నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ హత్య స్ధానికంగా కలకలం రేపింది. పక్క పక్కన ఇళ్లలో నివశించేవారి మధ్య గొడవ మొదలై చివరకు ఓ నిండుప్రాణం బలైంది. హత్య పథకం వేసిన అన్నదమ్ములు, మూడో కంటికి తెలియకుండా ఆ పథకం అమలు చేశారు. చివరకు పాత కక్షల వల్ల పక్కింటి వ్యక్తిని హత్య చేశారని తెలుసుకుని బాధిత కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. పైకి నమ్మకంగా ఉంటూ చివరకు హత్య చేశారు.


నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు సమీపంలోని స్టౌబీడీ కాలనీకి చెందిన షేక్‌ గౌస్‌ మొహియుద్దీన్‌ కనిపించడంలేదని అతని భార్య సలీమా ఈనెల 14న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సహజంగా ఇరుగు పొరుగువారిని విచారించారు. వారంతా ఆయనతో శతృత్వం లేనట్టే చెప్పారు. అయితే హంతకులు తమకు తామే బయటపడ్డారు. పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టే సరికి భయంతో నిజం చెప్పేశారు.


అసలేం జరిగింది.?


స్టౌబీడీ కాలనీలో గౌస్ మొహియుద్దీన్ పొరుగింటిలో రాము, ప్రసాద్‌ అనే అన్నదమ్ములు ఉండేవారు. గౌస్ మొహియుద్దీన్ ఇంటి వెనక ఉన్న ఖాళీ స్థలం విషయంలో వీరిమధ్య గొడవలు జరుగుతుండేవి. చిన్న చిన్న గొడవలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆరు నెలలుగా వారు గౌస్‌ తో సఖ్యతగానే ఉండేవారు. దీంతో ఎవరికీ అనుమానం రాలేదు. కానీ రాము, ప్రసాద్ మనసులో గౌస్ ని చంపాలన్న కసి పెంచుకున్నారు. తీరా ఆ రోజు రానే వచ్చింది. గౌస్ ని హత్య చేసి, శవాన్ని మూటగట్టి పెన్నా నదిలో పడేశారు. కర్రలతో తలపై బాది తీవ్రంగా గాయపరిచి గౌస్ ని హత్య చేశారు. గౌస్ స్కూటర్ ని కూడా పెన్నాలో పడేసి ఆనవాళ్లు లేకుండా చేశారు. దీంతో తన భర్త కనపడకుండా పోయాడంటూ భార్య కేసు పెట్టింది. ఈ కేసు, పోలీసుల విచారణతో రాము, ప్రసాద్ భయపడిపోయారు. గౌస్ ని తామే చంపామంటూ తండ్రికి చెప్పారు. దీంతో అతను ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఎస్సై వెంకటేశ్వరరావు వారిద్దరినీ తీసుకుని శవం పడేసిన స్థలం వద్దకు వెళ్లి వెదుకులాట ప్రారంభించారు. కానీ పెన్నా ప్రవాహం ఎక్కువగా ఉండటంతో శవం జాడ కనిపించలేదు.




పెన్నా ప్రవాహంలో శవం..?


పక్కా పథకం ప్రకారం పెన్నా ప్రవాహంలో శవాన్ని పడేసి మాయం చేశారు హంతకులు. శవంతోపాటు, అతడి వాహనాన్ని కూడా పెన్నా నదిలో పడేశారు. దాన్ని ఓ ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నారు. కానీ చివరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ తో భయపడి చిక్కిపోయారు. నిందితుల తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటపడింది. మృతుడు గౌస్ స్థానిక టీడీపీ నాయకుడు కావడంతో జిల్లా పార్టీ నేతలు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


కోవూరులో ఉద్రిక్తత..?


గౌత్ హత్య నేపథ్యంలో కోవూరు స్టౌబీడీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. గౌస్ కుటుంబ సభ్యులు నిందితుల ఇంటిన తగలబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో కొంతసేపు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికులంతా మంటల్ని ఆర్పేశారు. అయితే హంతకులు గుట్టు చప్పుడు కాకుండా తమ పథకం అమలు చేయడం, శవాన్ని మాయం చేయడం స్థానికంగా సంచలనంగా మారింది.