ఢీ ప్రోగ్రామ్ పేరు ఇస్తుంది కానీ, సంపాదన తక్కువగా ఇస్తుంది. జబర్దస్త్ పేరుతోపాటు సంపాదన కూడాబాగా ఇస్తుంది. ఇదీ డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆవేదన. అయితే సంపాదనకంటే ఎక్కువ అప్పులు చేసి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఢీ ప్రోగ్రామ్ తో పేరు వచ్చినా, సంపాదించుకోలేకపోతున్నామని, ఇల్లు, టీవీలు.. ఏవీ కొనుక్కోలేకపోయామని సెల్ఫీ వీడియోలో చెప్పారు చైతన్య. నెల్లూరులోని క్లబ్ లో ఆత్మహత్య చేసుకున్న చైతన్య సెల్ఫీ వీడియోని తన స్నేహితులకు పంపించాడు. ఆ తర్వాత ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


టీవీలో వచ్చే షో లో ఒక్కసారి కనపడితే చాలు సెలబ్రిటీ అయిపోవచ్చని చాలామంది కలలు కంటుంటారు. అలాంటి వారికి ఇటీవల చాలా ప్రోగ్రామ్ లు చేయందించాయి. చాలామంది టీవీ షోలతో పాపులర్ అయ్యారు, ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ షో నుంచి వస్తున్నవారు సినిమా రంగంలో కూడా స్థిరపడుతున్నారు. జబర్దస్త్ తోపాటు వస్తున్న ఇతర షో లు కూడా నటీనటులు, డ్యాన్సర్లకు సినిమాల్లో అవకాశాలు లభించేలా చేస్తున్నాయి. కానీ వాటిని ఉపయోగించుకోవడం ఎంతమందికి తెలుసు. ఆ పేరుని కాపాడుకుంటూ అంచెలంచలుగా ఎదగడం ఎంతమంది చేస్తున్నారు. కొద్దిమంది మాత్రం నేలవిడిచి సాము చేస్తున్నారు. అలా విపరీతంగా అప్పులు చేసి, అవి తీర్చలేక ఉరి వేసుకుని చనిపోయాడు డ్యాన్స్ మాస్టర్ చైతన్య. సెల్ఫీ వీడియోలో ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. 


ఢీ ప్లాట్ ఫామ్ నుంచి వచ్చిన డ్యాన్సర్లు ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్లుగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. వారికి పేరుతోపాటు సంపాదన కూడా ఉంది. అయితే తమకి వచ్చిన పేరుని సరైన మార్గంలో ఉపయోగించుకున్నారు, జాగ్రత్తపడ్డారు, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. అంతెందుకు నెల్లూరులో చైతన్య సూసైడ్ చేసుకున్నాడు, ఇదే నెల్లూరుకి చెందిన జానీ మాస్టర్ ఇప్పుడు ఇండస్ట్రీలో పేరున్న కొరియోగ్రాఫర్. ప్రస్తుతం హీరోగా కూడా ఓ సినిమాలో నటిస్తున్నాడు. శేఖర్ మాస్టర్ లాంటి వారు కూడా ఢీ ప్లాట్ ఫామ్ ఉపయోగించుకుని ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారు. కానీ చైతన్య ఎందుకో ఓడిపోయాడు. అర్థాంతరంగా తనువు చాలించాడు. అప్పులు తీర్చే సత్తా తనకు ఉంది అని చెబుతూనే.. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను అంటూ ఉరేసుకున్నాడు. 


జబర్దస్త్ డబ్బులిస్తుంది, ఢీ పేరు మాత్రమే ఇస్తుందన్నాడు చైతన్య. అయితే చాలామంది ఈ మాటలతో ఏకీభవించడంలేదు. జబర్దస్త్ నటీనటులు తమకి వచ్చిన పేరుతో సినీ ఇండస్ట్రీలో అవకాశాలకోసం ఎదురు చూశారు, కొంతమంది సక్సెస్ అయ్యారు. మరికొందరు ఇంకా ఆ అవకాశాలకోసం ఎదురు చూస్తున్నారు. పేరు వచ్చిందా, ప్రోగ్రామ్ లతో డబ్బులు వచ్చాయా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. ఆయా ప్రోగ్రామ్ ల ద్వారా వచ్చిన పేరుని ఎంత సమర్థంగా ఉపయోగించుకున్నామా అనేదే ఇంపార్టెంట్. ఢీ లోకి ఎంట్రీకోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. అలాంటివారందరికంటే చైతన్య చాలా గొప్ప స్థానం అందుకున్నారనే చెప్పాలి. కానీ అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. 


నెల్లూరులో సన్మానానికి వచ్చిన మరుసటి రోజే ఆయన ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. సన్నానాలు, సత్కారాలు వస్తున్నాయి కానీ, అప్పులు తీర్చే దారి దొరకలేదని చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు.