మహిళా మావోయిస్ట్ రామోజు రాజేశ్వరి అలియాస్ దేవక్క అలియాల్ లక్ష్మి నెల్లూరు జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయారు. ఆమె వయసు 59 సంవత్సరాలు. భర్త మరణం తర్వాత తీవ్ర కుంగుబాటుకి లోనైన రాజేశ్వరి పోలీసుల ముందు లొంగిపోయారు. ఆమెపై 4 లక్షల రూపాయల రివార్డుని ప్రభుత్వం గతంలో ప్రకటించింది.
ఎవరీ రాజేశ్వరి..?
రామోజు రాజేశ్వరి అలియాస్ దేవక్క అలియాస్ లక్ష్మి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరం దళంలో ఏరియా కమిటీ సభ్యురాలుగా పనిచేశారు. సీపీఐ ఎంఎల్, PWG (మావోయిస్టు), తూర్పు DVC తదితర దళాల్లో ఆమె పనిచేశారు. ఆమె స్వగ్రామం గుంటూరు మండలంలోని తాడికొండ. రాజమండ్రి, విశాఖ జిల్లాల్లో డెన్ కీపర్ గా ఉన్నారు. మావోయిస్టుల మీటింగ్ లకు, ఆర్థిక అవసరాలకు, వైద్య అవసరాలకు ఆమె తోడ్పాటునందించారు. మావోయిస్ట్ లు ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఏర్పడినప్పుడు ఆమె వారికి ఆశ్రయం ఇచ్చేవారు.
1974లో రామోజు నరేంద్ర అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు రాజేశ్వరి. అప్పటికే నరేంద్ర అలియాస్ సుబ్బన్న గుంటూరులో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో పనిచేసేవారు. ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా కావలి మండలం సత్యవోలు అగ్రహారం. రాడికల్ యూత్ లీగ్ కార్యక్రమాల్లో ఇరువురు పనిచేస్తున్నప్పుడు వారికి పరిచయం అయింది, ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. 1984 లో మావోయిస్ట్ భావాలకు ప్రభావితం అయిన రాజేశ్వరి దళంలో చేరారు. తన ఇద్దరి పిల్లల్ని హాస్టల్ లో వదిలి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.
ముందుగా భార్యా భర్తలిద్దరూ డెన్ కీపర్లుగా పనిచేసేవారు. కాంపౌండర్లుగా ఉంటూ మావోయిస్ట్ లకు ఆశ్రయం కల్పించేవారు. దళ సభ్యులకు, నాయకులకు వైద్య సహాయం అందించేవారు. 15-12-1987 లో భారీగా ఆయుధాలు కలిగి ఉన్న రాజేశ్వరిని మొదటిసారి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు మరో ఐదుగురుని కూడా కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు.
రాజేశ్వరిని విడిపించిన నక్సల్స్..
రాజేశ్వరి అరెస్ట్ తర్వాత నక్సల్స్ గుర్తేడు ప్రాంతం లో 8మంది ఐఏఎస్ అధికారులను కిడ్నాప్ చేశారు. వారిని విడిచిపెట్టాలంటే రాజేశ్వరిని విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. చివరకు రాజేశ్వరితోపాటు మిగతా ఐదుగురిని కూడా పోలీసులు విడిచి పెట్టారు. ఐఏఎస్ ఆఫీసర్లను నక్సల్స్ చెరనుంచి విడిపించుకున్నారు.
రాజేశ్వరిపై తూర్పు గోదావరి,ఏజన్సీ ఏరియాలో అడ్డ తీగల, గండవరం తదితర పోలీసు స్టేషన్ లలో 10 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 2018 లో భర్త మరణంతో రాజేశ్వరి తీవ్ర కుంగుబాటుకు లోనైనట్టు తెలుస్తోంది. ఆమెతోపాటు గతంలో పనిచేసిన చాలామంది ఇప్పటికే లొంగిపోయారు. వయసు రీత్యా, అనారోగ్య కారణాలతో ఆమె చివరకు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు ఎదుట లొంగిపోయారు. ఆమెపై రివార్డుగా ఉంచిన 4 లక్షల రూపాయల నగదుని ప్రభుత్వం ఆమెకే అప్పగించింది. చట్ట ప్రకారం ఇతర సౌకర్యాలను కూడా ఆమెకు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఎస్పీ విజయరావు. రాజేశ్వరి లొంగిపోయిన సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు.