నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజకీయ రసవత్తరంగా మారింది. అధికార పార్టీలోనే రెండు పవర్ సెంటర్లు ఇక్కడ ఉన్నాయి. ఒకటి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కాగా, రెండోది మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు రామ్ కుమార్ రెడ్డి. అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఆనందే హవా. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. వైసీపీ అధికారంలోకి రాగానే ఆనం లాంటి సీనియర్ ని మంత్రివర్గంలోకి తీసుకోకుండా పక్కనపెడతారని ఎవరూ అనుకోలేదు. అయితే అనూహ్యంగా ఆనంను పక్కనపెట్టారు జగన్. అప్పటి వరకూ టీడీపీలో ఉండి తీరా ఎన్నికల ముందు వైసీపీ కండువా కప్పుకోవడంతో ఆనంను కేవలం ఎమ్మెల్యేగానే పరిమితం చేశారు. 


అయితే మంత్రి పదవి దక్కకపోవడంతో ఆనం కొంత ధిక్కార స్వరాన్ని వినిపించారు. జిల్లా వైసీపీ నాయకులపై ఆయన గతంలో విమర్శలు చేశారు. పోలీసులు కొంతమంది నాయకుల చెప్పుచేతల్లో ఉన్నారనే విమర్శకూడా చేశారు. ఆ తర్వాత జిల్లాల విభజన సమయంలో ఆనం మూడు మండలాలకోసం పట్టుబట్టారు. చివరకు తాను అనుకున్నది సాధించినా నిరాహార దీక్షల పేరుతో హడావిడి చేయడంతో జగన్ దృష్టిలో ఆయనకు మంచి మార్కులు పడలేదని అంటారు. అయితే ఇదే సమయంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి లైన్లోకి వచ్చారు. ఆయనకు ఏపీ బోర్డ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్ మెంట్ చైర్మన్ గా ఇదివరకే కీలక పదవి ఇచ్చారు సీఎం జగన్. అయితే ఆయనకు వెంకటగిరినుంచి పోటీ చేయాలనే ఆలోచన ఉంది. 2024నాటికి వైసీపీలో పరిస్థితులు అనుకూలిస్తే వెంకటగిరి సీటు తనకే దక్కుతుందని అనుకుంటున్నారు రామ్ కుమార్ రెడ్డి. 


రామ్ కుమార్ మంత్రాంగం.. 
ఇటీవల రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి ప్రజలకు అందుబాటులో ఉండేందుకు నెల్లూరులో క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఉగాది సందర్భంగా ఆయన వెంకటగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేపడతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఆయన పెంచలకోన పుణ్యక్షేత్రానికి వచ్చారు. భారీ కార్ల ర్యాలీతో ఓ రాజకీయ యాత్రలాగా ఆయన అభిమాన గణంతో తరలి వచ్చారు. అక్కడే ప్రెస్ మీట్ పెట్టి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. 2024లో మీరు వెంకటగిరిలో పోటీ చేస్తారా అంటే.. ఇప్పుడే ఏం చెబుతామంటూ దాటవేశారు. 


వైసీపీకి చెందిన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో మరో నేత అంత ధైర్యంగా మందీ మార్బలంతో యాత్ర మొదలు పెడుతున్నారంటే అధిష్టానం అండదండలు ఉన్నట్టే లెక్క. అందులోనూ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అంటే.. కొట్టిపారేయలేదు సరికదా.. అప్పటి సంగతి అప్పుడు చూద్దామంటూ దాటవేశారు. అంటే రామ్ కుమార్ రెడ్డికి జగన్ నుంచి గట్టిగానే హామీ లభించిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. మరి రామనారాయణ రెడ్డి పరిస్థితి ఏంటి..? వెంకటగిరిలో వైసీపీ నుంచి సీటు నిరాకరిస్తే ఆయన ఏంచేయాలి. పొమ్మనే వరకు ఆయన ఉంటారా, లేక పొగ పెట్టేముందే బయటపడతారా..? ఇవేవీ కాకుండా.. జగన్ అభిమానం చూరగొని.. వచ్చే దఫా ఆయనే బరిలో నిలుస్తారా..? వేచి చూడాలి.