తండ్రీ కొడుకులు ఇద్దరూ టీచర్లు, తండ్రీ కొడుకులు ఇద్దరూ పోలీసాఫీసర్లు, తండ్రీ కొడుకులిద్దరూ డాక్టర్లు.. ఇలా చాలామందినే చూసి ఉంటారు. కానీ తండ్రీ కొడుకులిద్దరూ దొంగలు కూడా ఉంటారు. తండ్రి దొంగ అయితే కొడుకు మంచివాడు కావొచ్చు, కొడుక్కి దొంగ లక్షణాలు వస్తే, తండ్రి మందలించే మంచి మనిషి కూడా కావొచ్చు. కానీ నెల్లూరుజిల్లాలో ఆ తండ్రీ కొడుకులు మాత్రం తోడు దొంగలు. ఇద్దరూ కలసి డ్యూటీకి వెళ్లినట్టు దొంగతనానికి వెళ్తారు. పని ముగించుకుని ఇంటికి వస్తారు, జల్సా చేస్తారు. డబ్బులైపోగానే మళ్లీ దొంగతనానికి బయలుదేరతారు. ఇదీ వారి దినచర్య.
కొడుకు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన తండ్రి ఆ తప్పుకు వంతపాడాడు. ఇంకా చెప్పాలంటే ఆ తండ్రే కొడుక్కు తప్పులు నేర్పించాడు. అలా ఇద్దరూ కలసి దొంగతనాలు చేస్తూ జల్సాలు చేసేవారు. చివరకు పోలీసులకు చిక్కారు. నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట మండలం ముదివర్తి పాలెంకు చెందిన దొడ్ల సంతోష్ అతని కొడుకు సందీప్ ఇద్దరూ బైక్ దొంగతనాల్లో ఆరితేరారు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 28 బైక్ లు దొంగతనం చేశారు. గతంలో ఆటోలు దొంగతనం చేసి జైలుకెళ్లొచ్చినా వీరి బుద్ధి మారలేదు. తాజాగా బైక్ దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కారు. వీరి వద్ద 16 లక్షల రూపాయలు విలువ చేసే 28 బైక్ లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గతంలో సంతోష్, సందీప్ ఇద్దరూ ఆటో దొంగతనాలు చేసేవారు. తమ కాలనీతోపాటు.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆటోలు దొంగిలించి వాటిని తక్కువ రేటుకి అమ్మేసేవారు. ఆ క్రమంలో పోలీసులకు చిక్కారు, జైలు శిక్ష అనుభవించి వచ్చారు. తాజాగా మరోసారి తమ చేతివాటం చూపించారు. ఈసారి బైక్ దొంగతనాలు నేర్చుకున్నారు. ఇటీవల నెల్లూరు నగరంతోపాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్లలో పార్కింగ్ చేసిన వాహనాలు సైతం మాయమవుతున్నాయనే ఫిర్యాదు మేరకు పోలీసులు బైక్ దొంగలపై దృష్టి పెట్టారు. పాత నేరస్తుల వివరాలు సేకరించడంతో పని మరింత సులువైంది. సంతోష్, సందీప్ ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. వారి దగ్గరనుంచి 28 బైక్ లు దొంగతనం చేశారు.
హ్యాండిల్ లాక్ వేసి ఉన్నా కూడా బైక్ తాళం సులభంగా తీసే టెక్నిక్ తెలుసుకున్నారు ఆ తండ్రీ కొడుకులు. అంతే.. ఒకదాని తర్వాత ఒకటి బైక్ లు మాయం చేసేవారు. అలా 28 బైక్ లు దొంగతనం చేసి వాటిని తమకి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో పెట్టారు. వాటిని అమ్మే క్రమంలో పోలీసులకు చిక్కారు. నెల్లూరు నగరం ప్రశాంతి నగర్ జాతీయ రహదారిపై వద్ద వీరిద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు పోలీసులు. నెల్లూరు జిల్లాలో నవాబుపేట, బుచ్చిరెడ్డిపాలెం, విడవలూరు పోలీసు స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాలతోపాటు తిరుపతి జిల్లాలోని చిల్లకూరు, గూడూరు, కోట, నాయుడుపేట, తిరుచానూరు, అన్నమయ్య జిల్లా చిట్వేల్ ప్రాంతాల్లో బైక్ లు దొంగలించినట్లు నిందితులు అంగీకరించారు. దాంతో నిందితులను అరెస్టు చేసి తండ్రి దొడ్ల సంతోష్ పై నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 38 కేసులు ఉండటం విశేషం.