ప్రతిపక్షాలపై ఎప్పుడూ విమర్శలతో విరుచుకుపడే ఎమ్మెల్యే ప్రసన్న తనవారు అనుకుంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారని లోకల్‌గా టాక్ ఉంది. అనుచరులను ఎప్పుడూ ఆయన కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటారటని అనుచరులు చెప్పుకుంటారు. వారికి ఏ కష్టమొచ్చినా ఆదుకుంటారట. ఆ మధ్య నెల్లూరులో భారీ వర్షాలకు నష్టపోయిన కోవూరు నియోజకవర్గ ప్రజలకు కూడా ఆయన అండగా నిలిచారు. ఆయన తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి పేరు మీదుగా ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆర్థిక సాయం కూడా చేస్తుంటారు ప్రసన్న.
ఇటీవల కోవూరు నియోజకవర్గంలో ఇద్దరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు మృతి చెందారు. ఆ ఇద్దరు కార్యకర్తలు ప్రసన్నకు బాగా ముఖ్యులు. వారి ఇంటికి పరామర్శకు వెళ్లిన ప్రసన్న కుమార్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. బుచ్చిరెడ్డిపాలెం బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు గ్రామానికి చెందిన యాట అశోక్ కుటుంబాన్ని ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శించారు. ఆయన భార్యను ఓదార్చారు, పిల్లలకు తానున్నానంటూ భరోసా ఇచ్చారు. తన వంతుగా లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి ట్రస్ట్ ద్వారా ఈ ఆర్థిక సాయం అందించారు ప్రసన్న. ఈ క్రమంలో వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన ప్రసన్న అక్కడే కంటతడి పెడ్డారు. ఆ కుటుంబానికి తాను అండగా ఉంటానని చెప్పారు.
బుచ్చిరెడ్డి పాలెం మండలం చల్లాయపాళెం గ్రామానికి చెందిన అత్తిపాటి గోపి కూడా ఇటీవల మరణించాడు. ఆయన కూడా వైసీపీ కార్యకర్త. గోపి కుటుంబాన్ని కూడా ప్రసన్న కుమార్ రెడ్డ పరామర్శించారు. వారి ఇంటికి వెళ్లి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేశారు. కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
పార్టీని, తనను నమ్ముకుని ఉన్న కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వడమే కాకుండా, భవిష్యత్తులో ఎలాంటి అవసరం వచ్చినా తనను సంప్రదించాలని చెప్పారు ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయా కుటుంబాలను పరామర్శించే క్రమంలో ప్రసన్న కుమార్ రెడ్డి భావోద్వేగానికి గురి కావడం అక్కడున్న వారిని కూడా కలచి వేసింది. ప్రసన్న కుమార్ రెడ్డి తన సహచరులకు, పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారనడానికి ఈ ఘటనే ఉదాహరణ అని చెబుతున్నారు కోవూరు నియోజకవర్గ నాయకులు. ఎమ్మెల్యే వెంట వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ సూరా శ్రీనివాసులురెడ్డి, నియోజకవర్గ నాయకులు యర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, మండల కన్వీనర్ సతీష్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇటీవల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రసన్న హుషారుగా పాల్గొంటున్నారు. ఆమధ్య గడప గడప విషయంలో సీఎం జగన్ క్లాస్ తీసుకున్న తర్వాత ఆయన ఈ కార్యక్రమానికి ప్రయారిటీ పెంచారు. ప్రతి ఇంటికీ వెళ్లి వారికి ప్రభుత్వం తరపున అందిన సాయాన్ని తెలియజేస్తున్నారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకుని సచివాలయాలకు కేటాయించిన నిధులనుంచి వాటి పరిష్కారానికి సాయం చేస్తున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి.