అసని తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఇంటర్ పరీక్ష రద్దయింది. అయితే గురువారం కూడా కొన్ని ప్రాంతాల్లో పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. నెల్లూరు జిల్లాలో వాగు అడ్డు రావడంతో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి రాలేకపోయారు. అయితే స్థానిక తహశీల్దార్ ప్రయత్నం, కలెక్టర్ చొరవతో.. ఎగ్జామ్ సెంటరే వారి దగ్గరకు కదిలొచ్చింది. దీంతో వారి కష్టాలు తీరాయి. పరీక్ష మిస్ అయిపోతామేమోనన్న భయంతో ఇబ్బంది పడ్డ ఇంటర్ స్టూడెంట్స్.. చివరకు సంతోషంగా పరీక్ష రాశారు. తహశీల్దార్ కృష్ణప్రసాద్, కలెక్టర్ చక్రధర్ బాబుకి మనసులో వేలవేల కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ఏంజరిగిందంటే..?
నెల్లూరు జిల్లాలో అసని తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లాయి. కలిగి మండల పరిధిలో పరీక్షలకు హాజరవ్వాల్సిన ఇంటర్ విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కలిగిరి మండలంలోని సిద్దనకొండూరు గ్రామం 14వ మైలు మార్గంలో పరికోట వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సిద్దనకొండూరు, అనంతపురం గ్రామాల నుంచి కావలికి రాకపోకలు ఆగిపోయాయి. అయితే ఆ రెండు గ్రామాలనుంచి 8 మంది ఇంటర్ విద్యార్థులు కావలిలోని పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉంది. దీంతో వారంతా పరీక్ష రాయలేమేమోననే భయంలో ఉన్నారు. మరోవైపు తల్లిదండ్రులు కూడా ఆందోళన పడ్డారు.
తహశీల్దార్ సమయస్ఫూర్తి..
అప్పటికే పరీక్ష టైమ్ దగ్గరపడింది. పరీక్ష ముందు కావలి బయలుదేరిన పిల్లల వ్యాన్ వాగుకు ముందు ఆగిపోయింది. వాగు దాటినా.. వారంతా కావలి చేరుకోవడం ఆలస్యమవుతుంది. దీంతో తహశీల్దార్ కృష్ణప్రసాద్ విషాయన్ని కలెక్టర్ చక్రధర్ బాబుకి చేరవేశారు. ఫోన్లో సమాచారం అందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. కావలి వెళ్లలేరు కాబట్టి.. వారికి ప్రత్యామ్నాయంగా మరో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే కలిగిరిలో వారికి పరీక్ష రాసేందుకు అవకాశమిచ్చారు. అలా విద్యార్థులంతా వాగుదాటి పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు.
విద్యార్థుల ఇబ్బందులు తెలుసుకున్న తహశీల్దార్ వెంటనే పరికోట వాగు దగ్గరకు చేరుకున్నారు. స్థానికుల సాయంతో పిల్లలను వాగు దాటించారు. స్థానికులంతా మానవహారంలా ఏర్పడి పిల్లలను వాగు దాటించారు. ఆ తర్వాత పిల్లలకు అసలు విషయం చెప్పారు. కావలి వెళ్లాల్సిన పనిలేదని, కలిగిరి కేంద్రంలోనే పరీక్ష రాసేలే చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీంతో పిల్లల ఆనందానికి అవధులు లేవు. పరీక్ష టైమ్ ముంచుకొస్తుంది, కావలి వెళ్లే టైమ్ లేదని భయపడిన వారంతా.. దగ్గరలోని కలిగిరి సెంటర్లో పరీక్షలు రాశారు. పిల్లలను తహశీల్దార్ తన కారులో, మరో ఆటోలో పరీక్ష కేంద్రానికి తరలించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఆర్‌ఐవో, అధికారులు వారికి కలిగిరిలోనే పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు వచ్చేలోపు పరీక్ష కేంద్రంలో అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.