అమలు చేయలేకపోయారని నిలదీశారు. ఏపీలో సమగ్రంగా స్కూల్స్ అభివృద్ధి చేసామని, హాస్టల్స్ అభివృద్ధి చేశామని చెప్పారు.
గుమ్మడికాయల దొంగలు..
శాసన మండలిలో కూడా టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదని మండిపడ్డారు కాకాణి గోవర్దన్ రెడ్డి. గత ప్రభుత్వాలు వ్యవసాయం శుద్ధ దండగ అని అన్నామని తమ నేతలు అంటే.. లోకేష్ చటుక్కున లేచి తామెక్కడన్నామని ప్రశ్నించారని, గుమ్మడికాయల దొంగ అంటే లోకేష్ భుజాలు తడుముకోవడం ఎందుకని ప్రశ్నించారు కాకాణి.
టీడీపీ హయాంలో 10 మందికి ఇన్నోవా కార్లు మరో 10మందికి లోన్లు ఇచ్చారని, నీరు చెట్టుకింద పనులు చేయకుండా నిధులు భోం చేశారని చెప్పారు. నీరు చెట్టు కింద ఎంత ఆయకట్టు స్థిరీకరించారో చెప్పాలన్నారు. తమకి అనుకూలమైనవారికి మాత్రమే వారి హయాంలో పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని, వైసీపీ హయాంలో అర్హులందరికీ లబ్ధి చేకూరిందని చెప్పారు కాకాణి.