రోడ్డుపై చెత్తబండి వెళ్తుంటే ఎవరైనా ఏం చేస్తారు..? వీలైనంత దూరంగా వెళ్లడానికి ట్రై చేస్తారు. కనీసం దాని దగ్గరగా వెళ్లడానికి కూడా భయపడతారు. అలాగే కోళ్ల ఫారంకి సంబంధించిన వాహనాలు, కోళ్ల వ్యర్థారను తరలించే వాహనాలకు కూడా జనం దూరంగా ఉంటారు. పోలీసులు కూడా వాటిని పెద్దగా పట్టించుకోరు. వాటి దగ్గరకు వెళ్లి మరీ తనిఖీ చేయాలనుకోరు. సరిగ్గా ఈ పాయింట్ నే పట్టుకున్నాడు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కుర్రాడు. కోళ్ల వ్యర్థాల మాటున పొరుగు రాష్ట్రాల మద్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నాడు.


కోళ్ల వ్యర్థాలమాటున తరలిస్తున్న అక్రమ మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని నెల్లూరు జిల్లా కోవూరు సెబ్ అధికారులు పట్టుకున్నారు. 60 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని వంశీ అనే యువకుడిని అరెస్టు చేశారు. అల్లూరు మండలం నార్తు ఆమూలూరుకు చెందిన వంశీ అనే కుర్రాడు కోళ్ల వ్యర్థాలను స్థానికంగా చేపల చెరువులకు చేరవేస్తుంటాడు. ఈ క్రమంలో కర్నాటకకు కూడా అదే వాహనం తీసుకుని వెళ్లి అక్రమంగా మద్యాన్ని ఏపీకి తరలిస్తున్నాడు. చెక్ పోస్ట్ ల వద్ద పోలీసుల కళ్లుకప్పాడు కానీ, నెల్లూరు జిల్లాలో వాటిని విక్రయించడానికి తీసుకెళ్తూ దొరికిపోయాడు. 




కర్నాటక మద్యాన్ని అల్లూరు ప్రాంతంలో అధిక ధరలకు విక్రయిస్తుంటాడు వంశీ. గతంలో కర్నాటక నుంచి శాంపిల్ గా కొన్ని బాటిళ్లు తీసుకొచ్చి అక్కడ అమ్మాడు. మంచి లాభం రావడంతో.. ఈసారి పెద్ద పథకమే వేశాడు. జనవరి 1, సంక్రాంతి.. ఇలా పండగల సీజన్ ఉండటంతో.. భారీగా స్టాక్ దింపాడు. 60లీటర్ల మేర మద్యాన్ని చిన్న, పెద్ద బాటిళ్లలో తీసుకొచ్చాడు. చికెన్ వేస్ట్ తో కలిపి వాటిని చేపల చెరువుల వద్దకు తీసుకెళ్లి అక్కడ పనిచేసే వారికి అమ్మాలని భావించాడు. ఎంచక్కా లారీలో చికెన్ వేస్ట్ ఉన్న డ్రమ్ముల్ని ఉంచాడు. ఓ డ్రమ్ములో పూర్తిగా మద్యం బాటిళ్లు పెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా బాగానే మేనేజ్ చేశాడు.


పక్కా సమాచారంతో.. 
గతంలోనే వంశీపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు అదనుకోసం వేచి చూశారు. తాజాగా నార్త్ ఆములూరు గ్రామం వద్ద చికెన్ వేస్ట్ ని తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకోగా.. అందులో చికెన్ వేస్ట్ తో పాటు మద్యం సీసాలు కూడా బయటపడ్డాయి. దీంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. మద్యంతోపాటు, వాహనాన్ని సీజ్ చేశారు. 


ఇతర రాష్ట్రాల మద్యంతో వ్యాపారం.. 
ఏపీలో మద్యం ధరలు అధికంగా ఉండటం, అందులోనూ మంచి బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో చాలామంది ఇతర రాష్ట్రాలనుంచి మద్యం తీసుకొచ్చి అమ్మడాన్ని వ్యాపారంగా మలచుకున్నారు. ఇటీవల ఏపీలో కూడా రేట్లు తగ్గించి, అన్ని బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చినా.. కర్నాటక మద్యంపైనే చాలామంది మక్కువ చూపుతున్నట్టు తెలుస్తోంది. అందుకే నెల్లూరు జిల్లాకు ఎక్కువగా కర్నాటక మద్యం అక్రమ మార్గాల్లో వస్తోంది. అప్పుడప్పుడు పోలీసుల తనిఖీల్లో ఇలా బయటపడుతోంది.