రాజకీయాలు వదిలేసి పూర్తిగా సినిమాలకు టైమ్ కేటాయించిన తర్వాత చిరంజీవి మళ్లీ అందరివాడుగా మారిపోయారు. కానీ పనిగట్టుకుని ఆయన్ను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. ఆ మధ్య తమ్ముడు ఉన్నత స్థాయికి రావాలని, రాజకీయాల్లో రాణించాలంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు ఘాటుగానే బదులిచ్చారు. ఆ తర్వాత వాల్తేరు వీరయ్య సినిమా నాటికి చిరంజీవిలో మరింత పరిణతి వచ్చింది. తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని, తనకు వైసీపీ అయినా, జనసేన అయినా ఒకటేనని, ఎవరి తరపునా తాను ప్రచారం చేసేది లేదన తేల్చి చెప్పారు. దీంతో చిరు రాజకీయాలపై జనాలకు బాగానే క్లారిటీ వచ్చింది. మరి కాంగ్రెస్ మాత్రం ఆయన్ను ఇంతా తమవాడిగానే చెప్పుకోవడం విశేషం.


చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారని, ఆయనతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. అలాంటి కాంగ్రెస్ అధ్యక్షుడు ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనే లాజిక్ ఎవరికీ అవసరం లేదు. అయితే ఆయన మాట్లాడింది మెగాస్టార్ గురించి కాబట్టి, అందులోనూ చిరంజీవి రాజకీయాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ఏపీగా ఉన్నాయి కాబట్టి రుద్రరాజు వ్యాఖ్యలపై అందరికీ ఆసక్తి మొదలైంది. అసలు చిరంజీవి నిజంగానే కాంగ్రెస్ నుంచి బయటకొచ్చేశారా..? ఒకవేళ జోడో యాత్రతో కాంగ్రెస్ సుడి తిరిగి కేంద్రంలో హస్తం పార్టీ హవా మొదలైతే మళ్లీ చిరంజీవి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ తో తెరపైకి వస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. 


ఆ మధ్య గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి చిరంజీవి ఆ సినిమాలోని ఓ డైలాగ్ ని ట్విటర్లో షేర్ చేశారు. రాజకీయం తన నుంచి దూరం కాలేదనని చిరంజీవి చెప్పే డైలాగ్ ని సినిమా ప్రమోషన్ కోసం వాడుకోవాలనుకున్నారు. కానీ అది పొలిటికల్ డిస్కషన్ గా మారింది. ఆ తర్వాత అది సినిమాలో డైలాగ్  మాత్రమేనని తేలడంతో అందరూ దాన్ని పట్టించుకోవడం ఆపేశారు. కానీ కాంగ్రెస్ కాస్త హడావిడి చేసింది. ఆ డైలాగ్ వచ్చిన కొన్నిరోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఐడీకార్డ్ బయటకు వచ్చింది. చిరంజీవిని కాంగ్రెస్ డెలిగేట్ గా పేర్కొంటూ ఇచ్చిన ఐడీగార్ట్ అది. దాని కాలపరిమితి 2027 వరకు ఉంది. అంటే చిరంజీవి ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నారా అనే అనుమానం మళ్లీ మొదలైంది. 


చిరంజీవికి రాజకీయాలు అవసరం లేదు, ఆయనకు ఆసక్తి కూడా లేదనే విషయం తేలిపోయింది. ఒకసారి రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో చేదు అనుభవాలు ఆయన రుచి చూశారు. కేంద్ర మంత్రి అయ్యారన్న మాటే కానీ, ఆయన అంతకంటే ఎక్కువ విమర్శలే ఎదుర్కున్నారు. విచిత్రం ఏంటంటే.. ఇప్పటికీ ఆయనపై విమర్శలు ఆగలేదు. ఏపీ మంత్రి రోజావంటివారు ఇప్పటికీ చిరంజీవిని టార్గెట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. వాటన్నిటినీ మౌనంగానే భరిస్తున్న చిరంజీవి పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ దశలో కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చేసిన కామెంట్లు కాస్త హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై చిరంజీవి తరపున ఎవరైనా వివరణ ఇస్తారా, లేక రుద్రరాజు స్టేట్ మెంట్లకు కూడా వివరణ ఏంటని సైలెంట్ గా ఉంటారా.. వేచి చూడాలి.