ఇంట్లో మసి, వంట పాత్రలపై నుసి, నేలమీద దుమ్ము, చివరకు పచ్చని చెట్లపై కూడా దట్టంగా అలముకున్న బూడిద. ఇంట్లో ఉండలేరు, అలాగని అక్కడినుంచి వలస పోలేరు. ఇదీ నెల్లూరు జిల్లా కోవూరు దగ్గర ఉన్న పోతిరెడ్డిపాలెం గ్రామ వాసుల దుస్థితి. ఉదయాన్నే ఇంటి చుట్టూ అలముకున్న బూడిదను చిమ్మి పక్కన వేస్తే.. మధ్యాహ్నానికల్లా మళ్లీ బూడిద అలముకుంటుంది. మళ్లీ క్లీన్ చేస్తే, మళ్లీ సాయంత్రానికి మొత్తం బూడిదమయం అయిపోతుంది. 




ఒకటీ రెండ్రోజులంటే పర్లేదు, పోనీ ఇటుకల తయారీకి ఓ సీజన్ ఉంటుందంటే అదీ కాదు, సంవత్సరం పొడవునా ఇటుకల తయారీ జరుగుతూనే ఉంటుంది. దీంతో అక్కడి స్థానికులకు బూడిద బాధ తప్పడంలేదు. వంటపాత్రలన్నీ బూడిదమయం కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. శ్వాస కోశ సమస్యలున్నవారి పరిస్థితి మరింత దయనీయంగా ఉందని చెబుతున్నారు. 




స్థానికంగా ఉన్న ఇటుక బట్టీలతో బూడిద వచ్చి ఇళ్లలో పడుతుందని ఆరోపిస్తున్నారు ఇక్కడి ప్రజలు. ఇటుక బట్టీలను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని ఎన్నిసార్లు అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నా ఫలితం లేదంటున్నారు. ప్రస్తుతం 50 కుటుంబాల వారు ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరోక్షంగా మరో 100 కుటుంబాల వారు బూడిద వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని ఇటుక బట్టీలను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. 




ఇక్కడే కాదు, ఎక్కడైనే ఇటుక బట్టీల సమీపంలో నివశించేవారి జీవనం ఇలాగే ఉంటుంది. అందుకే ఊరికి దూరంగా, పొలాల మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశంలో ఇటుక బట్టీలను ఏర్పాటు చేసుకుంటుంటారు. కానీ నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలంలో మాత్రం ఇటుక బట్టీలు ఇలా జనావాసాల మధ్యే ఉన్నాయి. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. 




నిత్యం బూడిదతో సహవాసం చేస్తున్న వీరంతా తీవ్రమైన శ్వాసకోశ సమస్యల బారినపడే అవకాశముంది. బూడిద కణాలు నోరు, ముక్కు ద్వారా శరీరంలోకి వెళ్తే వాటి దుష్పరిణామాలు అధికంగా ఉంటాయి. అలాంటి సమస్యలతో ఇక్కడి ప్రజల జీవనం అస్తవ్యస్థంగా ఉంది. అయితే వీరికి మాత్రం ఇంకా పరిష్కారం దొరకలేదు. అధికారులకు అర్జీలిచ్చినా పనిజరగడంలేదు. 


దీంతో విసిగి వేసారిన గ్రామస్తులు ఇటుక బట్టీల వద్దకు వెళ్లి నిరసన చేపట్టారు. వెంటనే బట్టీలను అక్కడినుంచి తరలించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యకు పరిష్కారం చూపకపోతే అధికారుల కార్యాలయాలను ముట్టడిస్తామంటున్నారు స్థానికులు.