లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుని సకాలంలో చెల్లించని వారికి సహజంగా ఎదురయ్యే సంఘటనలు ఇవి. అలా లోన్ చెల్లించనివారితోపాటు, వారి ఫోన్ లోని కాంటాక్ట్ నెంబర్లకి కూడా ఫోన్లు చేసి  బెదిరించడం లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల పని. అయితే ఇక్కడ వారు చేసిన తప్పేంటంటే.. మంత్రి కాకాణికి ఫోన్ చేయడం. లోన్ రికవరీ కోసం సదరు వ్యక్తి ఫోన్ బుక్ లోని కాంటాక్స్ట్ కి ఫోన్లు చేసి బెదిరిస్తున్న ముఠా, అనుకోకుండా మంత్రి కాకాణి నెంబర్ కి కూడా ఫోన్ చేసి బెదిరించింది. మంత్రి పీఏ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. 


అసలేం జరిగిందంటే..?
చెన్నైలోని కోల్‌ మన్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ పలు బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీలకు రుణాల రికవరీ ఏజెన్సీగా పనిచేస్తోంది. నెల్లూరులోని రామలింగాపురంలో ఒక ఫైనాన్స్‌ సంస్థ నుంచి పాతపాటి అశోక్‌ కుమార్‌ అనే వ్యక్తి రూ.8.5 లక్షలు అప్పుగా తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో చెన్నైలోని కోల్‌ మన్‌ కంపెనీ సంస్థని సదరు ఫైనాన్స్ సంస్థ ఆశ్రయించింది. అశోక్ కుమార్ మొబైల్ నెంబర్ ఇచ్చి, మొండి బాకీ వసూలు చేయాలని చెప్పింది. దీంతో ఆ ఏజెన్సీ రంగంలోకి దిగింది. రికవరీ ఏజెన్సీ మేనేజర్లు ప్రసాద్‌ రెడ్డి, మహేంద్రన్‌, పెంచలరావు, టీం లీడర్‌ మాధురి వాసు కలిసి రికవరీకోసం ప్రయత్నించారు. అశోఖ్ కుమార్ ఫోన్ బుక్ ఆధారంగా అందులో ఉన్న నెంబర్లకు ఫోన్లు చేశారు. అందులో మంత్రి కాకాణి ఫోన్ నెంబర్ కూడా ఉండటంతో కాల్ కాకాణికి వెళ్లింది. ఆ సమయంలో ఆ ఫోన్ ఆయన పీఏ శంకరయ్య దగ్గర ఉంది. బెదిరించినట్టుగా మాట్లాడటంతో శంకరయ్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


ఫోన్ చేసి బెదిరింపులు..
ఈ ఫిర్యాదు అందుకున్న పోలీసులు స్పెషల్ టీమ్ సహాయంతో బెదిరింపులకు పాల్పడుతున్నవారిని అరెస్ట్ చేశారు. అప్పు తీసుకున్నవారు అందుబాటులో లేకపోతే వారి పేరు చెప్పి.. వారి ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్నవారికి ఫోన్లు చేసి వేధిస్తున్నారు రికవరీ ఏజెంట్లు. అప్పు తీసుకున్నవారు తెలిసినవారే కావడం, కొన్నిసార్లు బెదిరింపులు మరీ ఎక్కువ కావడంతో కొంతమంది అమాయకులు రికవరీ ఏజెంట్లకు మనీ ట్రాన్స్ ఫర్ చేస్తున్నారని తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ స్నేహితుల పరువు తామే తీసుకున్నట్టవుతుందని, కొంతమంది ఈ విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో రికవరీ ఏజెన్సీలు మరీ బరితెగించి పోతున్నాయి. 


మంత్రి నెంబర్ కి కాల్ రావడంతో..
ఇటీవల లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల వ్యవహారం బాగా శృతి మించుతుందనే ఆరోపణలున్నాయి. చాలామంది వారి వేధింపులుల, అవమానాలు భరించలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడిన సంఘటనలున్నాయి. నెల్లూరులో ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు జరగలేదు. అయితే నేరుగా మంత్రికే ఫోన్ కాల్ వెల్లడంతో రికవరీ ఏజెంట్లు అరెస్ట్ అయ్యారు. సామాన్యులకు ఇలాంటి బెదిరింపులు వస్తే వ్యవహారం అరెస్ట్ ల వరకు వెళ్తుందా అనేది మాత్రం అనుమానమే. 


నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాల మేరకు ఎస్సైలు శివకృష్ణారెడ్డి, అంజిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శివనాంచారయ్య, స్వప్న, సురేష్‌ బాబు ఒక బృందంగా ఏర్పడి ఈ కేసులో దర్యాప్తు చేపట్టారు. చెన్నైలో ముగ్గురిని, నెల్లూరులో ఒకరిని అరెస్టు చేసినట్లు వివరించారు. వారినుంచి నాలుగు సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. లోన్ యాప్ వేధింపులు ఎక్కువైతే పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు.