వారిద్దరూ కాంట్రాక్ట్ పనుల కోసం నెల్లూరు జిల్లానుంచి విశాఖకు వెళ్లారు. అరకులో రోడ్డు పనులు చేసే కాంట్రాక్టర్ వద్ద పనికి కుదిరారు. అక్కడి నుంచి నెల్లూరుకి అప్పుడప్పుడూ రాకపోకలు సాగించేవారు. ఈ క్రమంలో వారిద్దరూ గంజాయి వ్యాపారంపై దృష్టి సారించారు. అరకులో వారికి ఈజీగా గంజాయి దొరికేది. దాన్ని నెల్లూరు జిల్లాకు తీసుకొచ్చి అమ్మితే ఎక్కువ లాభం ఉంటుందని భావించారు. ఇప్పటికి చాలాసార్లు ఇలా దొంగచాటుగా గంజాయిని తరలించారు. కానీ ఇప్పుడు పక్కా ఇన్ఫర్మేషన్‌తో వారిలో ఒకరిని పోలీసులు పట్టుకున్నారు. మరో వ్యక్తిని అరకులో అరెస్ట్ చేస్తామని చెప్పారు.


ఏఎస్ పేట మండలం కొండమీద కొండూరు గ్రామానికి చెందిన భార్గవ్ రెడ్డి, గిరిధర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు అరకు వద్ద రోడ్డు పనులు నిర్వహిస్తున్న ఓ కాంటాక్ట్ కంపెనీలో పని చేస్తున్నారు. భార్గవ్ రెడ్డి అరకు నుంచి గంజాయి తీసుకొస్తున్నాడని ముందస్తు సమాచారంతో నెల్లూరుపాలెం చెక్ పోస్ట్ వద్ద కాపు కాసి అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సెబ్ సిఐ నయనతార ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. పట్టుబడిన భార్గవ్ రెడ్డి పై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు. అతనివద్ద ఉన్న 8కేజీల గంజాయిని సీజ్ చేశారు.


దర్గా ఉత్సవంలో గంజాయి దందా..


త్వరలో నెల్లూరు జిల్లాలోని ఏఎస్ పేటలో దర్గా గంధ మహోత్సవం జరగాల్సి ఉంది. ఆ గంధ మహోత్సవంలో గంజాయి అమ్మేందుకు భార్గవ్ రెడ్డి, గిరిధర్ రెడ్డి ఇద్దరూ ప్లాన్ వేశారు. ముందుగా భార్గవ్ రెడ్డ నెల్లూరు జిల్లాకు చేరుకున్నాడు. 8కేజీల గంజాయి తీసుకుని బయలుదేరాడు. అయితే అతను గంజాయి వ్యాపారం చేస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. వారు నెల్లూరుపాలెం చెక్ పోస్ట్ వద్ద మాటు వేశారు. సరిగ్గా భార్గవ్ రెడ్డి వచ్చే సమయానికి చుట్టుముట్టారు. అతడిని అరెస్ట్ చేశారు.


గతంలో నెల్లూరు జిల్లా కేంద్రంగా గంజాయి రవాణా బాగా జరిగేది. నెల్లూరు మీదుగా గంజాయిని రాష్ట్రం దాటించేవారు. చిత్తూరు జిల్లాకి కూడా తరలించేవారు. పోలీసులు చెక్ పోస్ట్ ల వద్ద తనిఖీలు చేసి గంజాయి అక్రమ రవాణాని అరికట్టేవారు. స్మగ్లర్లు ఆర్టీసీ బస్సుల్ని కూడా గంజాయి రవాణాకు ఎంపిక చేసుకునేవారు. పోలీసుల చాకచక్యంగా గంజాయి రవాణాను అడ్డుకునేవారు. తాజాగా నెల్లూరు జిల్లాలో కూడా గంజాయి వాడకం పెరిగిందని తెలుస్తోంది.


ఇటీవల కావలిలో గంజాయిని వినియోగిస్తున్న విద్యార్థులను పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు ఏఎస్ పేటలో గంజాయి వినియోగిస్తున్నట్టు పోలీసులు నిర్థారిస్తున్నారు. అరకు వెళ్లిన వారు గంజాయిని తీసుకొచ్చి ఇక్కడ విక్రయించడానికి సిద్దమవుతున్నారు. అంటే స్థానికంగా గంజాయి వాడకంపై వారికి సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులు గంజాయి తీసుకొచ్చే సమయంలోనే వారిని అడ్డుకున్నారు. 8కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.


ఏఎస్ పేట దర్గా ఉత్సవాల్లో చాటుమాటుగా గంజాయి విక్రయించాలనుకున్న వారిద్దరి ఆలోచన బెడిసికొట్టింది. ఒకరు ఇక్కడ పోలీసులకు చిక్కగా, మరొకరికోసం అరకు పోలీసుల సాయంతో నెల్లూరు పోలీసులు వెదుకులాట మొదలు పెట్టారు. అరకులో ఉన్న వ్యక్తి కూడా పోలీసులు వదిలిపెట్టేది లేదంటున్నారు.